
చిత్రం: అన్నమయ్య రచన: అన్నమయ్య
గానం: ఎస్.పి.బాలు సంగీతం: ఎం.ఎం.కీరవాణి
తనకు 95 సంవత్సరాలు వచ్చే నాటికి 32 వేల సంకీర్తనలు రాసిన అన్నమయ్య, అంత్య దశలో ‘అంతర్యామి... అలసితి... సొలసితి...’ అంటూ రాసిన మొదటి వాక్యంలోనే తన పరిస్థితి వివరించాడు. ఒకనాటి అర్ధరాత్రి ఏమనిపించిందో, ఏమో తను రచించిన సంకీర్తనల తాలూకు తాళపత్ర గ్రంథాలు పట్టుకుని, గుడిమెట్లు ఎక్కుతుంటే ఒక్కసారి ఒళ్లు తుళ్లి సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి వక్షస్థలం మీద వాలతాడు. తలెల్తి చూసేసరికి, ఆ తిరుమలరాయుడు కంటికి కనిపిస్తాడు.
‘‘ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా, ఆభయహస్తంతో, కరుణామృతధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా, నా తల్లులిద్దరూ నెలవుండే ఈ గుండెల పైన నన్ను చేర్చుకున్నావా స్వామీ, నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలం ఇంత పెద్ద భూరి ముట్ట చెప్పావా. నా జన్మ తరించింది, ఇదిగో నీ సొమ్ము, భద్రంగా దాచుకో’’ అని సాక్షాత్తు ఆ వేంకటేశ్వరునికి బహుమతి ఇవ్వడానికి వచ్చినవాడిలా మాట్లాడతాడు. ‘‘అన్నమయ్యా! నీ ఆయుష్షు పెంచుతానయ్యా, నిత్య యవ్వనంలో ఉండి పాటలు రాస్తూండు...’’ అంటూ అన్నమయ్య రచించిన కొన్ని కీర్తనలు తన దేవేరులతో కలిసి గానం చేస్తాడు.
వారు పాడుతుంటే సంబరపడి పోతూనే, ‘‘అలసిపోయానయ్యా! నాకింక మోక్షం ప్రసాదించు తండ్రీ!’’ అని అభ్యర్థిస్తాడు. అప్పుడు వేంకటేశ్వరస్వామి బేరానికి వచ్చి, ‘‘ఆఖరి పాట ఒక్కటి రాయవయ్యా నా కోసం’’ అంటాడు. అన్నమయ్య ఉప్పొంగిపోతాడు. అంతర్యామి అలసితి సొలసితి ... ఇంతట నీ శరణిదే సొచ్చితిని... అనే కీర్తన ఆలపిస్తాడు. తను ఎందుకు బయలుదేరాడో, తన మనసులో ఏ ఆలోచన ఉందో, ఆ ఆలోచన, ఆ ప్రయాణమే ఆ కీర్తనకు మకుటమైంది. ‘‘కోరిన కోర్కెలు.... కోయని కట్లు తీరవు నీవవి తెంచక...’’ ఒక చెట్టుకు కాసిన కాయలను ఎవరో ఒకరు తెంచకపోతే అవి కిందపడదు.
అలాగే ఒంటి నిండా ఉన్న కోర్కెలను ఎవరో ఒకరు వచ్చి తెంచేయాలి. కోర్కెలన్నీ తెంచుకుని వస్తేనే ఆ స్వామిని చేరుకోగలం. ‘‘భారపు పగ్గాలు... పాపపుణ్యములు... నేరుపునబోవు నీవు వద్దనక...’’ ఎన్ని ఆశలు, వ్యామోహాలు పెంచుకున్నా... అవి పాపపుణ్యాల వంటివే. అవన్నీ భారపు పగ్గాల్లా వెనక్కు లాగుతూనే ఉంటాయి. అవి తెంచుకుంటేనే స్వామిని చేరగలమని నాకు తెలుసు... అంటాడు అన్నమయ్య. ఈ కీర్తనలో ప్రతి మనిషి తెలుసుకోవలసిన వేదాంతాన్ని, తత్వాన్ని బోధించాడు అన్నమయ్య. ఎంత సంపద ఉన్నా... చివరకు ఆ స్వామిని చేరవలసినదే అనే తత్వాన్ని తన జీవితానుభవంతో వర్ణించాడు అన్నమయ్య.
– సంభాషణ: డా. వైజయంతి