కోయంబత్తూరులోని గవర్నమెంట్ ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి కోవిడ్ వార్డులో కరోనా కంటే కూడా స్నేహను (అసలు పేరు కాదు) ఎక్కువగా భయపెట్టింది.. తొలిరోజు ఒంటరితనం! 26 ఏళ్ల అమ్మాయి. దేనికీ భయపడని అమ్మాయి. తనే ఆసుపత్రికి వచ్చి, తనే టెస్ట్ చేయించుకుని, తనే అడ్మిట్ అయిన అమ్మాయి. రెండు రోజులు చూసి మూడో రోజు మామూలైపోయింది! తనతో పాటు తెచ్చుకున్న ల్యాప్‌ట్యాప్, కొన్ని పుస్తకాలు.. వాటిలో పడిపోయింది స్నేహ. స్పెయిన్‌లో ఎంబీయే చేస్తోంది ఆమె. రెండో సెమిస్టర్ ఫైనల్ పరీక్షలకు ముందు ఇండియా వచ్చింది. తిరిగి వెళ్దామనుకునే లోపు కరోనా పాజిటివ్‌తో మార్చి 16న హాస్పిటల్‌లో చేరింది. కరోనా నెగిటివ్‌తో ఏప్రిల్ 6న డిశ్చార్జ్ అయింది. మధ్యలో మూడు వారాల ఒంటరితనం. ఒకరోజుకే ఒణికిపోయిన స్నేహ ఇన్నిరోజుల ఒంటరితనంతో ఎలా ఫైట్ చేసింది. ఫైట్ చెయ్యలేదు. స్నేహం చేసింది! ఒంటరితనంతో స్నేహం ఎవరైనా చేయగలిగిందే. ఐసొలేషన్ ఒంటరితనంలోకి వెళ్లే సాహసాన్ని చేసింది స్నేహ. అందుకు ఆశ్చర్యపోవాలి.
స్పెయిన్ నుంచి మొదట ఢిల్లీకి, ఢిల్లీ నుంచి కోయంబత్తూర్‌కి వచ్చింది స్నేహ. నేరుగా ఇంటికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షకు శాంపిల్స్ ఇచ్చింది. రిపోర్టులు వచ్చేవరకు ఇంట్లో ఎవరితోనూ కలవకుండా వేరుగా ఉంది. రిపోర్ట్స్‌లో నెగటివ్ అని వచ్చాక కూడా మూడు రోజులు వేరుగా ఉండి మళ్లీ టెస్ట్‌లకు వెళ్లింది. స్పెయిన్‌లో తన క్లాస్‌మేట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అదీ అనుమానం స్నేహకు. చివరికి ఆమె అనుమానం నిజమైంది.
తనకూ పాజిటివ్! వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. మళ్లీ ఇంకో అనుమానం. అమ్మకు, నాన్నకు వచ్చి ఉంటుందా అని! వాళ్లకు టెస్ట్ చేయించింది. నెగటివ్ అని రావడంతో ఆమె మనసులోని భారం దిగిపోయింది. ఈలోగా స్నేహ గురించి వాట్సాప్ గ్రూపులలో వదంతులు! ఫలానా ఏరియాలో, ఫలానా వాళ్ల అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చిందనీ.. ఇక్కడ మాల్స్‌లో, మార్కెట్‌లో తిరిగిందనీ, ఆసుపత్రి నుంచి పారిపోయిందనీ, పట్టుకొచ్చి మళ్లీ హాస్పిటల్‌లో పెట్టారనీ.. ఇలాంటివి. వాళ్లుండే అపార్ట్‌మెంట్‌లో స్నేహ తల్లికీ అంతా దూరంగా జరిగారు. స్నేహకు ఎలా ఉంది అని దగ్గరగా వచ్చి అడగడానికి కూడా వాళ్లు సంశయించారు. బయట స్నేహ తండ్రిని కొందరు ఆపి అడిగేవారు.. ‘పాపకు ఇలాగయిందట కదా’ అని. ఇంత జరిగిందని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తెలిసింది స్నేహకు.
మనిషి పక్కన లేకపోతేనే ఐసొలేషన్‌లా ఉంటుందే.. ఇక మనుషులే ఉండని ఐసొలేషన్ అంటే.. అంతరిక్ష ద్వీపంలో మినుకు మినుకుమనే ఒంటరి నక్షత్రమే. స్వప్న అనే ఈ నక్షత్రం చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఐసోలేషన్ నుంచే ఎంబీయే పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని! పైపైన చదువుదామని పుస్తకాలు తెచ్చుకున్న అమ్మాయి పరీక్షల కోసం స్పెయిన్ కాలమానాలకు అనుగుణంగా రేయింబళ్లు చదివింది. ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసింది. రాసిన నాలుగు సబ్జెక్టులూ పాస్ అయింది. ఆరోగ్యం పూర్తిగా నయమై బయటికి వచ్చేనాటికి స్నేహ సెకండ్ సెమిస్టర్ కూడా పూర్తయింది. ఒక్కోసారి ఆమె తెల్లవారు జామున 3 గంటల వరకు చదువుతూ కూర్చునేది. ఊరికే చదివితే కాదు. క్లాసులూ వినాలి.
అక్కడ స్పెయిన్‌లో మధ్యాహ్నం క్లాసులు మొదలయ్యే సమయానికి ఇక్కడ సిస్టమ్‌లో తను లాగ్ అయ్యేది. వాళ్లు పెట్టిన గడువు సమయానికి అసైన్‌మెంట్‌లు పూర్తి చేసి పంపడానికి ఇక్కడ తన టైమ్‌ని సర్దుబాటు చేసుకునేది. ఆసుపత్రి నుంచి వచ్చేసే రోజైతే అక్కడి ఇంటెర్న్‌షిప్ ఇంటర్వూ్యకి కూడా ఆన్‌లైన్‌లోనే హాజరైంది స్నేహ. డిశ్చార్జి అయి ఆపార్ట్‌మెంట్‌కి రాగానే ముప్పైమంది వరకు స్నేహకు ఎదురొచ్చి చప్పట్లతో స్వాగతం పలికారు. కొందరు గేటు దగ్గర, కొందరు లిఫ్టు దగ్గర, కొందరు బాల్కనీలలో పూలగుత్తులతో నిలుచున్నారు. పక్కన మనుషులు లేనప్పుడు మాత్రమే కాదు.. చుట్టూ ఎందరున్నా మనకు మనం లేకుండా పోయినప్పుడు మిగిలేది కూడా ఒంటరితనమే. మనకు మనం ఉండటమంటే.. మన లక్ష్యాల వైపు, గమ్యాలవైపు ఒంటరిగానైనా ప్రయాణించగలగడం. ఒంటరితనంలోనూ జీవించగలగడం.
Comments
Please login to add a commentAdd a comment