సర్పంచ్‌ మంజూదేవి  | Special Story About Sarpanch Manju Devi In Family | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ మంజూదేవి 

Published Sun, Apr 5 2020 4:33 AM | Last Updated on Sun, Apr 5 2020 5:26 AM

Special Story About Sarpanch Manju Devi In Family - Sakshi

నీనాగుప్త ఎవర్నీ ఒక మాట అనలేరు. వాదించలేరు. వేలెత్తి చూపలేరు. పెత్తనం అసలే చెలాయించలేరు. మెత్తని మనిషి. మొట్టికాయకు తల వంచుతారు. చీమ చిటుక్కుమనకుండా చూసి నడుస్తారు. ఇన్ని బలహీనతలు ఉన్న నీనా.. ‘పంచాయత్‌’లో ఒక బలమైన పాత్రను వేశారు! అంత బలం ఆమెకు ఎలా వచ్చింది? ఆమె బలహీనతలే ఆమె బలం కనుక!

‘‘కొత్త గ్రామ కార్యదర్శి వచ్చాడు. రాత్రి భోజనానికి ఇంటికి రమ్మని పిలుద్దాం’’.
ఆ మాటకు మంజూదేవి భర్తవైపు చూసింది.
‘‘పిలువు. కొత్త సెక్రెటరీతో పాటు ఆ ప్రహ్లాద్‌ని, వికాస్‌ని, ఇంకా దార్లో ఎవరైనా కనిపిస్తే వాళ్లనూ ఒక డజను మందిని పిలుచుకుని రా. వండి పెడతాను’’ అంది. గ్రామ సర్పంచ్‌ ఆమె. ప్రహ్లాద్‌ ఉప సర్పంచ్‌. వికాస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌. కొత్తగా వచ్చిన ఆ గ్రామ కార్యదర్శి అభిషేక్‌. 
‘‘కొత్తగా ఉద్యోగంలో చేరాడు. కుర్రాడు. ఉండటానికైతే పంచాయితీ ఆఫీస్‌లోనే ఉంటాడు. సర్పంచ్‌వి అయుండీ, గ్రామ కార్యదర్శిని కలవకపోతే మర్యాదగా ఉంటుందా? భోజనానికి పిలిస్తే బాగుంటుంది’’ అన్నాడు మంజూదేవి భర్త. ఆయన పేరు బ్రిజ్‌ భూషణ్‌ దూబే. దూబేనే కానీ.. గ్రామంలో అందరికీ అతడు మంజూదేవి భర్త మాత్రమే. భర్తే కాదు, ఊరు కూడా ఆమె దగ్గర నోరెత్తదు. 
‘‘ఇంట్లో ఎదిగిన పిల్లను పెట్టుకుని ముక్కూమొహం తెలియనివాణ్ని ఇంటికి ఎలా పిలవడం?’’ 
‘‘మన కులమే. పిలిస్తే ఏం పోయింది?’
‘‘అయితే పిల్లనిచ్చి పెళ్లి కూడా చెయ్యి’’
‘‘చెయ్యొచ్చు కానీ, జీతం బాగా తక్కువ’’ అన్నాడు దూబే. 
మొత్తానికి ఆ రాత్రి భోజనానికి మంజూదేవి నుంచి ఆహ్వానం అందింది కొత్త కార్యదర్శికి.  
‘‘అన్నీ రుచిగా ఉన్నాయి’’ అన్నాడు అభిషేక్, దూబేతో కలిసి కూర్చొని తింటూ. 
‘‘ఇదిగో.. రుచిగా ఉన్నాయట’’.. చెప్పాడు దూబే.. దూరంగా పొయ్యి దగ్గర పూరీలు చేస్తున్న మంజూదేవితో. 
మంజూదేవి పూరీలా పొంగిపోలేదు. ‘‘ముప్ఫై నాలుగేళ్లుగా చేస్తున్నా. ఇంకెలా ఉంటాయి మరి’’ అంది సీరియస్‌గా.

శుక్రవారం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమ్‌ అయిన ఎనిమిది ఎపిసోడ్‌ల ‘పంచాయత్‌’ వెబ్‌ సిరీస్‌లోని చిన్న సన్నివేశం ఇది. నీనా గుప్తానే ఆ మంజూదేవి. ఊళ్లోని ఊడలమర్రిలో దెయ్యం ఉందని తను నమ్మి, పద్నాలుగేళ్లుగా ఊరిని నమ్మిస్తూ, ఊరివాళ్లందర్నీ భయకంపితుల్ని చేస్తున్న సైన్స్‌ మాస్టార్‌ను ఇంటికి పిలిపించి, కట్టెతో ఒళ్లంతా వాతలు తేలేలా మంజూదేవి అతడిని కొట్టే సీన్‌ ఒకటి రెండో ఎపిసోడ్‌లో ఉంది. ఆ కోపం, ఆ అసహనం, ముక్కుసూటి తత్వం, నిక్కచ్చిగా ఉండటం.. మంజూదేవి లోని ఈ గుణాలన్నిటినీ చక్కగా పోషించారు నీనాగుప్త. అయితే నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఆమె ఒక ‘బలహీనమైన’ మనిషి అని తెలిసినప్పుడు ఆశ్చర్యపడవలసిందేమీ ఉండదు కానీ.. ఆ సంగతిని స్వయంగా ఆమే బయటికి చెప్పుకోవడమే ఆమె బలమేమో అనిపిస్తుంది.

ఈ మధ్య ఇచ్చిన వరుస ఇంటర్వూ్యలలో నీనాగుప్త.. అచ్చంగా మంజూదేవిలానే.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేశారు. ‘జీవితంలో మనం ఒక తప్పు చేశామంటే, ఆ తప్పుకు మన పిల్లలు తప్పక మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది’ అని ఒకసారి, ‘నా జీవితాన్ని నేను మళ్లీ మొదట్నుంచీ జీవించే అవకాశం వస్తే.. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనే పని మాత్రం చేయను’ అని ఒకసారి అన్నారు. క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌తో సహజీవనం కారణంగానే నీనాగుప్తకు మసాబా పుట్టింది. ఎదుగుతున్న క్రమంలో మసాబా సమాజం నుంచి అయిష్టమైన చూపులను, ప్రశ్నలను చాలానే ఎదుర్కొవలసి వచ్చింది. దాని గురించి తల్లీకూతురు మాట్లాడుకునేవారు.

ఒకరి పరిస్థితులను ఒకరు అర్థం చేసుకుంటున్నారంటే వాళ్లిక తల్లీకూతుళ్లు కాదు. స్నేహితులు. ఆ స్నేహబంధమే తనను ఇప్పటికీ గట్టిగా నిలబెడుతోందని ఇంకొక ఇంటర్వూ్యలో చెప్పారు నీనా. అయితే కూతురి కన్నా ముందు ఆమెను నిలబెట్టినవి ఆమె జీవితంలో చాలానే ఉన్నాయి. ఎనభైలలో తను ప్రేమించి కలిసి జీవించిన రిచర్డ్స్, ‘సాత్‌ సాత్‌’ (1982) మొదలు.. మొన్నటి ‘బదాయీ హో’ (2018), ఇటీవలి ‘శుభ్‌మంగళ్‌ జ్యాదా సావన్‌’ వరకు అరవైకి పైగా సినిమాలు, ఇరవైకి పైగా టీవీ సీరియళ్లు, అవార్డులు ఆమెను మంచి నటిగా నిలబెట్టాయి. అయితే మంచి తల్లిగా నిలబడ లేకపోయానన్న బాధ ఒకటి ఆమెలో ఉండిపోయింది. ఆ బాధను పోగొట్టుకునేందుకు ఆమె ఆశ్రయించేది మళ్లీ తన కూతుర్నే!

ఉత్తరాఖండ్‌లోని ముఖ్తేశ్వర్‌లో ఈ మధ్య షూటింగ్‌ జరుగుతున్నప్పుడు తనను కలిసిన అభిమానులతో కొద్దిసేపు మాట్లాడారు నీనా గుప్త. ప్రేమ.. పెళ్లి.. వీటి టాపిక్‌ వచ్చింది. ‘‘ఒకటి చెబుతున్నా గుర్తుంచుకోండి అమ్మాయిలూ. పెళ్లయిన మగాడిని మాత్రం ప్రేమించకండి. ఆ తప్పును నేను చేశాను. మీరు మాత్రం చేయకండి’’ అని సలహా ఇచ్చారు నీనా. ఇంత బోల్డ్‌గా చెప్పడానికి, చెప్పుకోడానికి మానసికంగా ఎంత బలవంతురాలై ఉండాలి!

ఈ ఏడాది విడుదల కాబోతున్న బాలీవుడ్‌ చిత్రం ‘83’లో కపిల్‌దేవ్‌ తల్లిగా నటిస్తున్నారు నీనాగుప్త. ప్రస్తుతం ‘పంచాయత్‌’లో మంజూదేవిగా జీవిస్తున్నారు. ‘‘మంజూదేవిలా కాదు నేను. ఆధిక్యాన్ని ప్రదర్శించలేను. వాదించలేను. ఎవరి దగ్గరా బాస్‌గా ఉండలేను. ఇంట్లో కూడా. ఊరికే ఒత్తిడికి లోనవుతాను. ఎలాంటి వారితోనైనా సర్దుకునిపోతాను’’ అన్నారు నీనా.. పంచాయత్‌ ప్రీ స్ట్రీమ్‌ ఇంటర్వూ్యలో. సర్దుకుపోయేవాళ్లను మించిన బలవంతులు ఉంటారా మేడమ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement