బిడ్డ తాగే పాలలో నీళ్లు కలిపేటప్పుడు ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తాను భవిష్యత్తులో విజేతగా నిలుస్తానని అప్పుడామె ఏ మాత్రం ఊహించలేదు. తాను చదివిన పదో తరగతి చదువుకి చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదెవ్వరూ. అలాంటి తనను పెద్ద విద్యాసంస్థలు సగౌరవంగా ఆహ్వానించి మరీ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో లెక్చర్ ఇప్పించుకుంటాయని ఆనాడు ఆమె ఊహకు కూడా అందలేదు. ‘తన జీవితమే తానిచ్చే సందేశం’ అనే పెద్ద మాటలు చెప్పడం లేదు, కానీ తన జీవితాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తోంది శిల్ప.
‘‘శిల్ప 2009 వరకు భర్త సంరక్షణలో జీవించిన గృహిణి. ఒక బిడ్డకు తల్లి. భర్త రాజశేఖర్ వ్యాపారి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. కర్నాటక రాష్ట్రం, హసన్‌లో ఉన్న తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా తన దగ్గరకు వచ్చేయమని చెప్పింది. అలా అందరూ బళ్లారిలో ఉంటున్నారు. ఓ రోజు ఉదయం ఇంటి నుంచి బెంగళూరుకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి ఇంటికి రాలేదు. అతడికి ఏమైందో తెలియదు. మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది తప్ప అతడి ఆచూకీ తేలలేదు. శిల్ప మానసికంగా కుంగిపోయింది. భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఏమయ్యాడో తెలియదు. ఆమెకి తెలిసిందల్లా తాను, తన బిడ్డ దిక్కులేని వాళ్లమయ్యామనే చేదు నిజం మాత్రమే. తనను నమ్ముకుని తనతోనే ఉంటున్న తల్లిదండ్రులు, తమ్ముడి బాధ్యత కూడా తన మీదనే ఉంది. భవిష్యత్తు అగమ్యగోచరం.
పాలలో నీళ్లు
రోజురోజుకీ బతుకు కష్టమవుతోంది. పిల్లవాడికి పాలు కలుపుదామని గ్లాసు తీసుకుంది. పాల గిన్నెలో అడుగున ఉన్నాయి పాలు. ఆ పాలలో అరగ్లాసు నీళ్లు పోసింది శిల్ప. ఆమె పోసిన నీళ్లతోపాటు ఆమె చెంపల మీదుగా కారిన కన్నీళ్లు కూడా ఆ పాలలో కలిసిపోయాయి. ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చిందామె. తన బిడ్డను పోషించుకోవడానికి తాను పని చేయాలి. రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం ఇంటర్వూ్యకెళ్లింది. సేల్స్ ఉమన్‌గా ప్రయత్నించింది. వంట మనిషి కావాలనే ప్రకటన చూసి ఆ ఉద్యోగం కోసమూ వెళ్లింది. హౌస్ కీపింగ్ ఉద్యోగమూ రాలేదు. ఏ ఉద్యోగానికి వెళ్లినా సరే అందరూ అడిగే కామన్ ప్రశ్న ‘నీ భర్త గురించిన వివరాలేంటి’ అని. తన దగ్గర జవాబు లేని ఆ ప్రశ్నను ఎదుర్కోవడం కంటే తనకు చేతనైన మరేదో పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చేసిందామె.
శిల్ప తమ్ముడు చిరంజీవి మంగుళూరులో సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరాడు. అందరూ మంగుళూరుకు వచ్చారు. తన తల్లి ఎప్పుడూ తాను వండినవి తింటూ ‘నువ్వు కానీ హోటల్ పెడితే వండినవి వండినట్లే ఖర్చయిపోతాయి. ఇంత రుచిగా వండడం ఎలా నేర్చుకున్నావ్’ అని మెచ్చుకుంటుండేది. అమ్మ మాటలను గుర్తు చేసుకుంది శిల్ప. పిల్లవాడి చదువు కోసమని భర్త ఉన్నప్పుడు బ్యాంకులో దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసింది. ఆ పెట్టుబడితో సెకండ్ హ్యాండ్ ట్రక్కు కొని మొబైల్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టింది. జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగిముద్ద, అన్నం, సంప్రదాయ కన్నడ రుచులతో మొదలైన ‘హల్లే మనే రొట్టి’కి ఉద్యోగులే ప్రధానమైన కస్టమర్లు.
తమ్ముడితోపాటు రొట్టెలు చేస్తున్న శిల్ప
శ్రమ ఫలించింది
శిల్పకు సహాయంగా ఆమె అమ్మానాన్న కూడా పని చేసేవాళ్లు. తర్వాత తమ్ముడు కూడా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోనే పని చేస్తున్నారు. మంగుళూరులో సక్సెస్‌ఫుల్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ల ప్రస్తావన వస్తే మొదటగా శిల్ప పేరునే చెప్పుకుంటారు. మేనేజ్‌మెంట్ కాలేజ్‌లు ఆమె అనుభవాలనే విద్యార్థులకు పాఠాలుగా చెప్తున్నాయి. ఆహారప్రియుల మౌత్ పబ్లిసిటీతో ‘హల్లే మనే రొట్టి’ గురించి స్థానిక మీడియాలో పడింది. వార్తా పత్రికల్లో శిల్ప జీవనపోరాటాన్ని చదివిన మహీంద్ర గ్రూప్ నిర్వహకులు ఆనంద్ మహీంద్ర ఆమెను అభినందించి బొలేరో మ్యాక్సీ ట్రక్ ప్లస్‌ను బహూకరించారు. ‘తల్లి ఏదైనా సాధించ గలదు’ అంటోంది శిల్ప సంతోషంగా.
Comments
Please login to add a commentAdd a comment