తాజాగా తినండి | Special Story About Taja Kitchen | Sakshi
Sakshi News home page

తాజాగా తినండి

Feb 22 2020 5:28 AM | Updated on Feb 22 2020 5:28 AM

Special Story About Taja Kitchen - Sakshi

మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్డులో నుంచి కొద్దిగా ముందుకు వెళితే, జనంతో కిటకిటలాడుతూ ‘తాజా కిచెన్‌’ కనిపిస్తుంది. ఎంతోమంది విద్యార్థులకు అదొక అక్షయపాత్రలాంటిది. అతి తక్కువ ధరకే మూడు పూటలా కడుపు నింపుతుంది. అక్కడకు బెంజ్, ఆడి కార్లతోపాటు, మున్సిపల్‌ ఉద్యోగులు కూడా వస్తుంటారు. కడుపు నింపుకుని, సంతృప్తిగా త్రేన్చి వెళ్తుంటారు. అదే ‘తాజా కిచెన్‌’ ‘మా దగ్గరకు రకరకాల వారు వచ్చి టిఫిన్లు తిని వెళ్తుంటారు. రుచి పరీక్షించడం కోసం కార్లలో వస్తుంటే, కడుపు నింపుకోవటం కోసం సామాన్య ఉద్యోగులు వస్తుంటారు. అందరూ చాలా బాగుందని మెచ్చుకుని వెళ్తుంటారు’ అంటారు బిఎస్‌సి చదువుకున్న ‘తాజా కిచెన్‌’ యజమాని విఘ్నేశ్‌.

బెంగళూరులో ‘తాజా తిండి’ (తిండి అంటే కన్నడలో టిఫిన్‌ అని అర్థం) పేరున సుమారు పది సంవత్సరాల క్రితం శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆలోచన నుంచి ఈ టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభమైంది. విదేశాలలో పర్యటించిన శ్రీనివాస్‌ భారతదేశంలో అతి తక్కువ ధరకు పరిశుభ్రమైన ఆహారం అందించాలనుకున్నారు. అలా ప్రారంభమైంది ‘తాజా తిండి’. అదే పద్ధతిలో హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించడం కోసం ‘తాజా కిచెన్‌’ను ప్రారంభించారు. ‘వంద మందికి ఎక్కువ ధరలకు టిఫిన్‌ పెట్టి, ఎక్కువ లాభం సంపాదించటం కంటె, వెయ్యి మందికి తక్కువ ధరకు అందించి అదే లాభాన్ని సంపాదించటం న్యాయం అనిపించింది. ఆరోగ్యకరమైన పదార్థాలను, అతి తక్కువ ధరలకు అందించటమే మా లక్ష్యం’ అంటారు విఘ్నేష్‌. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశపు శాకాహార వంటకాలను అందిçస్తూ, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు వీరు. అందమైన అలంకారాలతో కూడిన వాతావరణంలో మనసుకి ఆహ్లాదం కలిగించేలా పచ్చటి వెదురు చెట్ల నీడన ఫలహారాలు అందిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన వాళ్లకి మెనూ కార్డు ఇవ్వవలసిన అవసరం ఉండదు. బోర్డు మీద వాటి పేర్లు, ధరలతో పాటు, పక్కనే ఉన్న టీవీలో వాటి తయారీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ

వచ్చిన వారిలో కొందరు అల్లం చట్నీ లేదని, సాంబారు లేదనీ గొడవ పడుతుంటారు. బెంగళూరులోని వందేళ్లనాటి ‘బ్రాహ్మిన్స్‌ కాఫీ బార్‌’ లో మాత్రమే తయారయ్యే చట్నీలను తయారు చేస్తున్నాం. పాతతరం సంప్రదాయ చట్నీలను మాత్రమే తయారుచేసి, అందిస్తామని అర్థమయ్యేలా చెబుతాం. చట్నీ మారు వడ్డించుకోవాలంటే, కౌంటర్‌ దాకా వెళ్లి నిరీక్షించాల్సిన పని లేదు. అది కూడా వారికి అందుబాటులో ఉంచుతాం. ఏ పదార్థమూ, వస్తువూ వృధా కాకుండా జాగ్రత్తపడతాం. ఆయా టిఫిన్లకి అనుకూలమైన విధంగా ప్లేట్లు తయారుచేయించాం. ప్లేట్లను ఎప్పటికప్పుడు డిష్‌ వాషర్‌లో వేడి నీళ్లతో శుభ్రం చేస్తాం. ప్లాస్టిక్‌ వాడకానికి పూర్తి వ్యతిరేకం. ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటు చేశాం. మంచినీళ్ల బాటిల్స్‌ అమ్మకం పూర్తిగా నిషేధం. అన్నిటినీ స్టిరైల్‌ చేసి వాడతాం. – అనంత్, మేనేజర్‌

ఇక్కడ మేం ఈ సెంటర్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు ‘కర్ణాటక ఫుడ్‌ ఎవరు తింటారు?’ అని నిరుత్సాహపరిచారు. మిగిలిన అంతర్జాతీయ పదార్థాలను తింటున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు తినరు అని పట్టుదలగా ప్రారంభించాం. అందరూ ఆదరిస్తున్నారు. వంటవారిని కర్ణాటక నుంచి తీసుకువచ్చాం. వడ్డించిన పదార్థాలు ప్లేటులో నుంచి కిందకు పడిపోకుండా, చేతులు కాలకుండా ఉండాలనే లక్ష్యంతో మందంగా ఉండే ప్లేట్లు తయారుచేయించాం. కృత్రిమ పదార్థాలను అస్సలు ఉపయోగించం. మాది ఓపెన్‌కిచెన్‌. లోపలకు వచ్చి ఎవ్వరైనా చూసుకోవచ్చు. టైమింగ్స్‌ విషయంలో కరెక్ట్‌గా ఉంటాం. లేదంటే కిచెన్‌ క్లీనింగ్‌ కుదరదు. పేరుకి తగ్గట్లుగా అన్నీ తాజా వస్తువులే ఉపయోగిస్తాం. హైదరాబాద్‌లో.. టిఫిన్‌ కోసం నిలబడి, టోకెన్‌ తీసుకుని, ఆనందంగా తినటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ప్రముఖ సినీ దర్శకులు ఏ.ఎం. రత్నం, క్రిష్, తరుణ్‌భాస్కర్‌ వంటి వారంతా ‘తాజా కిచెన్‌’ టిఫిన్లను రుచి చూసి ప్రశంసించారు. – విఘ్నేష్, యజమాని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement