
బొమ్మల పెళ్లి గురించి విన్నాం!
చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకున్న ఆట.
అదొక అందమైన ముచ్చట.
పెళ్లిలో ఉన్న పవిత్రత తెలిపే పిల్లలాట.
ఇప్పుడు అబ్బాయిలు వేరే ఆట ఆడుతున్నారు.
దాని పేరే బొమ్మల ప్రేమ!
ప్రేమలో దించుతారు.
కెమెరాలో దాచిపెడతారు.
బొమ్మలు మాత్రం దాచరు!!
ఏయ్ సీతా... నిన్న నైట్ అంకుల్ (సీతామాలక్ష్మి ఫాదర్) కాల్ చేశారే. నాలుగు రోజుల నుంచి నీ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందట. నీకు ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. ఓసారి ఇంటికి కాల్ చెయ్’ – సీతకి హాస్టల్ రూమ్మేట్ అనూష ఆర్డర్ వేసింది. రిప్లై ఏం లేదు... సీత నుంచి! స్విచ్చాఫ్ వస్తోందట కాదు, తను సెల్ స్విచ్చాఫ్ చేసిందని అనూషకూ తెలుసు. కానీ, ఎందుకో తెలీదు. సెల్‌ను చూస్తేనే ఏదో సూసైడ్ బాంబ్‌ను చూసినట్టు భయపడుతోంది సీత. ఊళ్లో అమ్మానాన్నలే కాదు, అనూష కూడా సీతకు ఏమైందోనని టెన్షన్ పడుతోంది. ఎప్పుడూ నలుగురితో నవ్వుతూ మాట్లాడే సీత, వారం నుంచి ఎవ్వరితోనూ కలవడం లేదు. కాలేజీకి వెళ్లడం లేదు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్‌కు అటెండ్ కావడం లేదు. ఎందుకిలా ఉంటున్నావ్? ఏమైంది? అని అనూష ఎంత అడిగినా... నోరు విప్పడం లేదు. అసలేం చెప్పడం లేదు. తిండీ తిప్పలు, నిద్ర లేకుండా వారం నుంచి రూమ్‌లో ఒక్కత్తే ఉంటోంది. కన్నీళ్లు తప్ప ముఖంలో కళ అనేదే లేదు.
వాట్సాప్‌లో షాక్!
సీతను ఒంటరిగా వదిలేస్తే మంచిది కాదని ఆ రోజు అనూష కూడా కాలేజీకి వెళ్లలేదు. అమ్మానాన్నలతో మాట్లాడితే కాస్తయినా కుదుటపడుతుందని అనూష బలవంత పెట్టడంతో సెల్ స్విచ్చాన్ చేసింది సీత. వెంటనే బోల్డన్ని మిస్డ్ కాల్ అలర్ట్స్, వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి. వాటిలో ఓ వాట్సాప్ మెసేజ్‌లోని ఫొటోలు చూడగానే చలీజ్వరం వచ్చిన దానిలా సీతలో వణుకు మొదలైంది. కన్నీళ్లు ఎక్కువయ్యాయి. ఆమె క్లాస్‌మేట్ యుగంధర్ పంపిన ఆ ఫొటోల్లో ఉన్నది సీతే. ‘సీతా... ఏమైంది?’ – అనూష అడుగుతోంది. సీత ఆ ఫొటోలు ఎప్పుడు చూస్తుందా? బ్లూ టిక్ మార్క్ ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తోన్న యుగంధర్ ఈలోపే కాల్ చేశాడు. ‘ఏంటే... వేషాలేస్తున్నావా? ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టావ్? బ్లా... బ్లా... బ్లా...!’ – సీత ఫోన్ లిఫ్ట్ చేయగానే యుగంధర్‌లో కోపం కట్టలు తెంచుకుంది. తిట్లవర్షం కురిసింది. ‘ప్లీజ్... నా లైఫ్ స్పాయిల్ చేయకు’ – కన్నీళ్లతో ప్రాధేయపడుతోంది సీత. ఎంత బతిమాలుతున్నా యుగంధర్ వినడం లేదు. ‘ఫొటోలు చూశావ్‌గా. నేను పిలిచినప్పుడు రాకపోయినా... చెప్పినట్టు చేయకపోయినా... ఇవన్నీ ఇంటర్నెట్‌లో పెడతా’ – సీతకు వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు. ప్లీజ్... ప్లీజ్... ప్లీజ్... సీత బతిమాలుతూనే ఉంది. రేపు ఉదయం పది గంటలకు నా రూమ్‌కి రాకపోతే.. ఫొటోలు కాదు, వీడియోలూ బయటపెడతా’ ... యుగంధర్ వాయిస్‌లో బేస్ పెరిగింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ కట్ చేశాడు.
స్టార్ట్ ఇమీడియెట్‌లీ
అనూషకు సీన్ అర్థమైంది. ఎవరో సీతను భయపెడుతున్నారు. వాళ్ళెవరు? ఏం జరిగింది? అని అడిగితే... సీత చెప్పడం లేదు. ఇక, ఆలస్యం చేయకూడదనుకుంది. సీత నాన్నకు కాల్ చేసి ‘అంకుల్... మీరోసారి రావాలి. పరిస్థితి కొంచెం సీరియస్’ – సింపుల్‌గా చెప్పింది అనూష. ఆల్రెడీ అమ్మాయి గురించి టెన్షన్ పడుతున్నారేమో ఆయన పెద్దగా ప్రశ్నలేం వేయలేదు. వెంటనే బయలుదేరారు. తెల్లారితే ఏం జరుగుతుందోననే భయం సీతలో... స్నేహితురాలికి ఏమవుతుందోననే ఆందోళన అనూషలో... రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు. ఉదయమే సీత నాన్న సిటీలో దిగారు. నాన్నను చూడగానే గట్టిగా హత్తుకుని, వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. ‘సీతమ్మా... ఊరుకోరా! ఏంటిది చిన్న పిల్లలా?’ – సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు నాన్న. ‘నా కూతురు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుందంటే నాకెంత నామోషీ చెప్పు? ఏం జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాల్రా. నవ్వుతుండాలి’ – అని నాన్న చెబుతుంటే... ఆయన ఒళ్లో తల వాల్చి శూన్యంలోకి చూస్తోంది సీత. కాసేపటి తర్వాత అక్కడే ఉన్న అనూష... ‘అయ్యో టైమ్ పదవుతోంది. అంకుల్... డైనింగ్ రూమ్‌కి వెళ్లడం ఎందుకు? ఇక్కడికే టిఫిన్ తీసుకొస్తా!’ అని కిందకు వెళ్లింది.
నిముషం ఆలస్యమైనా..!
టైమ్ పదవుతోందనగానే సీతలో మళ్లీ టెన్షన్ మొదలైంది. యుగంధర్ మాటలే గుర్తొచ్చాయ్! ఒక్కసారి గోడ మీదున్న గడియారాన్ని చూసింది. తొమ్మిది గంటలా యాభైఐదు నిమిషాలైంది. సెకన్ ముల్లు చప్పుడు కూడా సీతకు స్పష్టంగా వినిపిస్తోంది. ఒక్కో సెకన్ సౌండ్ గుండెల్లో గుబులు రేపుతోంది. బీపీ పెరుగుతోంది. పది అవగానే సీతకు యుగంధర్ నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేయగానే సీత న్యూడ్ పిక్స్ నెట్టింట్లో కన్పించాయి. ‘నాన్నా... బ్రష్ చేసుకునొస్తా’ – అని మెల్లగా ఒళ్లోంచి లేచి పక్కకు వెళ్లింది.
యుగంధర్ ఆ లింక్‌ను సీతకు మాత్రమే సెండ్ చేయలేదు. క్లాస్‌మేట్స్ అందరికీ తెలిసేలా, వాళ్ల బీటెక్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. తనకు ఏం తెలీనట్టు రెండు సానుభూతి డైలాగులు చెప్పాడు. రెండు చేతుల్లో టిఫిన్ ప్లేట్స్ పట్టుకొస్తున్న అనూషకి హాస్టల్‌మేట్ ఒకరు ఈ లింక్ చూపించారు. భళ్లున ప్లేట్స్ రెండూ కిందపడ్డాయి. పెద్ద సౌండ్ రావడంతో ఏమైందోనని రూమ్‌లోని సీత నాన్న బయటకొచ్చారు. ‘అంకుల్... సీత ఎక్కడుంది? ఏది?’ –అంటూ ఒక్క పరుగులో అనూష రూమ్‌లోకి వెళ్లింది. తన వెనకాలే వచ్చిన సీత తండ్రి ‘బాత్రూమ్‌లో ఉందమ్మా’ – అని చెప్పారు. వెంటనే ‘సీతా... సీతా...’ అంటూ అనూష బాత్రూమ్ డోర్ కొడుతోంది. లోపల నుంచి ఉలుకూ లేదు, పలుకూ లేదు. ‘ప్లీజ్ అంకుల్... డోర్ బద్దలుగొట్టండి’ – అనూషలో ఆందోళన, ఆవేదన కనిపిస్తున్నాయి. ఏం ఆలోచించకుండా డోర్ బద్దలుగొట్టేశారు. అనూష ఆలోచన కరెక్టే. ఇంకో నిమిషం ఆలస్యమైనా సీత ఈలోకంలో ఉండేది కాదు.
లవ్ బ్లాక్‌మెయిల్
‘సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? వాడెవడో భయపెడితే... ఫొటోలు నెట్‌లో పెడితే యాసిడ్ తాగేస్తావా? ఇంత జరుగుతుంటే నాకు చెప్పొచ్చు కదా? నువ్వు నా కూతురు కాదురా... ఫ్రెండ్’ – సీతకు నాన్న ధైర్యం చెబుతున్నారు. మెల్లగా ఏం జరిగిందో చెబుతోంది సీత. ‘రెండేళ్ల నుంచి ఎవరికీ తెలీకుండా వెంట పడుతున్నాడు నాన్నా! ప్రేమిస్తున్నానన్నాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. మంచి స్టూడెంటే. తర్వాత్తర్వాత నాకూ తనంటే ఇష్టం ఏర్పడంతో అతన్ని యాక్సెప్ట్ చేశా. ఎంతో ప్రేమగా బోల్డన్ని కబుర్లు చెప్పేవాడు. ఓరోజు డిన్నర్‌కి రమ్మంటే తన రూమ్‌కి వెళ్లా. డిన్నర్ చేసిన తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యాం. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు రావడంతో దూరం పెట్టేందుకు ట్రై చేశాను. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు మేం కలసిన క్షణాలన్నిటినీ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశానని. అప్పట్నుంచి తను చెప్పినట్టు చేయకుంటే... నా న్యూడ్ పిక్స్, వీడియోలు బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు’ – అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చింది సీత. ‘సూసైడ్ చేసుకోవల్సింది నువ్వు కాదమ్మా... వాడు. ఇలాంటి వెధవలకు భయపడకూడదు. ఫోన్ చేసి, వాడి రూమ్‌కి వస్తున్నానని చెప్పు’ – యుగంధర్ ఆట కట్టించడానికి నాన్న స్కెచ్ గీశాడు.
ఝాన్సీ సీతాబాయ్!
తండ్రి చెప్పినట్టే చేసింది సీత. యుగంధర్‌కి కాల్ చేసి రూమ్‌కి వస్తున్నాననీ, నెట్‌లో ఫొటోలు డిలీట్ చేయమనీ కోరింది. ఈలోపు సీత వాళ్ల నాన్న పోలీసులకి, మీడియాకి ఫోన్లు చేశాడు. ముందు యుగంధర్ ఫ్లాట్‌కి సీతను పంపించారు. రెండు నిమిషాల్లో మిగతా అందరూ అక్కడికి చేరుకున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా యుగంధర్‌ని, అతడి ఫ్లాట్‌లో సీక్రెట్ కెమెరాలను పట్టుకున్నారు. ఒక్క సీతే కాదు, వాడి దగ్గరున్న వీడియోల్లో మరికొందరున్నారు. అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేయడమే యుగంధర్ పనని తెలిసింది. తండ్రి ఇచ్చిన ధైర్యం, అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడనే ఆక్రోశంతో ఒక్కసారిగా సీతామాలక్ష్మీ కాస్తా ‘ఝాన్సీ లక్ష్మీబాయ్’లా మారి, యుగంధర్‌ని ఈ చెంపా ఆ చెంపా వాయకొట్టింది. ఛానళ్లల్లో, పేపర్లలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. అయితే... సీతామాలక్ష్మీ పేరు గాని ఊరు గాని స్టూడెంట్ అని గాని ఎక్కడా వినపడలేదు. కనపడలేదు. ఆమె ముఖాన్ని చూపించలేదు. దాంతో యుగంధర్ చేతిలో మోసపోయిన మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చారు. జస్ట్... ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ ఘటన తర్వాత ఇలాంటి మరికొందరు దుర్మార్గులపై ఇంకొందరు కంప్లయింట్స్ చేశారు.
అమ్మాయిలూ.. జాగ్రత్త!
ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఆడపిల్లలను మోసం చేస్తున్న యుగంధర్‌లు ఎందరో? వాళ్ల చేతుల్లో బలవుతున్న సీతమ్మలు ఎందరో? ఇక్కడ నేరం చేస్తున్నది ఒకరయితే... ఎవ్వరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తూ, బలవన్మరణాలకు పాల్పడుతూ, శిక్ష అనుభవిస్తున్నది మరొకరు. ఇటీవల బీహార్‌లో ఓ ప్రబుద్ధుడు తను ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చాడు. పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఓ టెక్కీ.. తోటి ఉద్యోగిని ప్రేమించినట్టు నమ్మించి మోసం చేశాడు. ఆమెతో గడిపిన క్షణాలను రహస్యంగా వీడియో తీసి, దాని సాయంతో చాలాసార్లు లోబరుచుకున్నాడు. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాడు. చివరకు, ఆమె వీడియోను పోర్న్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేశాడు. మొన్న కనిగిరిలో జరిగిన ఘటనను ఎలా మరచిపోగలం? గతంలో అమెరికన్, యూరప్ కంట్రీస్‌లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకునేవి. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చేసరికి ఇండియాలోనూ ఇటువంటి నేరాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అందువల్ల, అమ్మాయిలంతా జాగ్రత్తగా మసులుకోవాల్సిన సమయం వచ్చింది. చిన్న తప్పటడుగు వేసినా, తప్పుడు దారుల్లోకి తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసే వెధవలు ఎంతోమంది కాచుకుని కూర్చున్నారు.
- సత్య పులగం
శిక్ష పడాల్సిందే
టీనేజ్‌లో అమ్మాయిలు కావొచ్చు... అబ్బాయిలు కావొచ్చు... వయసు ప్రభావం వల్ల కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే... రహస్యంగా వీడియో తీసి అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేయడమనేది వయసు ప్రభావం వల్ల చేశారనడానికి వీల్లేదు. ఏ పరిస్థితుల్లో చేసినా అది తప్పే. పెద్ద క్రైమ్. సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేయడమనేది ఇంకా పెద్ద క్రైమ్. ఇటువంటి పనులు చేసిన వాళ్లను మందలించడంతో సరిపెట్టకూడదు. లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాళ్లు తప్పకుండా ఇన్వాల్వ్ కావాలి. అటువంటి నేరానికి పాల్పడేవాళ్లకు తగిన శిక్ష పడాల్సిందే.
– డాక్టర్ పద్మ పాల్వాయి చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్