ఎంత ఎత్తుకు ఎదిగాడు | special story to Corporate College students suicides | Sakshi
Sakshi News home page

ఎంత ఎత్తుకు ఎదిగాడు

Published Mon, Oct 23 2017 11:50 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

special  story to Corporate College students suicides - Sakshi

పిల్లలు ఎత్తుకి ఎదగాలని.. గొప్పవాళ్లు కావాలని..
సమాజమంతా వాళ్లను తలెత్తుకు చూడాలని..
ప్రతి తల్లి, ప్రతి తండ్రి కలలు కంటారు! కష్టపడ్తారు!
పిల్లలతో కూడా కృషి చేయిస్తారు! ఖుషీ లేనంత కృషి చేయిస్తారు!!
ఆ పిల్లలే ఇవ్వాళ ఎత్తయిన మేడ ఎక్కి అమ్మా నాన్నలు కోరుకున్నంత
ఎత్తుకి ఎదగలేనని బాధపడుతూ  కిందకి.. కిందకి.. కిందకి
దూకేస్తున్నారు!!


‘‘నేను చూసింది నిజమేనా?’’ అప్పుడే స్పృహలోకి వచ్చిన ప్రశాంతి అడిగింది తన చుట్టూ ఉన్నవాళ్లను. ఎవరి దగ్గరా సమాధానం లేదు. అంతా మౌనంగా ఉన్నారు. ఆ గాంభీర్యం మరింత భయపెట్టింది ఆమెను. ‘‘ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదు.. చెప్పండి? ’’ అంటూ బెడ్‌ మీద నుంచి లేవబోయింది. ‘‘ఏం చెప్పమంటావమ్మా..’’ ఆమెను పట్టుకొని బోరుమంది ప్రశాంతి తల్లి. ‘‘అంటే.. అంటే.. నిజమేనన్నమాట... నా కొడుకు.. నా కొడుకు..’’ అని సణుగుతూ మళ్లీ కళ్లు తిరిగిపడిపోయింది. అక్కడున్న వాళ్లంతా కంగారు పడ్డారు. ‘నీళ్లు తెచ్చి మొహం మీద జల్లండి’ అన్నారెవరో ఆ గుంపులోంచి. ‘ఇప్పటికే రెండుసార్లు పడిపోయింది. బీపీ డౌన్‌ అవుతుందేమో.. హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు ఇంకొకరు. కాసేపటికి తేరుకుంది ప్రశాంతి. ‘నా కొడుకును చూడాలని ఉంది. నన్ను తీసుకెళ్లండి’ అంటూ ప్రాధేయపడింది ఏడుస్తూ! ప్రశాంతిని చూస్తుంటే అక్కడున్నందరికీ దుఃఖం వస్తోంది. ఆమెకు సమాధానం చెప్పే స్థితిలో లేరు ఎవ్వరూ!

ఏమైంది?
ప్రశాంతి, సాగర్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు కౌశిక్, కూతురు స్నిగ్ధ. కౌశిక్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. స్నిగ్ధ తొమ్మిదో తరగతి. సాగర్‌ స్టేట్‌గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌. ప్రశాంతి ప్రయివేట్‌ ఉద్యోగి. ఇద్దరికీ పిల్లల మీద విపరీతమైన అంచనాలు. కొడుకును ఇంజనీర్, కూతురును డాక్టర్‌ చేయాలని కలలు కంటున్నారు. స్నిగ్ధ చదువులో చురుకే. తల్లిదండ్రుల కలను నిజం చేయగలదు. కాని కౌశిక్‌ ఆసక్తి,. అభిరుచులు  వేరు. చిన్నప్పటి నుంచీ వాడికి ఆటలంటే ఇష్టం. టెన్నిస్‌ బాగా ఆడతాడు. కోచింగ్‌కు పంపించమని వాడితో సహా ఆ పిల్లాడి ఆటతీరును గమనించినవాళ్లు, అభినందించిన వాళ్లూ ప్రశాంతి, సాగర్‌లకు చెప్పారు. అయితే ఆ తల్లిదండ్రుల దృష్టిలో ‘ఆ ఆటలు కాలక్షేపానికే కాని కెరీర్‌ కోసం కాదు. కసరత్తుకే కాని కడుపునింపేవి కావు. చదువు ఒక్కటే నిలబెడుతుంది. కొలువును ప్రసాదిస్తుంది. దానికోసమే జీవితం..’ అని వాళ్ల బలమైన నమ్మకం. అందుకే పిల్లల చూపు వేరేవైపు మళ్లకుండా చదువు మీదనే పెట్టేలా కట్టుదిట్టం చేశారు. స్కూల్‌ అయిపోగానే ట్యూషన్‌.. ట్యూషన్‌ అయిపోగానే దాన్ని మననం చేసుకోవడం. తెల్లవారు జామున హోమ్‌ వర్క్‌.. ఇలా ఊపిరిసలపని షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేసేశారు. స్నిగ్ధ అలవాటు పడిపోయింది కానీ, కౌశిక్‌కే ఆ పద్ధతి మింగుడు పడలేదు. ఆ అబ్బాయి అందులో ఇమడలేదు. కాని పిల్లల మనసు కన్నా పెద్దల ఆకాంక్షలకే విలువ ఎక్కువ కదా! కాబట్టి కౌశిక్‌కు ఇష్టం లేకపోయినా ఐఐటిని ఆ పిల్లాడి మెదడులో అచ్చేశారు. ఎమ్‌సెట్, ఐఐటికి సీట్ల ఫ్యాక్టరీలాంటి రెసిడెన్షియల్‌ కాలేజ్‌లో పడేశారు.

ఇప్పుడు..
హాస్టల్‌లో కౌశిక్‌ స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ‘‘హాస్టల్‌ రూమ్‌లో ఎలా ఉండేవాడు కౌశిక్‌?’’ ‘‘ఫస్ట్‌ డే నుంచే దిగులుగా ఉన్నాడు. నాతో ఎప్పుడూ ‘నాకు ఇక్కడ ఉండాలని లేదు’ అని చెప్పేవాడు. అసలు మ్యాథ్స్‌ అంటే వాడికి ఇష్టమేలేదు. మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ ఉందంటే చాలు– చాలా భయపడేవాడు. ఎన్నోసార్లు ‘నా వల్లకాదు... నేను ఇంటికి వెళ్లిపోతా’ అని అన్నాడు సర్‌. ‘మరి ఈ విషయం మీ పేరెంట్స్‌కి చెప్పు’ అని మేమంటే.. ‘అమ్మో.. చంపేస్తారు’ అని భయపడేవాడు. ప్రతిరోజూ ఏడ్చేవాడు. మొన్నకూడా ‘నాకు మ్యాథ్స్‌ అంటే ఇష్టంలేదు.. హాస్టల్‌లో ఉండడం నచ్చట్లేదు. మా మమ్మీని, చెల్లెలిని చాలా మిస్‌ అవుతున్నా’ అని బాగా ఏడ్చాడు.‘ నాకు చచ్చిపోవాలనుందిరా..’ అని చెప్పాడు. మాకు భయమేసి తెల్లవారి మా వార్డెన్‌కి చెప్పాం కూడా’’ కౌశిక్‌ మనస్తత్వాన్ని వర్ణించాడు అతని క్లాస్‌మేట్, రూమ్‌మేట్‌ అఖిల్‌.

‘‘ మీ వార్డెన్‌ ఏమన్నాడు?’’ అడిగాడు సీఐ. ‘‘తిట్టాడు. ‘పిచ్చి వేషాలేస్తే తోలుతీస్తా’’ అన్నాడు సర్‌’’ కౌశిక్‌. ‘‘అదికాదు సర్‌.. పిల్లలు కదా.. మొదట్లో అలాగే ఇంటిమీద బెంగతో ఉంటారు.. వీడూ అలాగే అనుకొని బెదిరిస్తే సర్దుకుంటాడని చిన్నగా బెదిరించానంతే సర్‌’’ అంటూ అక్కడే ఉన్న వార్డెన్‌ చెప్పాడు భయం భయంగా. ‘‘ఊ’’ అంటూ ‘‘నిన్న రాత్రి ఎలా ఉన్నాడు?’’ అడిగాడు సీఐ. ‘‘నిన్న రాత్రి డిన్నర్‌కు రాలేదు. అడిగితే ‘ఆకలి లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్‌ తింటాను’ అన్నాడు సర్‌. ‘సరే’ అని నేను డిన్నర్‌కు వెళ్లిపోయా. వచ్చాక చూస్తే పడుకుని ఉన్నాడు. అసలు నిన్న పొద్దున్నుంచే చాలా డల్‌గా ఉన్నాడు. ఈ మధ్య చాలా రోజుల్నుంచి ‘నాకు బతకాలనిపించట్లేదు’ అనడం స్టార్ట్‌ చేశాడు. ఎందుకలా అంటావ్‌రా అని గద్దించాను చాలాసార్లు. ఒకసారి ఆంటీ వాళ్లు ఫోన్‌ చేస్తే చెప్పాను కూడా. మరి వాళ్లు వాడితో ఏం మాట్లాడారో తెలీదు. అప్పటినుంచి చాలా కామ్‌ అయిపోయాడు. వీక్లీ టెస్ట్స్‌ కూడా సరిగ్గా రాసేవాడు కాదు. నోట్‌బుక్‌లో .. పేపర్స్‌ మీద వాంట్‌ టు డై అని రాసుకున్నాడు’ చెప్పాడు అఖిల్‌.
‘‘అంత పొద్దున్నే ఆ అబ్బాయి బిల్డింగ్‌ పైకి ఎక్కుతుంటే మీరు చూడలేదా?’’ వార్డెన్‌ ప్రశ్నించాడు సీఐ తీక్షణంగా.

‘‘సర్‌.. నేనప్పుడు .. వాష్‌రూమ్‌కి వెళ్లాను సర్‌.. వాష్‌రూమ్‌లోంచి బయటకు వస్తుంటే వినిపించింది పై నుంచి ఏదో కిందపడినట్టు దబ్‌మన్న శబ్దం. ఆ తర్వాత వాచ్‌మన్‌ చూసి గగ్గోలు పెడితే వెళ్లి చూశాను.. కౌశిక్‌..’ కాస్త భయంగా.. ఇంకాస్త బెరుగ్గా చెప్పాడు వార్డెన్‌. అలా తనకు నచ్చని జీవనశైలిని ఎండ్‌ చేసుకున్నాడు కౌశిక్‌. వాళ్లమ్మ బాధకు అదే కారణం. పోతూ పోతూ తల్లి, తండ్రికి తన మనసు అర్థమయ్యేలా ఉత్తరం రాసిపెట్టి మరీ పోయాడు. తల్లి తట్టుకోలేక స్పృహ కోల్పోతోంది. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన కొడుకు శవం ముందు జీవచ్ఛంలా పడి ఉన్నాడు తండ్రి.
కౌశిక్‌ చనిపోయిన రోజు మాత్రం రాష్ట్రమంతా చర్చ అయింది టెలివిజన్‌ చానళ్లలో ప్యానల్‌ డిస్కషన్స్‌ రూపంలో. నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌ల మాటలకు ఆరోజు చాలా విలువనిచ్చాయి వార్తాపత్రికలు, చానళ్లు.

తెల్లవారి నుంచి..
అంతా మామూలే. నగరంలోని ఎక్కడో వీధిలో వచ్చే యేడుకి తమ పిల్లల ఎమ్‌సెట్, ఐఐటీ ర్యాంక్‌ల కోసం ఏ ఫ్యాక్టరీలైతే బాగుంటాయో జాబితా చూడసాగారు పేరెంట్స్‌. కౌశిక్‌ను బలితీసుకున్న ఫ్యాక్టరీ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుపోసాగింది.

ఆసక్తులు, శక్తిసామర్థ్యాలను అనుసరించే...
చేప చెట్టెక్కలేదు. కోతి ఈదలేదు. నీటిలో ఏ పరీక్షకైనా చేప సిద్ధం. చెట్టుమీద ఏ పరీక్షకైనా కోతి తయారు. చేపను చెట్టెక్కమని, కోతిని ఈదమని పరీక్షకు పెడితే...? అలాగే ఉంది కొంతమంది తల్లిదండ్రుల వ్యవహారం, కొన్ని  కాలేజీల తీరు. ఏ పిల్లలైనా సహజంగా తల్లిదండ్రులు చెప్పిందే వింటారు. వాళ్లకు నచ్చిందే చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లల ఆసక్తులు, శక్తిసామర్థ్యాలను అనుసరించే వాళ్లు చదివే కోర్సులను నిర్ణయిస్తే మంచిది. ఇంజనీరింగ్, మెడిసిన్‌ తప్ప చదువులేదన్నట్టు, పిల్లలకు ఆసక్తి ఉన్నా లేకపోయినా వాటినే చదవాలనే బలవంతం చాలా ప్రమాదం. అలాగే ప్రైవేట్‌ కాలేజీల్లో పొద్దున ఆరు నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి చదివించడమూ మంచిది కాదు. అన్ని గంటలు పెద్దవాళ్లం మనమే పనిచేయలేం. పిల్లలెలా ఏకాగ్రత నిలుపగలరు? సైన్స్, మ్యాథ్స్‌ అంటే ఆసక్తి ఉన్న పిల్లలకు కూడా అంత నిరవధిక శ్రమ శ్రేయస్కరం కాదు. మధ్యలో ఫిజికల్, మెంటల్‌ రిలాక్సేషన్‌ అత్యవసరం. ఇక మెడిసిన్, ఇంజనీరింగ్‌లలో ఇంట్రెస్ట్‌ లేని పిల్లలకు ఆల్టర్‌నేట్‌ ఎడ్యుకేషన్‌ ఇప్పించాలి. పిల్లాడు ఎందుకు ఆసక్తి లేదంటున్నాడో తల్లిదండ్రులు గమనించాలి. కాలేజ్‌లో పిల్లల మీద ఒత్తిడి పెంచే బోధనా విధానం ఉందా అనే విషయం చూడాలి. వీటన్నిటినీ పరిశీలిస్తూ పిల్లల ఆసక్తులు పరిగణనలోకి తీసుకుంటూ వాళ్లను చదివిస్తే వ్యక్తిత్వ, మనో వికాసాలతోపాటు చదువుకుంటున్న విషయం పట్లా అసలైన పట్టు వస్తుంది. ఎంచుకున్న రంగంలో విజయం సాధించే అవకాశమూ ఉంటుంది. లేకపోతే హోప్‌లెస్‌ కండిషన్‌లోకి  వెళ్లిపోయి, డిప్రెషన్‌లో పడిపోయి, నిస్సారంగా అనిపించి ఆత్మహత్యా ప్రయత్నాలకు ఒడిగడతారు.
 – డాక్టర్‌ పద్మ పాల్వాయి చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement