ర్యాగింగ్కు మరో విద్యార్థి బలి
► ‘ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్’ అంటూ సూసైడ్ నోట్
► వరంగల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాయినాథ్
మేడ్చల్/మేడ్చల్ రూరల్/కాజీపేట రూరల్/రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెడుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పెనుభూతం బలి తీసుకుంటూనే ఉంది! రిషితేశ్వరి ఘటన మరవకముందే ర్యాగింగ్ కోరల్లో చిక్కి మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు..’ అని సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కాలేజీలో వండ్లకొండ సాయినాథ్(18) ఇంజనీరింగ్
(ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జూలై 28న కాలేజీలో చేరిన సాయినాథ్.. కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లిలోని రాంరితేష్ అనే ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రాఖీ పౌర్ణమి సందర్భంగా బోరబండలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. అక్కడ్నుంచి ఆదివారం హాస్టల్‌కు చేరుకున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని తన సొంతూరు రామక్రిష్ణాపురానికి బయలుదేరి వెళ్లాడు. ఇంటికని వెళ్లిన సాయినాథ్ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు వరంగల్-కాజీపేట్ మధ్య వడ్డేపల్లి చెరువు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో ‘‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు’’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది.
విచారణ చేపట్టిన పోలీసులు
సాయినాథ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న బాలానగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కాలేజీకి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌పై కూపీ లాగుతున్నారు. ఈ కాలేజీ మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డికి చెందినది కావడం గమనార్హం. విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కాలేజీ నిర్మానుష్యంగా కనిపిం చింది. విద్యార్థులు, సిబ్బంది ఎవరూ కని పించలేదు. దీంతో పోలీసులు ఫోన్ల ద్వారా కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు. కాసేపటికి కాలేజీ ప్రిన్సిపల్ జంగారెడ్డి అక్కడికి చేరుకుని తమ కాలేజీలో ర్యాగింగ్ చోటు చేసుకోలేదని చెప్పారు. సాయినాథ్ హాస్టల్‌కు కూడా వెళ్లిన పోలీసులు ఆయన పుస్తకాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కూలిన ఆశల సౌధం
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లెకు చెందిన వడ్లకొండ కనకయ్య, అరుణ దంపతుల చిన్న కుమారుడు సాయినాథ్. వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మట్టి కూలీ పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. కూతురిని ఏంబీఏ చదివించారు. పెద్ద కుమారుడు రఘునందన్ హైదరాబాద్‌లోనే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయినాథ్‌ను కూడా ఇంజనీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ ర్యాగింగ్ రక్కసి వారి కలలను కల్లలు చేసింది.
వీరు కొన్నేళ్ల క్రితం మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు వలస వచ్చారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సాయినాథ్ మృతదేహాన్ని వెంకట్రావుపల్లెకు తరలించారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘రెలైక్కిపోయావా కొడుకా... మల్లెప్పుడు వస్తావనుకోవాలె కొడుకా.. ర్యాగింగ్ భూతం నాకు కడుపు కోత విధించిందిరా కొడుకా...’ అంటూ తల్లి అరుణ గుండెలవిసేలా విలపించింది.