నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. కళ్ల సహజత్వాన్ని మెల్లగా కోల్పోయేలా చేసే టీవీ.. కంప్యూటర్ల జాబితాలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చి చేరాయి. అధిక గంటలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌తో గడిపేస్తుండటంతో కళ్లల్లో కల్లోలం అలముకుని ఎడారిలా మారిపోతున్నాయి. చివరకు చూపుపై ప్రభావం పడుతోంది. ఇందులో భాగంగా కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది.
సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): ఆధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి మించి వినియోగిస్తుండడంతో మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు యువతీ, యువకులతో పాటు పెద్దవారిలోనూ ఇదే సమస్య మొదలైంది. ఒకప్పుడు కంప్యూటర్‌తో గంటల తరబడి గడిపేవారు. అవసరం లేకపోయినా ఇంటర్‌నెట్ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ కాలం వెల్లబుచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్లతో పాటు స్మార్ట్‌ఫోన్లు జతకలిశాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఆధునిక పరికరానికి అతుక్కుపోతున్నారు. మనిషి రోజులో 16 గంటల పాటు మేల్కొని ఉంటే అందులో 3 నుంచి 4 గంటల పాటు స్మార్ట్‌ఫోన్ చూస్తూ గడిపేవారు అధికంగా ఉంటున్నారు. నిద్రపోయే 8 గంటల సమయాన్ని సైతం యువత కుదిస్తే మరో రెండు, మూడు గంటలను స్మార్ట్‌ఫోన్‌కే కేటాయిస్తోంది. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటోంది. ఇందులో కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. నిత్యం ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో కళ్లు డ్రై అవడంతో పాటు కార్నియా సమస్యలు వస్తాయని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎవరికి వస్తుందంటే..
50 సంవత్సరాలు నిండిన స్త్రీలకు, బహిష్టు ఆగిన తర్వాత హార్మోన్ థెరపీలో ఉన్నవారికి, కాలుష్య వాతావరణంలో ఎక్కువగా తిరిగే వారికి, కళ్లల్లో కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి, ధూమపానం చేసే వారికి, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై పనిచేసే వారికి, కొన్ని రకాలైన మందులు (బీపీ, అలర్జి, మానసిక వ్యాధిగ్రస్తుల మందులు, గర్భ నిరోధక మాత్రలు) వాడే వారితో పాటు కీళ్ల నొప్పులు, మధుమేహం వ్యాధి మందులు వాడే వారికి కూడా డ్రై ఐ రావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రయాణాలు చేసే వారు కూలింగ్ గ్లాస్ వాడాలి. తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవాలి. స్మార్ట్‌ఫోన్ బ్రైట్‌నెస్ తక్కువగా పెట్టుకుని చూడాలి. కళ్లకు ఫోన్‌కు మధ్య 15 సెంటీమీటర్ల దూరంగా పెట్టుకుని చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్ల పాటు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడంతో పాటు కనురెప్పలు కొట్టడం వల్ల నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై అవకుండా దోహదం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించరాదు. కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లేక్టివ్ గ్లాసెస్ వాడితే మంచిది. రోజులో ఎక్కువ సేపు స్మార్‌ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయిట్‌మెంట్‌లు వాడటం ద్వారా దుష్ఫలితాలు దరిచేరకుండా చూసుకోవచ్చు.
నేత్ర పరీక్ష నిర్వహిస్తున్న వైద్యుడు (ఫైల్)
డ్రై ఐని అశ్రద్ధ చేస్తే చూపు కోల్పోతారు
డ్రై ఐ వచ్చిన వారు ఆర్టిఫీషియల్ ఐ వాటర్ (కృత్రిమ కంటినీళ్లు) చాలా కాలం వాడాలి. వాడే టియర్ డ్రాప్స్ ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా వాడితే మంచిది. పొడి బారిన కళ్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సైక్లోస్పోడిన్ ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. ఈ డ్రాప్స్ ఎక్కువ ఉత్ప్రేరితం చేసి కంట్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా దోహదం చేస్తాయి. డ్రై ఐని అశ్రద్ధ చేస్తే కంట్లోని కార్నియాపై తెల్లటి మచ్చలు వచ్చి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కంటికి పని కల్పించే టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వంటి వస్తువులను సరైన దూరంలో నుంచి చూస్తే చాలా వరకు కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కళ్లను పక్కకు మరల్చాలి.
డాక్టర్ మెండా ఫర్నీకుమార్, కంటి వైద్య విభాగాధిపతి, జీజీహెచ్, గుంటూరు
నేత్రాలు పొడిబారే లక్షణాలు
కళ్లు అలసినట్లుగా ఉండడం. కళ్లల్లో మంట, కంట్లో దురదగా ఉండటం, కళ్లల్లో నీళ్లు రావడం, కళ్లు నొప్పిగా ఉండడం, కళ్లల్లో ఇసుకపోసినట్లుగా ఒత్తుకోవడం ఈ లక్షణాలు ఉంటే డ్రై ఐ (కళ్లు పొడిబారడం) సమస్యతో బాధపడుతున్నట్లే.
డ్రై ‘ఐ’ ఎలా గుర్తిస్తారు
డ్రై ఐ కనుగొనేందుకు కంటి వైద్యులు ఘమర్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షలో కంట్లో నీరు ఎంత ఉందో కొలిచేందుకు ఒక ఫిల్టర్ పేపర్ వాడతారు. సాధారణంగా 35 మిల్లీమీటర్ల పేపర్ తడిగా అయితే నార్మల్‌గా ఉన్నట్లు, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా తడి ఉంటే అతి ప్రమాదకర డ్రై ఐగా నిర్ధారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment