మహిళా క్రికెటర్‌ పరుగుల తుఫాను | Special Story Female Cricketer Shefali Verma | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్‌ పరుగుల తుఫాను

Nov 12 2019 5:43 AM | Updated on Nov 12 2019 5:44 AM

Special Story Female Cricketer Shefali Verma - Sakshi

అది 2013 అక్టోబర్‌. క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన కెరీర్‌లో చివరి రంజీ ట్రోఫీ ఆడేందుకు హరియాణా వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ఆఖరి ఇన్నింగ్స్‌ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధ సెంచరీ (79 నాటౌట్‌) సాధించి ముంబై రంజీ జట్టును గెలిపించాడు. అదే వేదికపై తండ్రి భుజాలపై కూర్చొని ఒక తొమ్మిదేళ్ల చిన్నారి కూడా సచిన్‌ ఆటను తిలకించింది. క్లిష్ట పరిస్థితుల్లో సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌కు అక్కడి ప్రేక్షక జనసందోహం నుంచి వచ్చిన స్పందనకు ఫిదా అయిపోయింది. తనూlబ్యాట్‌ పట్టాలని... సచిన్‌లా ఆడాలని... అందరిచేతా అభినందనలు అందుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.

కల నిజమైంది... 
2019 నవంబర్‌ 9. వేదిక గ్రాస్‌ ఐలెట్‌... ప్రత్యర్థి ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌... 30 ఏళ్లుగా తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టి  వార్తల్లో నిలిచిందో అమ్మాయి. నాడు సచిన్‌ స్ఫూర్తితో బ్యాట్‌ పట్టి... ఆరేళ్లు తిరిగేలోపు నేడు సచిన్‌ రికార్డునే సవరించిన ఆ చిచ్చర పిడుగే షఫాలీ వర్మ. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో షఫాలీ వర్మ వీరవిహారం చేసింది. 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 1989లో పాకిస్తాన్‌పై ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో సచిన్‌ టెండూల్కర్‌ (16 ఏళ్ల 214 రోజులు) అర్ధ సెంచరీ సాధించగా... అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ రికార్డు అలాగే ఉంది. అయితే శనివారం షఫాలీ వర్మ (15 ఏళ్ల 285 రోజులు) బ్యాటింగ్‌తో ఈ రికార్డు తెరమరుగైంది.

ఇంతకీ ఎవరీ షఫాలీ వర్మ?
2004 జనవరి 28న హరియాణాలోని రోహతక్‌లో జన్మించింది షఫాలీ వర్మ. క్రికెట్‌ ఆ కుటుంబానికి ప్రాణం. సచిన్‌ చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్ళినప్పుడే ఆ చిన్నారి మదిలో క్రికెట్‌ బలంగా నిలిచిపోయింది. షఫాలీకి చెల్లి, అన్న ఉన్నారు. నిజానికి ఆమె తండ్రి క్రికెట్‌ కావాలని కలగన్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించక కాలేకపోయారు. అందుకే భారత దేశం తరఫున తన కూతురు క్రికెట్‌ ఆడాలని ఆయన స్వప్నించాడు. మొదట్లో షఫాలీ అన్నయ్యతో పాటు షఫాలీని కూడా క్రికెట్‌ శిక్షణ కోసం క్రికెట్‌ మైదానంలోకి తీసుకెళ్ళేవారు ఆమె తండ్రి. అతి త్వరలోనే షఫాలీ ఆసక్తీ, కష్టపడే తత్వం, సాధన, మెళకువలు గ్రహించే శక్తి ఆ చిన్నారి ఆకాంక్షకు ప్రాధాన్యత తెచ్చిపెట్టాయి.

తండ్రి తొలి గురువు
తొలి మూడేళ్ళు తండ్రి దగ్గరే శిక్షణ తీసుకున్న షఫాలీ అండర్‌–16 రాష్ట్ర జట్టులోకి 13 ఏళ్ళ వయస్సులో ఎంపికైంది. తన స్కూల్‌ తరఫున నేషనల్స్‌కి ఆడే సందర్భంలో తనకీ అవకాశం ఎదురొచ్చింది. అయితే రెండేళ్ళు రాం నాయక్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంది. ఆ తరువాత అండర్‌–19, అండర్‌–23, సీనియర్‌ జట్టులోకి కూడా షఫాలీ అడుగు పెట్టింది. ఈ ఏడాది మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడటం గొప్ప అనుభవం ఇచ్చిందని షఫాలీ అంటోంది. భారత మహిళల క్రికెట్‌ స్టార్స్‌ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఇదే సందర్భంగా తనకు స్ఫూర్తిదాయకమైన డేనియల్‌ వ్యాట్‌ చెప్పిన ‘ఎప్పటికీ నీ ఆటని మార్చుకోవద్దు ఎప్పుడూ నా చెవిలో మార్మోగుతుంటాయని చెప్పే షఫాలీ ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నానని అంటోంది.

మహిళల ఐపీఎల్‌లో షఫాలీ క్రికెట్‌ బంతిని కొట్టే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయిన క్రికెట్‌దిగ్గజాలు ఇంత చిన్న వయస్సులో ఇంత శక్తి ఎలా వచ్చిందని అడిగితే.... నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య అని చెబుతుంది. బంతి తనవైపు దూసుకొస్తున్నప్పుడు నిర్భీతితో బలంగా కొట్టడమే తెలుసని ఈ భవిష్యత్‌ తార   విశ్వాసంతో చెబుతుంది.  ఎక్కువగా అబ్బాయిలతో క్రికెట్‌ ఆడిన షఫాలీ క్రికెట్‌ కోసం తన పదో తరగతి పరీక్షలను కూడా వదులు కోవాల్సి వచ్చింది. ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో నీకిష్టమైన ప్లేయర్‌ ఎవరని అడిగితే... ‘అందరూ అద్భుతమైన ఆటగాళ్లే. వాళ్ళందరూ నాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళే. కాకపోతే సచిన్‌ ఆటంటే నాకు ప్రాణం’ అని సమాధానం వచ్చింది. ఏ రోజుకైనా నేను సచిన్‌లా ఆడగలిగితే నాక్కూడా ఈ ప్రపంచమంతా చప్పట్లతో జేజేలు పలుకుతుందా? అని నాన్ననడిగితే.... ‘నువ్వు కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు’ అని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ‘అవకాశం వచ్చినప్పుడల్లా మైదానంలో విజృంభిస్తా. నా ఆటతో జాతి గర్వపడేలా చేస్తా’ అని చెప్పే షఫాలీ వర్మ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ నేతృత్వంలో తానెంతో నేర్చుకున్నానని చెబుతోంది. అంతులేని ఆత్మవిశ్వాసం, ఆమెపై ఆమెకున్న ఆకాశమంత విశ్వాసం షఫాలీ భవిష్యత్‌ దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.
– అరుణ అత్తలూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement