థ్యాంక్స్‌ మీరు వింటున్నారు | Special story to #MeTo movement | Sakshi
Sakshi News home page

థ్యాంక్స్‌ మీరు వింటున్నారు

Published Thu, Oct 11 2018 12:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Special story to  #MeTo movement - Sakshi

ఇన్‌బాక్స్‌లో నిందితులు తరుణ్‌ తేజ్‌పాల్, ఎం.జె.అక్బర్‌

అవును. వింటున్నాం. ఇవాళ మనం వినగలుగుతున్నాం. ఏ? ఈ ఘోష ముందు లేదా?ఈ వేధింపులు మునుపు లేవా?ఉన్నాయి. కానైతే.. మహి  ఇవాళ చెప్పుకోగలుగుతోంది.  ఎందుకు చెప్పుకోగలుగుతోందంటే..వినడానికి మనం ఇన్నాళ్లకు సిద్ధమయ్యాం.ఈ కొత్త సమాజానికి థ్యాంక్స్‌.ఇవాళ్టి నుంచీ మాట పెరగాలి.  ఇవాళ్టి నుంచీ ఘోష తగ్గాలి..!

సైలెన్స్‌ బ్రేక్‌ అవుతోంది. శుభ పరిణామం! అమ్మాయిల బాధను వినేవాళ్లూ సిద్ధమవుతున్నారు. ఇది అన్నిటికన్నా గొప్ప పరిణామం. ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా.. అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం... ఏ బాధనైనా మునిపంట బిగపట్టాలి.. ఏ కష్టాన్నయినా గుప్పిట్లో దాచిపెట్టాలి.. వంటి మాటలకు.. సలహాలకు కాలం చెల్లినట్టే. ఎందుకంటే ఆడవాళ్ల ఇబ్బందులను, శారీరక మానసిక హింసనూ విని అర్థం చేసుకునేందుకు సమాజం రెడీ అయింది. ఇన్నాళ్లూ మహిళలు మౌనంగా ఉంది.. తనను వేధించిన వ్యక్తి కుటుంబం నాశనమవుతుందోమోననో.. లేక జరిగిన దానికి లోకం తననే తప్పు పడుతుందేమోననో.. తనింటి పరువు, మర్యాదా బజారున పడతాయేమోననో భయం వల్ల! నిజానికి ఇలాంటి భయానికి కారణం మన వ్యవస్థే. అంటే మనమే. అణచివేసి అణచివేసి గొంతు లేకుండా చేద్దామనుకున్నాం. కాని స్ప్రింగ్‌లాగా పైకి లేస్తుందనే లాజిక్‌ మరిచిపోయాం. శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి ఆ లాజిక్‌ను గుర్తుచేస్తున్నారు. వాళ్లు మాట్లాడ్డం మొదలుపెడుతున్నారు కాబట్టి కారణమైన మగవాళ్లకు అసహనంగా ఉండిఉండొచ్చు. కాని దుర్బలుల సహనాన్నీ గ్రహించింది సమాజం.. అందుకే వినడం మొదలుపెట్టింది. లేకపోతే అత్యంత పురుష దురహంకారిగా ముద్ర వేసుకున్న అగ్రరాజ్య అగ్రజుడు ట్రంప్‌ కూడా మహిళ మాట్లాడితే విననైతే విన్నాడు!
 
అమెరికా సుప్రీంకోర్ట్‌ జడ్జిగా ట్రంప్‌ నామినేట్‌ చేసిన బ్రెట్‌ కవానా తన మీద లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించింది క్రిస్టీన్‌ బ్లేసీ అనే మహిళ. 1980ల్లో మేరీల్యాండ్‌ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. బ్లేసీ, కవానా ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నప్పుడు.. ఓరోజు తప్పతాగిన బ్రెట్‌.. బ్లేసీ దుస్తులు విప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని బ్రెట్‌ సుప్రీంకోర్ట్‌ జడ్జీగా నామినేట్‌ అయిన సమయంలో బయటపెట్టింది బ్లేసీ. ఈ ఆరోపణ మీద అమెరికాలోనూ చాలా వాద వివాదాలు జరిగాయి. బ్లేసీ చెప్పింది నిజమే అయుండొచ్చని బ్లేసీని నమ్మిన వాళ్లు 45 శాతం ఉంటే, బ్రెట్‌ను సపోర్ట్‌ చేసినవాళ్లు 38 శాతం. 45 శాతం అనేది ఇక్కడ గుడ్‌సైన్‌. ఇది మీ టూ వల్ల వచ్చిన చైతన్యం కావచ్చు.. ఆ ఉద్యమం కలిగించిన అవగాహన అయ్యుండొచ్చు.. ఏదైనా మంచి పరిణామం.  ఆ కదలిక మన దగ్గరా వస్తోంది.. నిజానికి ఇది 1988లోనే రాజుకుంది. పంజాబ్‌ కేడర్‌ ఐఏఎస్‌ రూపన్‌ డియోల్‌ బజాజ్‌ .. ఆ టైమ్‌లో ఫైనాన్స్‌ మినిస్ట్రీలో స్పెషల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అప్పుడు కేపీఎస్‌ గిల్‌ చండీగఢ్‌కు (అప్పుడు చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది) ఐజీ (ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌) గా ఉన్నారు. ఒక పార్టీలో కేపీఎస్‌ గిల్‌ తన పిరుదల మీద తట్టాడు అని కేసు నమోదు చేసింది రూపన్‌. అప్పుడు అదొక సంచలనం. హై ప్రొఫైల్స్‌ కలకలం సృష్టించింది.  

2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి హైప్రొఫైల్‌.. సెన్సేషన్‌కు కేంద్రమైంది. కె. మంగపతిరావు అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ తన కింది అధికారిణిని వేధించినట్టు కేస్‌ నమోదైంది. ఇవన్నీ కూడా మన దగ్గర ‘మీ టూ’కి ఆరంభ సూచికలే. తర్వాత కొంతమంది తమకు జరిగిన వేధింపుల గురించి నోరు విప్పినా.. మీడియా అత్సుత్సాహం.. వేధించిన వాళ్లకు పైవాళ్ల అండదండలుండటం వంటి కారణాల వల్ల మళ్లీ సైలెన్స్‌ స్టేట్‌లోకి వెళ్లిపోయారు బాధిత మహిళలు. అలాంటి సమయంలో దేశాన్నే ఒక్క కుదుపు కుదిపిన సంఘటన.. తెహల్కా మ్యాగజైన్‌ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌దే. తెహల్కా తరపున తరుణŠ  తేజ్‌పాల్‌ గోవాలో ‘థింక్‌ఫెస్ట్‌’ ఈవెంట్‌ నిర్వహించాడు. ఆ రోజు రాత్రి హోటల్‌ లిఫ్ట్‌లో.. తన దగ్గర ఇంటర్న్‌గా చేరిన ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు ఆమె తీవ్రంగా హర్ట్‌ అయి ఫిర్యాదు చేసింది. అయితే ఈ అంశంలో తరుణ్‌ తేజ్‌పాల్‌ ఎంత అప్రతిష్ట పాలయ్యాడో ఆ అమ్మాయీ అంతే ప్రశ్నలను ఎదుర్కొంది. ధైర్యంగా.. చెప్పాలంటే తొలిసారిగా.. ‘‘మై బాడీ మై రైట్‌ (నా శరీరం మీద నాదే హక్కు)అని నినదించింది. అప్పుడు మొదలైంది ఆడవాళ్లతో సహా అందరూ ఆలోచించడం. నిజమే కదా.. ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు. చలం ఏనాడో చెప్పిన మాట.. ఇన్నాళ్లూ పెడచెవిన వేసి.. ఇప్పుడిప్పుడు వినడం ప్రారంభించాం. అందుకే మీ టూ అంటూ సైలెన్స్‌ బ్రేక్‌ అవడం స్టార్ట్‌ అయింది. జర్నలిజం నుంచి సినిమా రంగానికి టర్న్‌ తీసుకుంది. తెలుగులో శ్రీ రెడ్డి.. బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తా  ఇండస్ట్రీని షేక్‌ చేశారు. ‘మీ టూ’లో వేధింపుల చిట్టా పెరుగుతూంటే వింటోన్న మనం విస్తుపోతున్నాం. ఆ ప్రకంపనలు మళ్లీ జర్నలిజం వైపూ పాకాయి. ఎమ్‌జే అక్బర్‌ లాంటి దిగ్గజాల నుంచి కేఆర్‌ శ్రీనివాస్, టీఎస్‌ సుధీర్‌ వంటి వాళ్ల పేర్లూ లిస్ట్‌లో కనబడుతున్నాయి. ఆ జాబితా కొనసాగుతూనే ఉంది. 

అయితే.. వింటున్నాం.. కాని జరిగినప్పుడే చెప్పక.. ఇప్పుడెందుకు చెప్తున్నారు అన్న సందేహాన్నీ వెలిబుచ్చుతున్నాం. ఇందాకే అనుకున్నాం.. చెప్పకుండా దాచుకోవడానికి సమాజం మన నెత్తి మీద పరువనే పెద్ద బరువునే పెట్టింది. దాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. కాని దాని గడువు తీరింది. ఎక్స్‌పైరీ అయిపోయింది. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నట్లు.. అన్‌వాంటెడ్‌ టచ్‌ను.. ఇష్టంలేని స్పర్శ కలిగించిన అవమానాన్ని స్త్రీ ఎప్పటికీ మరిచిపోలేదు. జీవితాంతం ఆ వేదనను అనుభవిస్తూనే ఉంటుంది. అందుకే ఆమె ఆ  కోపాన్ని, బాధను ఎప్పుడైనా వెలిబుచ్చవచ్చు. కాబట్టే ఆమెను వినాలి. అవును.. వింటున్నాం.. విని ఊరుకోవద్దు.. పరిస్థితులను మార్చాలి.. మనల్ని మనం మార్చుకోవాలి. 
– సరస్వతి రమ

నిందితులు: తరుణ్‌ తేజ్‌పాల్, ఎం.జె.అక్బర్‌
నాలుగేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో తరుణ్‌ తేజ్‌పాల్‌ ఈ నెల 30న మరోసారి సుప్రీంకోర్టుకు  హాజరవుతుండగా..  పూర్వపు జర్నలిస్టు, ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్‌ తాజాగా  ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement