
అలోక్‌నాధ్‌పై వేధింపుల బాంబు పేల్చిన మరో మహిళ..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్‌పై రచయిత, నిర్మాత వింటా నందా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే సినీ పరిశ్రమకు చెందిన మరో మహిళ అలోక్ ఆగడాలపై పెదవివిప్పారు. 1999 నాటి సల్మాన్ ఖాన్ మూవీ హమ్‌సాథ్‌సాథ్‌హై సెట్స్‌పై అలోక్ నాథ్ తనతో అసభ్యంగా వ్యవహరించారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆ మహిళ మిడ్‌డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా రాత్రి వేళ షూటింగ్ సమయంలో అలోక్ తన ఎదుటే దుస్తులు మార్చుకోవడంతో షాక్‌కు గురయ్యానని, భయంతో గది నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా తన చేయిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
అలోక్ చేయిని వదిలించుకుని ఒక్క ఉదుటున గది నుంచి బయటపడ్డానని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. చిత్ర మేకర్ సూరజ్ బరజాత్యతో నటుడికి సన్నిహిత సంబంధం ఉన్నందున తాను ఈ విషయం సూరజ్ దృష్టికి తీసుకువెళ్లలేదన్నారు. ఈ ఘటనతో తాను గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.
అలోక్ ప్రవర్తనను బాహాటంగా బయటపెట్టిన వింటా నందా ధైర్యాన్ని మెచ్చుకోవాలని ప్రశంసించారు. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీల బాగోతంపై బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తమకెదురైన లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే.