
అలోక్ నాధ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి సంధ్యా మృధుల్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు అలోక్ నాధ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు మహిళలు ముందుకొస్తున్నారు. అలోక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ రచయిత,నిర్మాత వింటూ నందా ఆరోపించగా, మరో నటి తన ఎదుట ఆయన దుస్తులు మార్చుకున్నారని, అసభ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తాజాగా ప్రముఖ నటి సంధ్యా మృదుల్ అలోక్ నాధ్ తనను లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేశారు. అలోక్ నాధ్ వేధింపులపై పేజ్3, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి సినిమాల్లో నటించిన సంధ్య బహిరంగంగా నోరుమెదిపారు. హఫ్‌పోస్ట్ ఇండియాలో ఓ టెలిఫిల్మ్ షూటింగ్ సందర్భంగా అలోక్ నాధ్ చేతిలో నరకం అనుభవించిన ఉదంతాన్ని వివరించారు.
తన కెరీర్ తొలినాళ్లలో కొడైకెనాల్‌లో టెలిఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నానని, ఈ టెలిఫిల్మ్‌లో తన తండ్రి పాత్రలో నటించిన అలోక్ నాధ్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తన నటనను ప్రశంసిస్తూ తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఒక రోజు రాత్రి యూనిట్ సిబ్బంది ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీ సందర్భంగా తన పక్కనే కూర్చున్న అలోక్ తప్పతాగి అమర్యాదకరంగా వ్యవహరించారని దీంతో తాను అక్కడి నుంచి బయటపడి తన హోటల్ రూమ్‌కు చేరకున్నానన్నారు.
అదే రోజు రాత్రి హోటల్ రూమ్‌కు వచ్చిన అలోక్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా తాను తప్పించుకుని యూనిట్ సిబ్బందిని ఆశ్రయించానన్నారు. రూమ్‌లో తనకు తోడుగా హెయిర్ డ్రెస్సర్‌ను పంపారని ప్రతి రోజూ రాత్రి అలోక్ తన రూమ్ వద్దకు వచ్చి గొడవ చేసేవాడన్నారు. అప్పటికే అలోక్ ప్రముఖ నటుడు కావడం, తాను కెరీర్‌ను ప్రారంభించిన రోజులు కావడంతో తన ఇబ్బందులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. షూటింగ్ ముగిసి ముంబై వెళ్లిన తర్వాత తాను పొగరుబోతునని అలోక్ ఇండస్ర్టీలో ప్రచారం చేశాడన్నారు. అలోక్‌ను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టమని, వింటా నందా పట్ల ఆయన వ్యవహరించిన తీరు దారుణమని సంధ్య మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment