అమ్మ అంతగా ప్రేమించకూడదా! | Special story on mother and childrens | Sakshi
Sakshi News home page

అమ్మ అంతగా ప్రేమించకూడదా!

Published Thu, Jan 24 2019 12:35 AM | Last Updated on Thu, Jan 24 2019 4:45 AM

Special story on mother and childrens - Sakshi

పిల్లలు సరిగా పెరగకపోతే నిర్లక్ష్యం చేశారు అంటారు.  మరి..వాళ్లే ప్రపంచం అనుకుని జీవిస్తే? నిర్లక్ష్యం అయిపోతామా! చివరి రోజు దాకా  పిల్లల దగ్గర ఏమీ ఆశించము.  వాళ్లు ఆశిస్తే  బాగుండు అనుకుంటాము. బలమైన చెట్టుకు  లత పాకినట్లు ఉండేది.. పిల్లలు కాదు.. తల్లే!!

అతని కణతల నుంచి జివ్వున చెమటలు చిందాయి. ‘ఏమంటున్నావు నువ్వు’ అన్నాడు పనిమనిషిని చూస్తూ. ‘అవునయ్యా. అమ్మగారు సరుకుల పట్టిక కూడా చెప్పలేకపోతున్నారు. రెండు మూడు నెలలుగా నేనే సరుకులు రాసి తెస్తున్నాను’ అతనికి రెండు నెలల క్రితం జరిగింది గుర్తుకొచ్చింది. ఇంట్లో పవర్‌ కట్‌ చేశారు డిపార్ట్‌మెంట్‌ వారు. ఇలా జరగడం అరుదు. భార్యే ఆన్‌లైన్‌లో కట్టేస్తుంది.  ‘బిల్‌ కట్టలేదా?’ అడిగాడు. ‘మ..మ... మర్చిపోయాను’ అని గొణిగింది. ఏదో పొరపాటనుకుని పట్టించుకోలేదు. కాని ఒక్క క్షణం స్థిమితంగా కూర్చుని గత ఆరు నెలలుగా భార్య ప్రవర్తనను గుర్తు చేసుకుంటే అతడి కణతల నుంచే కాదు ఒళ్లు మొత్తం చెమటలు పడుతున్నాయి. తామిద్దరూ కలిసి బయటకు వెళ్లి ఆరునెలలు. భార్య ఇల్లు దాటి ఆరు నెలలు. అసలు ఇంట్లో కూడా తను క్రమంగా బెడ్‌రూమ్‌లోకే పరిమితమైపోయినట్టు మెల్లగా అతనికి గుర్తుకొచ్చింది. డైనింగ్‌ టేబుల్‌ మీద గతంలో పదార్థాలు పెట్టేది. తింటుంటే వచ్చి కూచునేది. ఉదయాన్నే ఇంట్లో పనుల్లో హడావిడిగా కనిపించేది. గార్డెనింగ్‌లో బిజీగా ఉండేది. అవన్నీ ఆమె చేయట్లేదని, చేసి చాలా రోజులు అవుతోందని అతడికి జ్ఞాపకం చేసుకునే కొద్దీ అర్థమైంది. ఆమెను ఇంత నిర్లక్ష్యం చేశాడా? ఆమె ఇలా శిథిలం అయిపోయిందా?

అతనికి యాభై సంవత్సరాలు. ఆమెకు నలభై అయిదు సంవత్సరాలు. మంచి ఇండిపెండెంట్‌ హౌస్‌ ఉంది. రెండు కార్లున్నాయి. బ్యాంక్‌ బేలెన్స్‌ ఉంది. అతడికి చాలా పెద్ద ఉద్యోగం. ఇవాళ హైదరాబాద్‌లో రేపు ముంబైలో ఎల్లుండి యూకేలో తిరుగుతుంటాడు. ఆమె ఇంట్లో ఉంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కాని అతడు పనుల్లో ఉంటాడు. ఆమె ఇంటిని నిర్వహిస్తూ ఉంటుంది. గతంలో ఆమె దినచర్య చాలా వేగంగా ఉండేది.ఇద్దరు అబ్బాయిలు. మూడేళ్ల గ్యాప్‌తో పుట్టారు. వాళ్లకు తండ్రి మంచి స్నేహితుడు. కాని తల్లి ఊతకర్ర. పిల్లలు ఆమె మీదే ఆధారపడేవారు. స్కూలుకు వెళ్లడం ఆమె తయారు చేస్తేనే. టిఫిన్లు ఆమె తినిపిస్తేనే. సాయంత్రం వచ్చి హోమ్‌ వర్క్‌లు... ఆమె చేయిస్తేనే. స్విమ్మింగ్‌ క్లాసులకు తీసుకెళ్లేది. సినిమాలకూ కలిసి ముగ్గురూ వెళ్లేవారు. పెద్దవాడు ఎమ్‌సెట్‌ రాయాల్సి వస్తే తనే కోచింగ్‌ తీసుకున్నంత హడావిడి చేసింది. చిన్నవాడు క్రికెట్‌ సెలెక్షన్స్‌కు వెళతానంటే తనే గ్రౌండ్‌లో పడిగాపులు కాచేది.

పిల్లలు ఆమెలో నిండిపోయారు. ఆమె పిల్లలతో పెనవేసుకుపోయింది.మొదటి దెబ్బ ఆమెకు పెద్దాడు ఐఐటి కోసం ముంబైకు వెళ్లడంతో పడింది. వాడు వెళ్లిపోవడంతో ఆమెలో సగం ఖాళీ అయ్యింది. కాని ఆమె ధ్యాస మళ్లించడానికి చిన్నవాడు ఉన్నాడు. వాడి బిటెక్‌ ఇక్కడే పట్టుబట్టి చేర్చడం వల్ల కళ్లెదుటే ఉన్నాడు. కాని వాడి బి.టెక్‌ అయిపోయింది. ఎం.బి.ఏ చేయడానికి యూ.ఎస్‌ వెళతానని చెప్పినప్పుడు ఆమెను రెండో దెబ్బ తాకింది.పెద్దాడు చదువు పూర్తయ్యి అక్కడే ఉద్యోగం చూసుకుని చుట్టపుచూపుగా వచ్చిపోతున్నాడు. చిన్నాడు అమెరికా వెళితే మరి కనిపిస్తాడో లేదో.చిన్నాడు ఫ్లయిట్‌ ఎక్కేరోజున ఆమె కన్నీరు మున్నీరైంది. భర్త అది చూసి సహజమైన తల్లిప్రేమ అనుకున్నాడు.తల్లిప్రేమ నిజమే కాని అది ఒంటరిగా మిగలనున్న తల్లి విలాపం కూడా. ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇంట్లో లేరు. వాళ్ల భోజనం గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాళ్లు ఎప్పుడు ఇంటికొస్తారో అని ఎదురు చూడాల్సిన పని లేదు. వాళ్ల బట్టలు ఉతికించి రెడీ చేయాల్సిన పని లేదు. వాళ్లతో కలిసి సరదాగా అలా రైతు బజారుకు వెళ్లే పని లేదు.పిల్లలకు సంబంధించినంత వరకు తల్లిగా ఆమె చేయాల్సిన బాధ్యత దాదాపుగా ముగిసిపోయినట్టుగా అనిపించింది.ఇక భర్త సంగతి.

పెళ్లయిన నాటి నుంచి చూస్తున్నదే. ఉదయాన్నే వెళ్లిపోతాడు ఏ రాత్రో వస్తాడు. అవసరం ఉన్నంత వరకు మాట్లాడతాడు. పిల్లల గురించి సమాచారం తెలుసుకుంటాడు. భార్యతో అతడికి బంధం ఉంది తప్పఅనుబంధం లేదు. పిల్లలు వెళ్లిపోయాక కూడా అతని దినచర్య మారలేదు. అతనికి సంబంధించినంత వరకూ తానేమిటో ఇప్పటికీ తెలియదు.అప్పుడు ఆమెకు సందేహం వచ్చింది.ఇక నా జన్మకు అర్థం ఏమిటి? ఎందుకు జీవించాలి? ఏం పని ఉందని జీవించాలి?అంతా ఖాళీ... అంతా ఖాళీ... అన్నీ ఖాళీ.మెల్లగా ఆమె ముకుళించుకోవడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా ఇంటి పనులు కూడా పట్టించుకోవడం మానేసింది. పనివాళ్లను అజమాయిషీ చేయడం కూడా ఆమెకు రావడం లేదు. చిన్నచిన్న పనులకు కూడా శక్తి ఉండటం లేదు. భర్త పలికితే జవాబు ఇస్తోందే తప్ప తాను మాట్లాడటం లేదు.ఆమెకు ఏమైందో తెలుసుకోవడానికి అతడికి ఆరునెలలు పట్టింది.జరిగిన నష్టం అర్థమయ్యాక ఆమెను తీసుకొని అతడు సైకియాట్రిస్ట్‌ దగ్గరకు పరిగెత్తాడు.‘ఇంతకాలం పిల్లల కోసం జీవించారు. ఇక మీదట మీ కోసం జీవించొచ్చు కదా’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌ ఆమెతో మొత్తం విని.సైకియాట్రిస్ట్‌ మళ్లీ అంది.‘మన తల్లులు, అమ్మమ్మ నాయనమ్మలు కూడా ఇలా లేరు. మన సిస్టమ్‌లో ఎంతో కొంత వెసులుబాటు ఉండేది. పల్లెల్లో ఆడవాళ్లు గుళ్లకు వెళ్లడం, భజనలకు వెళ్లడం, పేరంటాలకు వెళ్లడం, లేదంటే ఉమ్మడిగా కబుర్లు చెప్పుకోవడం, బంధువులతో ఇంటరాక్ట్‌ అవడం ఇలా ఏదో ఒక వ్యాపకంలో ఉండి వాళ్లదైన ఒక ఫుల్‌నెస్‌తో ఉండేవారు.కాని మీరూ మీలాంటి వాళ్లు మొత్తం భర్తతో, పిల్లలతో జీవితాన్ని ఫుల్‌ చేసుకుంటే వాళ్లు పక్కకు తప్పుకున్నప్పుడు అవస్థ పడాల్సి వస్తుంది. మీరు చదువుకొని ఉండొచ్చు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగమైనా చేసి ఉండొచ్చు.లేదంటే మీకు నచ్చిన పని ఏదో తెలుసుకొని అందులో ఒక గుర్తింపు పొంది ఉండవచ్చు. కాని అవేమీ మీరు చేయలేదు. ఇక మీదైనా చేయాలి’ అంది సైకియాట్రిస్ట్‌.తర్వాత ఆమె భర్తతో మాట్లాడింది.

‘మీరు మీ భార్యను టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. మీరు ఎలా ఉన్నా ఆమె పడి ఉంటుంది అని భావించారు. ఆమె ఒక మనిషి అని, ఒక ఐడెంటిటీ అని, మీకు మల్లే ఆమెకు కూడా ఏవో కోరికలు, ఆకాంక్షలూ, వ్యాపకాలూ ఉండాలని మీరనుకోలేదు. వాటిని పట్టించుకోవాలని భావించలేదు. విమానాల్లో ఎగురుతూ నేల మీద ఉన్న జీవితాన్ని పాడు చేసుకున్నారు’ అంది.కాని అప్పటికే అదుపు లేనంత డిప్రెషన్‌లోకి అతని భార్య వెళ్లిపోయి ఉంది.అతడు మెల్లమెల్లగా మారుతూ ఇంట్లో ఎక్కువ సమయం ఉంటూ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం సిన్సియర్‌గా చేశాడు. కొద్దిపాటి మందులు వాడాల్సి వచ్చింది. ఒక స్కూల్‌లో ఆమె వాలెంటీర్‌గా చేరడం, రెండు మూడు స్వచ్ఛంద సంస్థల్లో చేరి కొన్ని సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొనడం... ఇవన్నీ క్రమంగా ఆమెను మామూలు మనిషిని చేశాయి.మంచి ఇల్లు అంటే మనుషులు నిండుగా ఉన్న ఇల్లు  మాత్రమే కాదు.మనుషులు లేకపోయినా అనుబంధాలు నిండుగా ఉండే ఇల్లు. భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటే పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయినా ఆ గూడు బోసిపోదు.ఆమె గుండె పాడు కాదు. అది గ్రహించుకుంటే ప్రతి ఇల్లూ పొదరిల్లే.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement