దాదాపు వందేళ్లుగా భూమ్మీద జనాభా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. ఇదిలాగే పెరిగితే ఏమవుతుందోనన్న ఆందోళనా పెరుగుతూ వ చ్చింది. కానీ ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ.. కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుతూ పోతోంది. దీనివల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ.. పిల్లల శాతం తరుగుతూ వస్తోంది. భూమ్మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్న పిల్లలు (ఐదేళ్ల వయసు లోపు) ఉన్న సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు తాజాగా తేల్చారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2017వ సంవత్సరమే అత్యంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది (పీక్ చైల్డ్ ఇయర్) అని.. తర్వాతి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గుర్తించారు. ‘ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా అంచనాలు–2022 నివేదిక’ ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు.
► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు, ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోందని యూఎన్ నివేదిక వెల్లడించింది.
► మన దేశానికి వస్తే.. జనాభా నియంత్రణ, ప్రజల్లో అవగాహన క ల్పించే చర్యలతో 2004వ సంవత్సరం నుంచే చిన్న పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 2021 నాటికి దేశంలో 11.53 కోట్ల మంది చిన్నారులు ఉన్నారని.. 2100 నాటికి ఇది 6.86 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసింది.
► ఇటీవలిదాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనాలో అత్యధికంగా 13.82 కోట్ల మంది పిల్లలు ఉన్నది 1972లోనే. నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ సంఖ్య 2000వ సంవత్సరం నాటికి 8.41 కోట్లకు, 2021 నాటికి 7.47 కోట్లకు తగ్గింది. 2100 ఏడాది నాటికి అక్కడ ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 2.38 కోట్లలోపే ఉంటుందని యూఎన్ అంచనా వేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment