మద్యానికి దూరంగా ఉండడం అంటే...
మంచి ఆరోగ్యానికి దగ్గరగా ఉండడమే.
న్యూ ఇయర్ వస్తోంది.
ఊరికే రాదు.
‘హ్యాపీ’ అనే ట్యాగ్‌తో వస్తుంది.
ఆ ట్యాగ్‌ని అలాగే నిలుపుకుందాం.
హెల్త్‌ని, హ్యాపీనెస్‌నీ కాపాడుకుందాం.
మద్యం పొంగి పొరలే తరుణం దగ్గరపడింది! న్యూ ఇయర్ అంటూ ఫ్రెండ్స్ ఛీర్ అప్ అయ్యే టైమ్ ముంచుకొస్తోంది. సో.. ‘ముందున్నది ప్రమాదకరమైన ‘మందు’ మలుపు! ఆ మలుపును సేఫ్‌గా దాటించడానికే ఈ హెచ్చరిక బోర్డులాంటి కథనం. ఎలాంటి పరిమితులూ పాటించకుండా దీర్ఘకాలం మద్యం సేవిస్తుండటం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. మన శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపైనా దాని దుష్ప్రభావం ఉంటుంది. మెదడు (నాడీవ్యవస్థ), జీర్ణవ్యవస్థ, గుండెతో పాటు రక్తప్రసరణ వ్యవస్థ, సెక్స్ సామర్థ్యంతో పాటు ప్రత్యుత్పత్తి ధర్మాలు సహా.. అన్నీ దెబ్బతిటాయి. క్యాన్సర్ల ముప్పు అయితే ప్రతి క్షణం పొంచి ఉంటుంది.
ఫస్టు సిప్పుతోనే మొదలు
జీర్ణం కావడానికి ఆహారానికైనా కాస్త టైమ్ పడుతుందేమో గానీ... నోట్లోకి చేరీ చేరగానే మద్యం దుష్ప్రభావాలు మొదలైపోతాయి. మద్యం పెదవులు దాటి నోట్లోకి రాగానే అక్కడి మ్యూకస్ పొరలు (మ్యూకస్ మెంబ్రేన్) ఆ రసాయన ఘాటుకు ఎంతోకొంత దెబ్బతింటాయి. ఆహారం ఒంట్లోకి ఇమిడిపోవాలంటే అందుకోసం అది చిన్న పేగుల వరకు రావాలి. కానీ ఆల్కహాల్ నేరుగా మ్యూకస్ పొరల నుంచే ఒంట్లోకి ఇంకుతుంది. ఖాళీ కడుపుతో కనుక ఆల్కహాల్ తాగుతుంటే ఈ ఇంకిపోయే వేగం మరింత ఎక్కువవుతుంది. ఇలా మ్యూకస్ పొరల దగ్గర్నుంచి చిన్న పేగుల వరకు ప్రతి చోటా మద్యం దుష్ప్రభావం చూపుతుంది.
డైరెక్ట్ ఎటాక్.. కాలేయం మీదే
ఒంట్లోకి వచ్చే ప్రతి విష పదార్థానికీ, ఆ మాటకొస్తే ప్రతి పదార్థానికి గేట్ కీపర్ లాంటిది కాలేయం. ఆహారం పట్టుకొచ్చే పాస్‌ను చూసి... విధిగా చెక్ చేసి మరీ ఆ ఆహారాన్ని లోనికి అనుమతిస్తుంది కాలేయం. వచ్చింది లిక్కర్ అని తెలియగానే... లివర్ అందులోని విషపదార్థాలను విరిచివేయడం మొదలెడుతుంది. గేట్‌కీపర్‌గా మాత్రమే కాదు... చెత్తను ఎత్తిపోసే కూలీగా కూడా పనిచేస్తుంది లివర్. మద్యం ప్రభావంతో మెదడు కూడా మనకు జీవక్రియలు వేగంగా జరిగేలా చూసి చెమటపట్టించేలా చేస్తుంది. అలాగే శ్వాసవేగం పెరిగేలా చూస్తుంది. ఆ చెమటలో... శ్వాసలో దుర్గంధం ఎందుకంటే... తాను విరిచేసిన విషాలను ఇటు చెమటలోనూ, అటు శ్వాస ద్వారా లివర్ బయటకు నెట్టేయడం వల్లనే. ఆ తర్వాత మూత్రం ద్వారా కూడా అదే పని చేస్తుంది లివర్. ఇలా లివర్ చేసే కూలీ పనులకు చెమట, శ్వాస అనే సహాయకూలీలను పంపి మనల్ని పదిలంగా కాపాడుతుంది మెదడు!
‘కంజీనర్ల’ మాయ
ఆల్కహాలిక్ లిక్కర్ ఏదైనా సరే... అందులో కొన్ని పదార్థాలుంటాయి. వాటిని ‘కంజీనర్స్’ అంటారు. ఆల్కహాల్ తాగగానే మనకు మద్యం తాలూకు అసలు రుచి తెలియదు. వాసన పసిగట్టలేం. రంగును గుర్తించలేం. అంటే అలా రంగు, రుచి, వాసనలకు పంజరాల్లా పనిచేస్తాయి ఈ కంజీనర్స్. ఈ కంజీనర్స్ కేవలం మిథనాల్, బ్యుటనాల్ వంటి ఆల్కహాల్‌లో మాత్రమే కాదు... ఆల్‌డిహైడ్స్, ఫీనాల్స్, టానిన్స్, ఐరన్, లెడ్, కోబాల్ట్‌లలోనూ ఉంటాయి.
అదే పనిగా తాగేయడం (బింజ్ డ్రింకింగ్)
కొంతమంది ఎప్పుడో ఒకసారి కదా తాగుతున్నాం అనుకుని ఆ ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. అలా తాగినప్పుడు 6 నుంచి 36 గంటల పాటు దేహంలో చక్కెర పాళ్లు లోపిస్తాయి. అందుకు కారణం మన చక్కెరపాళ్లను సరిదిద్దుతూ/నియంత్రిస్తూ ఉండాల్సిన కాలేయం అసలు పని వదిలేసి ఆల్కహాల్ విషాలను విరిచేస్తూ ఉండటమే. దాంతో మన ఒంట్లోని నీళ్ల (ద్రవాల) పాళ్లు తగ్గుతాయి. దాంతో డీ–హైడ్రేషన్ జరిగి... దాహం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్థితి గంటలకొద్దీ కొనసాగుతుంటుంది. ఒక్కోసారి మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టవచ్చు. ఫలితంగా తలనొప్పి మొదలుకొని... వాంతులు, మూర్ఛ, కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా రావచ్చు. ఇలా అపరిమితంగా తాగేసినప్పుడు అంచనా వేసే శక్తి లోపించడం, అవయవాలను సమన్వయం చేసుకోలేకపోవడం, దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి పరిణామాలకు దారితీసి, ప్రయాణంలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. రక్తంలో మితిమీరి ఆల్కహాల్ ఉంటే ఒళ్లు చల్లబడిపోవచ్చు. రక్తపోటు తగ్గిపోవచ్చు. శ్వాసక్రియ క్రమంగా మందగించి మరణానికి దారితీయవచ్చు.
మద్యం దుష్ఫలితాలు
మైగ్రేన్ : ముదురు రంగులో ఉండే వైన్ లేదా చేదుగా ఉండే రమ్ వంటి ఆల్కహాల్ ద్రవాలు తాగినప్పుడు అవి తొలుత మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించవచ్చు. ఇలాంటి దీర్ఘకాలిక మైగ్రేన్.. తలనొప్పులు ఒక్కోసారి మూర్ఛ, పక్షవాతానికి దారితీసే ప్రమాదమూ ఉంది.
మూర్ఛ : సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో మూర్ఛ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. కొందరు ఎప్పుడూ తాగుతూ ఉండడం, కొన్నాళ్ల తర్వాత మళ్లీ మానడం వంటివి చేస్తుంటారు. ఇలా మాటిమాటికీ తాగుడు మొదలుపెట్టడం, మానడం చేసేవారిలో ‘కిండ్లింగ్’ అనే ప్రక్రియ చోటుచేసుకొని అది కూడా మూర్ఛకు దారితీస్తుంది. కిండ్లింగ్ అంటే తటాలున నిప్పును పుట్టించడం. అంటే ఇలా తాగుడును ఇష్టం వచ్చినట్లు మొదలుపెట్టడం, సడెన్‌గా మానేయడం వల్ల మెదడులో తటాలున జరిగే పరిణామాలతో మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆల్కహాల్‌ను మొదలే పెట్టకూడదు.
నియంత్రణ కోల్పోవడం : దీర్ఘకాలం మద్యం తాగేవారిలో మెదుడులోని బ్యాలెన్సింగ్‌కు తోడ్పడే సెరిబెల్లమ్ భాగం దెబ్బతింటుంది. దాంతో వారు సరిగా నడవలేరు. తూలుతున్నట్లుగా నడుస్తారు. మాట కూడా ముద్దముద్దగా, అర్థం కానట్లుగా (స్లర్ర్‌డ్ స్పీచ్) వస్తుంది.
పెరిఫెరల్ న్యూరోపతి : ఆల్కహాల్ వల్ల ఒంట్లో మండుతున్నట్లుగా (బర్నింగ్ సెన్సేషన్) ఉండవచ్చు. అరికాళ్లు, అరచేతుల్లో నొప్పి, సూదులతో గుచ్చుతున్నట్లుగా కూడా ఉంటుంది. క్రమంగా నరాల దొంతరలు (నర్వ్ ఫైబర్స్) దెబ్బతిని... ఆ తర్వాత్తర్వాత చేతులు–కాళ్లు దెబ్బతిని నడవలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటి స్థితి రావచ్చు. మద్యం మానేయడం ద్వారా దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మెల్లగా చక్కబడి మునుపటిలా అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక మద్యంతో తలతిరగడం, అంగస్తంభన సమస్యలు, నియంత్రించలేనంత ఒత్తిడితో మూత్రం వస్తుండటం, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంపై నియంత్రణ లేకపోవడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అలాగే మనకు ఆహారంతో అందాల్సిన విటమిన్లను మద్యం అందనివ్వదు. దాంతో విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు, కలిగే దుష్పరిణామాలు సంభవిస్తాయి.
చూపు దెబ్బతినడం : అన్ని కండరాలు దెబ్బతిన్నట్లే చాలా అరుదుగా కంటి కండరాలు దెబ్బతిని చూపు తగ్గవచ్చు.
ఇలా ఎలా చూసినా మద్యంతో అన్నీ నష్టాలే. న్యూ ఇయర్ పార్టీ అనో, మరొకటనో కొన్ని క్షణాల ఉల్లాసం కోసం ఇంతటి మూల్యాన్ని చెల్లించడం సరైనపని కాదన్నది గ్రహిస్తే... మద్యానికి దూరంగా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు.
మద్యానికి ఎందుకు బానిసలవుతారంటే..!
మొదటిసారి మద్యం తాగినప్పుడు ఒకటి రెండు డ్రింక్స్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటాయి. శరీరం తేలికైపోయినట్లు ఉంటుంది. ఉల్లాసంగా అనిపిస్తుంది. సంకోచాలు తగ్గుతాయి. స్ట్రెస్ కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం మెదడులోని ఓపియాయిడ్ అనే కణాల నుంచి డోపమైన్ అనే రసాయనాలు బయటికి వచ్చి మెదడును కాసేపు ఉత్తేజపరచడమే. దాంతో ఒకలాటి ఆనందంలో తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభూతులను మనసు తరచు కోరుకుంటూ ఉంటే మద్య సేవనం వైపు ఆలోచన మళ్లుతుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. మద్యసేవన వ్యసనం మితిమీరితే మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం దెబ్బతినడం మొదలవుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి తోడ్పడే ఈ భాగం క్రమంగా పనిచేయకపోవడంతో ఆ భావోద్వేగాలపై అదుపు లేకుండా పోతుంది. రిస్క్ తీసుకునే పనులకు పాల్పడతాం. ముప్పును తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరుగుతుంది. దాంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. క్రమంగా మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రభావితమవుతుంది. ఫలితంగా మరచిపోవడం, మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. అంతేకాదు, నిద్రపై కూడా ప్రభావం పడుతుంది. మనం హాయిగా పడుకున్న తర్వాత ఒక రిలాక్సేషన్ ఫీలింగ్‌తో తిరిగి నిద్రలేస్తాం. ఇందుకు కారణం మన నిద్రలోని ఒక దశ. ఇందులో కనుపాపలు స్పందిస్తూ ఉంటాయి. నిద్రలేవగానే హాయినిచ్చే ఈ దశనే ఆర్‌ఈఎమ్ దశగా చెబుతారు. బాగా మద్యం తాగినప్పుడు మనలో ఆర్‌ఈఎమ్ దశ లోపిస్తుంది. దాంతో నిద్రలేచాక చికాకుగా ఉండి, హాయి అనే ఫీలింగ్ ఉండదు. నిద్రలో ప్రమాదకరమైన గురక (స్లీప్ ఆప్నియా)తో ఒక్కోసారి ఊపిరి ఆగిపోయే ముప్పు పొంచి ఉంటుంది.
డా. బి. చంద్రశేఖర్ రెడ్డి
సీనియర్ న్యూరోఫిజీషియన్
సిటీ న్యూరో సెంటర్, రోడ్ నం.12
బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment