కొమురెల్లి కోరమీసాల మల్లన్న | special story on mallannna temple | Sakshi
Sakshi News home page

కొమురెల్లి కోరమీసాల మల్లన్న

Published Tue, Aug 1 2017 11:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

కొమురెల్లి కోరమీసాల మల్లన్న

కొమురెల్లి కోరమీసాల మల్లన్న

పుణ్య తీర్థం

కొండ చెరికలో ఉన్న కోరమీసాల కొంరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే.. మల్లన్న దర్శనం పుర్వజన్మ సుకృతం అంటారు. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.

స్థల పురాణం
కొమురవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లు ప్రతీతి. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామి కన్పించి నేను ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నాను. దర్శించుకొమ్మని, కొలిచిన వారి కొర్కెలు తీరుస్తానని చెప్పినట్లు ప్రచారం. అనాటి నుండి ఆ ప్రాంతం ప్రజలు పూజలు చేయడం మొదలు పెట్టారు. అప్పటికే వీరశైవ సాంప్రదాయం విరాజిల్లుతున్న కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైన కొముర వెల్లిలో వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.

చెక్కు చెదరని పుట్టమట్టి విగ్రహం
ఇంద్రకీలాద్రిపై కొండ చెరికలో వెలసిన మల్లన్న దేవునికి పూజలు మొదలై ఐదు వందల యేళ్లయింది. విచిత్రం ఏమిటంటే...  500 సంవత్సరాల క్రితం పుట్టమట్టితో విగ్రహాన్ని తయారు చేశారు. దేవుడికి కోరమీసాలు కూడా పెట్టారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ విగ్రహం నాభిలో శివలింగం ఉండటం ప్రత్యేకత. యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మ, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మను పాణిగ్రహణం చేసుకొని స్వామి ఇక్కడ వెలిసినట్లు నానుడి. అందుకోసమే స్వామి వారికి ఇరుపక్కల గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు.

పట్నాల మల్లన్న
దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా, స్వామి వారికి యాదవ కుల ఆచారం ప్రకారం ఒగ్గు పూజారులు వివిధ రంగుల, రంగాలంకార  పట్నాలతో స్వామి వారిని కొలుస్తారు. అనంతరం బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్నం వేయించడం విశేషం. స్వామి వారికి బోనం చేసే కుండను భద్రంగా ఇంటికి తీసుకెళ్లి దాంట్లో పాలు పితకడం, పాలు కాచడం చేస్తే ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలతోపాటు, అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయని, పశుసంపద, పాడిపంటలతో ఆ ఇల్లు తులతూగుతుందని విశ్వాసం. అదేవిధంగా గంగరేగు చెట్టు, ఒళ్లు బండ ఇక్కడ ప్రత్యేకత.

గంగరేగు చెట్టుకు ప్రదక్షిణ చేసి ఒళ్లు బండ వద్ద ప్రణమిల్లి చెట్టు వద్ద పట్నం వేసిన వారి కోరికలు తీరుతాయని నమ్మకం. కోర్కెలు తీరాలని కొబ్బరి కాయల ముడుపులు కట్టడం అనవాయితీ. తడి బట్టలతో దేవాలయం ముందుండే ఒళ్లు బండ వద్ద ఒళ్లుపట్టుకుని, కోడెలు కట్టేస్తామని మొక్కిన వారికి సంతానం కల్గుతుందని నమ్మకం. స్వామివారి బండారి, గంగిరేగు చెట్టు ఆకు ఎంతో మహిమ గలవని, బండారి నుదుట పెట్టుకొని గంగిరేగు ఆకును ఔషధంగా తీసుకుంటే సర్వరోగాలు తొలగిపోతాయని విశ్వాసం.

కన్నుల పండుగగా.. మల్లన్న కల్యాణం
తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా మొక్కే కొంరెల్లి మల్లన్న కల్యాణం ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరుగుతుంది. మార్గశిర బహుళ ద్వాదశి స్వామివారి దృష్టికుంభం (బలిహరణము) నుండి మొదలయ్యే ఉత్సవాలు మార్గశిర బహుళ ద్వాదశిరోజు కల్యాణం, ఏటా మహాశివరాత్రి రోజు పెద్దపట్నం, ఫాల్గుణ మాసం బహుళ త్రయోదశి రోజు అగ్నిగుండాల ప్రజ్వలన మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతి రోజు స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవచ్చు
ప్రసిద్ధ కొమురెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉంది. హైదరాబాద్‌ నుండి రాజీవ్‌ రహదారి మీదుగా 80 కిలోమీటర్లు, వరంగల్‌ నుండి జనగామ మీదుగా 110 కిలోమీటర్లు, కరీంనగర్‌ నుండి సిద్దిపేట మీదుగా వస్తే 80 కిలో మీటర్ల దూరం ఉంటుంది.  

ఈ క్షేత్రానికి ఇలా వెళ్లాలి
వైఎస్‌ఆర్‌ జిల్లాలో వేంపల్లె సమీపంలో ఉన్న గండి వీరాంజనేయస్వామి క్షేత్రానికి పలు మార్గాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. కడప నుండి వేంపల్లె మీదుగా గండికి (53కి.మీ) చేరుకోవచ్చు. అలాగే తిరుపతి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా గండి క్షేత్రానికి చేరుకోవచ్చు. మదనపల్లె, పీలేరు ప్రాంత వాసులు రాయచోటి మీదుగా గండికి చేరుకోవచ్చు. అలాగే కదిరి, పులివెందుల, వేంపల్లె మీదుగా గండికి చేరుకొనే మార్గాలు ఉన్నాయి.
– ఈరగాని భిక్షం సాక్షి, సిద్దిపేట

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement