![మా ఆవిడా... గ్యాస్ సిలిండరూ](/styles/webp/s3/article_images/2017/09/19/81505673616_625x300.jpg.webp?itok=sgQJyJeK)
మా ఆవిడా... గ్యాస్ సిలిండరూ
సమ్‌సారం
సంసారంలో సినిమా
అప్పటికీ మా నాన్నతో అంటానే ఉన్నాను... నాన్నా ఆ మనిషి పాత సాక్సులతో పెళ్లిచూపులకు వచ్చాడు పిసినారి అయి ఉంటాడు అని. వింటేనా. నా గొంతు కోశారు...అప్పుడే మా నాన్నతో చెప్పాను.. నాన్నా.. అతడు పెళ్లిచూపులకు వచ్చి కర్చీఫ్ మర్చిపోయాడు ఉత్త మతిమరుపు మనిషిలా ఉన్నాడు చూసుకోండి అని. నా గొంతు కోశారు...మంచం మీద ఉండగానే హడావిడి తెలుస్తూ ఉంది.కుర్చీ బర్రున లాగి అటక మీద ఉన్న మినీ గ్యాస్ స్టవ్‌ను కిందకు దించింది.అందులో గ్యాస్ లేదు.ఫైవ్ జీరో త్రీకి వెళ్లొచ్చింది.‘అబ్బే’ అన్నారు.టూ జీరో టూకు వెళ్లొచ్చింది.‘అయ్యో... నిన్ననే మా మరదలు అడిగితే ఇచ్చామే’ అని సానుభూతి చూపించారు.ఇంకా ఇంట్లో టీ కూడా పెట్టలేదు. పిల్లలకు ఇడ్లీ పెట్టాల్సి ఉంది. ఆ తర్వాత వొండి బాక్సులు కట్టాల్సి ఉంది.
ఇప్పుడు గ్యాస్ అయిపోయిందంటే దానికి వెంటనే ప్రత్యామ్నాయందొరకలేదంటే దుప్పటి కప్పుకున్నా గడగడమని వణుకు వస్తోంది.‘గ్యాస్ బుక్ చేయమన్నాను కదా’ అని ఇప్పుడొచ్చి అడుగుతుంది.మర్చిపోయాడు.ఆ గ్యాస్ వాళ్ల దగ్గర ఫోన్ నంబరేదో ఆవిడది రిజిస్టర్ అయినా పోయుండేది. ఆవిడే బుక్ చేసుకుంటూ ఉండేది. ఖర్మగాలి తన నంబరు నుంచే బుక్ చేయాలి. ప్రతిసారీ మర్చిపోతున్నాడు.వచ్చింది. కప్పుకున్న దుప్పటి మీద నుంచే టపాటపా చరిచి ‘గ్యాస్ అయిపోయింది’ అంది.అప్పుడామె ముఖం ఎలా ఉందంటే కిమ్‌గాడు ట్రంప్‌గాడు నువ్వెంత అంటే యూ హౌమచ్ అనుకొని చెరో రెండు హైడ్రోజన్ బాంబులు ప్రపంచం మీద విసిరి లోకమంతా నాశనమై పోయి ఇక బతకడానికి ఏ ఆశా లేనట్టుగా ఉంది.‘నేను వెళ్లి ఏజెన్సీ వాణ్ణి బామాలి తెచ్చి పెడతానులే పదకొండు లోపు’‘అప్పటి వరకూ?’ పెదాలు బిగించి తీక్షణంగా చూస్తూ అడిగింది.‘అప్పటి వరకూ అంటే తత్త..మమ్మా’..‘తత్తా.. మమ్మా అంటే అయిపోతుందా? నీళ్లు నమిలి నీళ్లు తాగితే సరిపోతుందా? జవాబు చెప్పి తప్పించుకోవడం కాదు... పని టయానికి చేసి ఇంటికి చక్కదిద్దాలి. అదీ ఒక మగవాడి బాధ్యత. ఒక భర్తగా మీరు ఇంటిని ఏనాడు పట్టించుకున్నారు కనుక.
అరె గ్యాస్ బుక్ చేసి నెల అయిపోయిందే బుక్ చేయకపోతే ఇబ్బంది పడతామే అనే ఇంగితం ఉందా. జ్ఞానం ఉందా. ఒంట్లో భయం ఉందా. ఆ.. ఏముందిలే... ఇంట్లో ఉందిగా ఒకత్తి. అదే ఏదో తిప్పలు పడుతుంది అనేగా మీ ధైర్యం. అసలు మిమ్మల్ని కాదు. మీ అమ్మననాలి’‘మా అమ్మని ఏమీ అనొద్దు’ ‘ఎందుకు అనను. లక్ష అంటాను. కోటి అంటాను. కావాలంటే బిగ్‌బాస్ హౌస్‌కు గెస్ట్‌గా వెళ్లి అల్లా నవదీప్‌కూ దీక్షకూ శివబాలాజీకి కూడా చెప్తాను. కనగానే సరిపోదు. సరిగ్గా పెంచాలి. పెంచిన మనిషిని మనిషో కాదు చెక్ చేసి పెళ్లి చేయాలి. అరె... పుచ్చొంకాయకీ మంచొంకాయకీ తేడా తెలియని మనిషి పెళ్లెందుకు చేసుకోవాలీ అంటా’‘మొన్న అన్నీ మంచి వంకాయలే తెచ్చాను’తెచ్చారు. హూ... కాలీఫ్లవర్ తెమ్మంటే క్యాబేజీని తేలేదు మీరూ. పిల్లలు క్యాబేజీ తినరని మీకు తెలియదూ. ఎలా తెలుస్తుంది. పిల్లల సంగతి మీకు పడితే కదా.
అసలు పెద్దాడు ఏం చదువుతున్నాడో చెప్పండి?’ ‘వాడి హోమ్‌వర్క్ నువ్వు చేయించి చదివిస్తున్నందుకు మొన్నోసారి వెంకటగిరి చీర కొనిచ్చాను మర్చిపోయావా?’కొనిచ్చారులేండి పెద్ద నిజామ్ నవాబు తన పట్టమహిషికి కొనిచ్చానన్నంత సంబరంతో. ఎంత అది? ఎంత? పన్నెండొందల ముప్పై రూపాయలు. అదా నా విలువ. ఏం... ఏడు వేలో ఎనిమిది వేలో పెట్టి ముత్తయిదు పట్టుతో నేసిన నిమ్మకాయరంగు చీరను చెన్నై సిల్క్స్‌లో కొనివ్వడానికి మీకు చేతులు రావేం? అప్పటికీ మా నాన్నతో అంటానే ఉన్నాను... నాన్నా ఆ మనిషి పాత సాక్సులతో పెళ్లిచూపులకు వచ్చాడు పిసినారి అయి ఉంటాడు అని. వింటేనా. నా గొంతు కోశారు.’
‘ఫోరెన్సిక్ వాళ్లని పిలుస్తానులే. హంతకులెవరో తెలుస్తుంది’ పంచ్‌లొకటి మళ్లీ. అసలు గ్యాసు, మంచినీళ్లు, టీ డబ్బాలో టీ పౌడరూ లేకపోతే వెర్రెక్కిపోతుంది నాకు. అన్నం లేకుండా అయినా ఉంటానుగాని ఇంట్లో గ్యాస్ లేకుండా ఉండను. ఓలా బుక్ చేయండి. మా అమ్మా వాళ్లింటికి వెళ్లిపోతాను’‘పిల్లల స్కూలు’‘స్కూలు. మీ కడుపున పుట్టాక వాళ్లకు స్కూలు కూడానా. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లల్ని కనిచ్చాను. అరె... ఆవగింజంత కృతజ్ఞత కూడా లేదే. ఇదిగో ఇంటిఇల్లాలికి అప్పుడప్పుడైనా మల్లెపూలు తెద్దాం. మిఠాయి డబ్బా తెద్దాం. మంచి మాట పక్కన కూర్చుని మాట్లాడదాం. ఆహా. అది లేదు. ఎంత సేపు ఆఫీసుఫోన్లు.. ఆ టక్కులాడితో కబుర్లు ఈ తిప్పులాడితో జోకులు’ ‘అదొకటుందా నా ప్రాణానికి’‘ఏం.. అంతమాత్రం తెగింపు కూడా లేకపోతే ఇక ఏమిటుంటుంది జీవితంలో సరదా. అయినా నా ముఖమే సరిగ్గా చూడని మీరు ఎవరి ముఖమో ఏం చూస్తారులేండి.
అలా ఇంకెవరినైనా చూస్తే సాధిద్దామనుకుంటే ఆ ముచ్చట తీరే భాగ్యం కూడానా’...మానవత్వానికి ఇవి రోజులు కావు’‘మానవత్వం. మా మేనల్లుడి బారసాలకి పది గ్రాముల గొలుసు వేద్దామని నేనంటే తొమ్మిది పాయింట్ అయిదు గ్రాముల గొలుసు వేసినప్పుడే తెలిసింది మీ మానవత్వం. అదే మీ మేనకోడలి బారసాలకు మీరు బెల్లంకొట్టిన రాయిలా ఉంటే అదేమిటండీ... ఏ నూరో రెండునూర్లో పెట్టి వెండి పట్టీలు వేద్దాం అన్నానే... అదండీ మానవత్వం అంటే. నా మానవత్వం ముందు మీ మానవత్వం ఎంత?’దిగ్గున లేచాడు.కిచెన్‌లోకి వెళ్లాడు. స్టవ్ కిందున్న కప్‌బోర్డులో సిలిండర్‌ని కదిల్చాడు. ఖాళీగా ఉంది. పక్కన ఉన్న సిలిండర్‌ని కదిల్చాడు. బరువుగా ఉంది. మారు మాట్లాడకుండా దానిని తీసి స్టవ్‌కు అమర్చి స్టవ్ వెలిగించి మౌనంగా వచ్చి కూర్చున్నాడు. గ్యాస్ భయంతో పోయిన నెలలోనే రెండో సిలిండర్ తెచ్చి పెట్టాడు. ఇద్దరూ మర్చిపోయారు.క్షణాల్లో వచ్చిన సిలిండర్‌ను చూసి ఆ.. అంటూ ఆశ్చర్యపోయింది.
నాలుక కరుచుకుంది. సర్దుకుంది. హు.. ఇది ఈ మనిషి ఘనకార్యం. ఎలా చేసేదమ్మా ఈ మనిషితో కాపురం. అరె ఇంట్లో అన్నీ పెట్టుకుని ఊరంతా వెతుకుతాడే ఈ మనిషి రేపు నన్ను, నా పిల్లలను ఏ ఇనార్బిట్ మాల్‌కో తీసుకెళ్లి మర్చిపోయి రాడని ఏమిటి గ్యారంటీ. అప్పుడే మా నాన్నతో చెప్పాను.. నాన్నా.. అతడు పెళ్లిచూపులకు వచ్చి కర్చీఫ్ మర్చిపోయాడు ఉత్త మతిమరుపు మనిషిలా ఉన్నాడు చూసుకోండి అని. నా గొంతు కోశారు’... ఆ పాశ్చాత్య సంగీతపు పెనుతుఫాను అలా కొనసాగుతూనే ఉంది.
మీరేం చేస్తున్నారు? సినిమాలో సంసారం
బాలాజీ (రాజేంద్రప్రసాద్)– ఝాన్సీ (ఆమని) లది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు పిల్లలు. బాలాజీ బ్యాంకు ఉద్యోగి. తోటి ఉద్యోగులు అవినీతి నేరం మోపి ఉద్యోగం పోయేలా చేస్తారు. దాంతో తప్పనిసరై ఝాన్సీ ఉద్యోగంలో చేరుతుంది. అప్పుడు ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం బాలాజీపై పడుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇంటి దగ్గర ఉన్న భర్తకు చెబుతుంది ఝాన్సీ. పిల్లలు తండ్రి మాట వినకుండా అల్లరి చేస్తుంటారు. రోజూ ఉదయం పాపని స్కూల్‌కి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొస్తుంటుంది ఝాన్సీ. భార్య ఆఫీసుకు వెళుతుండటంతో ఆ బాధ్యత బాలాజీపై పడుతుంది. ఝాన్సీ ఆఫీసు తరఫున ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ బిగిస్తారు. దీంతో ఇరుగు పొరుగు బాలాజీ దగ్గరకొచ్చి కబుర్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఆ హడావిడిలో పాప సంగతి మర్చిపోతాడు బాలాజీ. తాను వచ్చేటప్పుడు పాపను తీసుకొచ్చిన ఝాన్సీ కోపంగా ‘‘మీరేం చేస్తున్నారు. పిల్లకోసం స్కూల్‌కి వెళ్లలేదు. అది దిక్కులేక ఏడుస్తూ రోడ్డుకు అడ్డం పడిపోతోంది. ఇంటికొస్తుంటే నా కారు కిందే పడి.. అంటూ ఎందుకెళ్లలేదు?’’అని నిలదీస్తుంది. ‘నేను మొగుణ్ణి, మొగాణ్ణి. సంజాయిషీ చెప్పను’ అని బదులిస్తాడు బాలాజీ. ‘ఛీ ఛీ.. మిమ్మల్ని నమ్ముకుని పిల్లల్ని వదిలి వెళ్లడం నాదీ బుద్ధి తక్కువ’ అంటుంది. నేనే ఎలాగోలా సంపాదిస్తా నువ్వు ఉద్యోగం మానేయ్ అంటాడు బాలాజీ.
నా పిల్లల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదండీ. మానేస్తాను అంటుంది ఝాన్సీ. ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలోని ఇటువంటి సన్నివేశాలు మన నిజ జీవితంలో, ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవే. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్: samsaaram2017@gmail.com
– నిష్ఠల