స్త్రివర్ణ పతాకం | special story to Republic Day | Sakshi
Sakshi News home page

స్త్రివర్ణ పతాకం

Published Fri, Jan 26 2018 12:33 AM | Last Updated on Fri, Jan 26 2018 12:34 AM

special  story to  Republic Day - Sakshi

జననీ జన్మభూమి అంటారు.
మరి ఆ జన్మభూమిలో ఉన్న మహిళల్ని 
ఇవాళైనా స్మరించుకోవద్దా?
స్వాతంత్య్రం.. రాజ్యాంగం...
ఈ రెండడుగుల్లో అడుగడుగునా 
మహిళ భాగస్వామ్యం ఉంది. 
కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయి. 
ఎప్పుడూ ‘కంకణం కట్టుకున్న’ శబ్దమేనా?
ఈసారి.. దేశ మహోన్నత ఉద్యమంలో
గాజుల సవ్వడికి సలాం చేద్దాం రండి.

మన దేశ స్వతంత్ర పోరాటంలో, భారత రాజ్యాంగ రూపకల్పనలో అవిశ్రాంతంగా కృషిచేసిన స్త్రీలెందరో చరిత్ర మరుగున పడిపోయారు. నేడు మనం 69వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగానైనా మన దేశ నిర్మాణంలో, రాజ్యాంగావిష్కరణలో ఎన్నో కీలక చర్చలు చేసి, దేశ భవిష్యత్తుకి పునాదులు వేసిన స్త్రీలను అందరూ కాకపోయినా, కొందరినైనా స్మరించుకోవడం మన ధర్మం.

రాజ్‌కుమారి అమృత్‌ కౌర్‌ (1889–1964)
రాజ్‌కుమారి అమృత్‌ కౌర్‌ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జన్మించారు. భారత దేశ తొలి ఆరోగ్యమంత్రి. స్వాతం త్య్రోద్యమంలో కదంతొక్కిన మహిళ. సామాజిక కార్యకర్త. బాల్యవివాహాలపైనా, స్త్రీల పరదా వ్యవస్థపైనా తిరుగుబాటు బావుటాని ఎగురవేసారు. దండి  సత్యాగ్రహంలో, క్విట్‌ ఇండియా ఉద్యమంలోపాల్గొన్న రాజ్‌కుమారి కొంత కాలం కారాగారవాసం గడిపారు. 1927లో ఆల్‌ ఇండియా వుమన్స్‌ కాన్ఫరెన్స్‌ సహవ్యవస్థాపకురాలిగా ఉన్నారు.  భారత రాజ్యాంగ సభ సభ్యురా లిగా ఎంతో కృషి చేసారు.

అమ్ముకుట్టి స్వామినాథన్‌ (1894–1978)
కేరళలోని పాల్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన అమ్ము స్వామినాథన్‌ భారత స్వాతంత్య్రోద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన వనిత. పెద్దగా చదువుకోలేదు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన అమ్ముకుట్టి కుటుంబాన్ని ఆమెతల్లి అనేక కష్టాలకోర్చి పెంచి పెద్దచేసారు. 13 ఏళ్ళకే డాక్టర్‌ సుబ్బరామ స్వామినాథన్‌కిచ్చి అమ్ముకి పెళ్ళి చేసారు. అంచెలంచెలుగా సామాజిక కార్యకర్తగా, రాజకీయ ఉద్యమ కారిణిగా ఎదిగి రాజ్యాంగ సభ సభ్యులిరాలిగా ఎంపికయ్యారు. 

హన్స జివరాజ్‌ మెహత  (1897–1995)
 హన్స జివరాజ్‌ మెహతాది గుజరాత్‌. గొప్ప సంస్కరణ వాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. స్వాతంత్య్రోద్యమ కారిణి. పిల్లల సాహిత్యంపై ఎనలేని కృషి చేసారు. ఎన్నో ఆంగ్ల కథల ను గుజరాతీలోనికి అనువదించారు. యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. భారత దేశంపై ఎగురవేసిన తొలి త్రివర్ణ పతాకాన్ని, ఆగస్టు 15, 1947 భారత స్వాతంత్య్ర తొలి ఘడియల్లో దేశ మహిళల పక్షాన తొలి ప్రధాని కి బహూకరించారు.

దాక్షాయిని వేలాయుధన్‌ (1912–1978)
1946లో రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక తొలి దళిత మహిళ. ఈమె కేరళకి చెందినవారు. పులయ కులానికి అనే దళిత సామాజికవర్గానికి చెందిన దాక్షాయిని ఆమె కమ్యూనిటీలో జాకెట్‌ ధరించిన తొలి మహిళ. (ఆరోజుల్లో దళిత మహిళలకు పై వస్త్రాలు ధరించే హక్కు లేదు) కేరళలో కులోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిన శ్రీనారాయణ గురు, అయ్యంకాళి ఉద్యమ ప్రభావం దాక్షాయినినిపై ఉంది. అస్పృశ్యతపైనా, దళితుల విద్యాలయాల ప్రవేశం కోసం ఆమె ఉద్యమించారు. కేరళ రాష్ట్రంలోనే తొలి డిగ్రీ సాధించిన దళిత మహిళ. రాజ్యాంగ సభలో దళితుల విద్యపై ఆమె ప్రసంగాలు ఒక సంచలనం. 

బేగం ఐజాజ్‌ రసూల్‌ (1908–2001)
 రాజ్యాంగ సభలో ఉన్న ఏకైక ముస్లిం సభ్యురాలు.  ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో ప్రాంతం. 1937 నుంచి 1940 వరకు కౌన్సిల్‌ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 1950–52 వరకు కౌన్సిల్‌ లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. భారత దేశంలో ఈ పదవిని అలంకరించిన తొలి మహిళ, ప్రపంచంలోనే ఈ స్థాయికి ఎదిగిన తొలి ముస్లిం మహిళ. ఆమె ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ జమీందారీ వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టారు.
  
దుర్గాబాయి దేశ్‌ముఖ్‌  (1909–1981)
మన తెలుగు బిడ్డ. కాకినాడలో పుట్టారు. స్త్రీ విద్యకోసం తన జీవితమంతా అవిశ్రాంతంగా కృషి చేసారు. భారత స్వతంత్రోద్యమంలో చురుకుగా పనిచేయడమే కాకుండా దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. మహిళల అభ్యున్నతికి విద్యే ఆయుధం అని ఆమె విశ్వసించారు. అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్లుని అందరూ వ్యతిరేకిస్తే దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసి, హిందూ కోడ్‌ బిల్లు ప్రాధాన్యతను చాటిచెప్పారు.

కమల చౌదరి (1908)
ఈమె రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో ఒకరు. ఈమె భారతదేశంలోని షార్ట్‌స్టోరీ రైటర్‌. హిందీ లో కథలు రాసేవారు. మూడవ లోక్‌సభలో హాపూర్‌ నుంచి పార్లమెంటు సభ్యురా లుగా పనిచేశారు. 

లీలా రాయ్‌ (1900–1970)
లీలా రాయ్‌ది బెంగాల్‌లోని సిల్‌హెట్‌. ఇప్పుడది బాంగ్లాదేశ్‌లో ఉంది. స్వాతంత్య్ర సమర యోధురాలు. సామాజిక కార్యకర్త. భారత దేశంలో స్త్రీ విద్యకోసం పోరాడారు. లీలా రాయ్‌ ఫెమినిస్ట్‌. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కి సన్నిహితురాలు. భారత దేశ విభజనను వ్యతిరేకిస్తూ లీలా రాయ్‌ తన పదవికి రాజీనామా చేసారు. 

మాలతీ చౌదరి (1904–1998)
మహాత్మాగాంధీ ‘తూఫాన్‌’గా పిలిచే మాలతీదేవి స్వాతంత్య్రసమరయోధురాలు. రాజ్యాంగ సభ సభ్యురాలు. సమాజంలో అణచివేతకు గురౌతోన్న షెడ్యూల్డ్‌ క్యాస్ట్, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం మాలతీ చౌదరి చేసిన కృషి మరువలేనిది.

పూర్ణిమా బెనర్జీ (1911–1951)
పూర్ణిమా బెనర్జీ బ్రిటిష్‌ వారి పెత్తనాన్ని పరాయి పాలననూ ధిక్కరించిన మహిళ. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన వారు. సరోజినీ నాయుడు, సుచేతా కృపలానీ, విజయలక్ష్మి పండిట్‌లతో కలిసి పూర్ణిమా బెనర్జీ స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. ఆమె జైలులోనే జైలులోనే బిఎ డిగ్రీ పూర్తి చేశారు. ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 

రేణుకా రాయ్‌ (1904–1997)
రేణుకా రాయ్‌ గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చారు. బ్రిటిష్‌ విద్యావిధానాన్ని బహిష్కరిం చాలన్న పిలుపునందుకొని కాలేజీ చదువుని వదిలివచ్చి ఉద్యమంలో చేరారు. ఆల్‌ ఇండియా వుమన్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. మహిళè ల హక్కులకోసం, తల్లిదండ్రుల ఆస్తిలో వాటాకోసం,  స్త్రీల ఆస్తి హక్కుకోసం ఉద్యమించారు. రాజ్యాంగ సభకి ఎంపికవక ముందు సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి మహిళా ప్రతినిధిగా ఉన్నారు. భారత ప్రభుత్వం 1988లో రేణుకా రాయ్‌కి  పద్మభూషణ్‌ అవార్డునిచ్చి సత్కరించింది. 

సరోజినీ నాయుడు (1879–1949)
నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా. భారత స్వతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో నిలిచిన ధీర వనిత. భారత దేశాన్ని అస్పృశ్యతా సంకెళ్ళనుంచి విముక్తి చేయాలని కంకణం కట్టుకొన్న సమానత్వ కాంక్షాపరురాలు. అస్పృశ్యతా నిర్మూలనకోసం ఉద్దేశించిన ఆర్టికల్‌ 17పై జరిగిన చర్చలో పాల్గొని దానిపై విస్త్రుతంగా చర్చించారు. వీరి స్వస్థలం బెంగాల్‌. హైదరాబాద్‌లోనే ఆమె జన్మించారు. జాతీయోద్యమంలో చేరి, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎదిగి, ఉత్తరప్రదేశ్‌ (యునైటెడ్‌ ప్రావిన్సెస్‌) గవర్నర్‌గా ఎంపికయ్యారు. మహాత్మాగాంధీ బుల్‌బుల్‌గా పిలుచుకునే సరోజినీ నాయుడు స్వగృహం హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో భాగంగా ఉన్న గోల్డెన్‌ త్రెష్‌హోల్డ్‌.   

సుచేతా కృపలానీ  (1908–1974)
 భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌ మహిళా విభాగం వ్యవస్థాపకురాలు.  రాజ్యాంగం డ్రాఫ్ట్‌ సబ్‌కమిటీలో భాగస్వామిగా ఉన్నారు.

విజయలక్ష్మీ పండిట్‌   (1900– 1990)
 భారత దేశ తొట్ట తొలి కేంద్ర మంత్రి. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీకి తొలి ఆసియా అధ్యక్షురాలు. క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ, ఇతర స్వంతంత్య్ర సంగ్రామంలోనూ అనేక పర్యాయాలు జైలుకెళ్ళారు. భారత దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలన్న బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కి రాజీనామా చేసారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ సోదరి.
– అత్తలూరి అరుణ, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement