అచ్చం నాన్నలా! | special story to crime parenting | Sakshi
Sakshi News home page

అచ్చం నాన్నలా!

Published Mon, Sep 4 2017 11:57 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

అచ్చం నాన్నలా!

అచ్చం నాన్నలా!

క్రైమ్‌ పేరెంటింగ్‌

నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం.
చాలా ప్రేమ కూడా.
అందుకే తరచు అమ్మను విసుక్కుంటూ ఉంటాడు.
‘అమ్మ.. మన సొంతం కదా’ అన్నట్లు..
అమ్మను ఎంతమాటైనా అంటుంటాడు!
అంటే దీనర్థం ఏమిటి?
అమ్మని నాన్న గౌరవించకపోయినా చెల్లుతుందనా?!
నాన్న అలా అనుకుంటే..
ఇంట్లో పిల్లలూ అలాగే అనుకునే ప్రమాదం ఉంది.
ప్రేమ ఉంటే గౌరవం ఉండాలి. గౌరవం లేకుంటే..
పిల్లలు ఇంట చెడి, రచ్చా చెడుతారు!
యథా నాన్న... తథా తనయులు అన్నట్లు..
తయారౌతారు!


ఒసేవ్‌.. చెక్‌బుక్‌ కనపడట్లేదు.. ఎక్కడ పెట్టి చచ్చావే’’ బెడ్‌రూమ్‌లోంచి కోపం,  విసుగు, అసహనం కలగలసిన భర్తగారి కేక. వంటింట్లో ఉన్న భార్య చేతిలోపని వదిలేసి కంగారుగా బెడ్‌రూమ్‌లోకి పరిగెత్తింది. నా వస్తువులు ఏవీ ముట్టుకోవద్దని చెప్పానా? అన్నీ ఎందుకు సర్దుతావ్‌? ఏమీ తెలీనప్పుడు తెలీనట్టే ఉండాలి’’ అన్నాడు.. వచ్చీరాగానే వార్డ్‌రోబ్‌లోని ఫస్ట్‌ షెల్ఫ్‌లో బట్టల మడతలున్న పేపర్‌ కింద వెదుకుతున్న భార్యను చూస్తూ చిరాగ్గా! నువ్వో పెద్ద మొద్దువి. ఏవి ఎంత ఇంపార్టెంటో తెలియదు. అర్థం చేసుకునే తెలివీ లేదు.. ఎందుకు అన్నిట్లో దూరతావ్‌.. ’’ అంటూ ఇంకా తిడుతూనే ఉన్నాడు భర్త. చెక్‌ బుక్‌ తీసి చేతిలో పెట్టింది భార్య.ఎక్కడ దొరికింది? ఇందాక అక్కడే కదా వెదికాను? నేను పెట్టిన వస్తువులు పెట్టిన చోటే ఉంచు. కలియబెట్టకు అన్నీ’’ తిట్టాడు తనకు దొరకలేదన్న కసితో. ‘‘మీరు పెట్టినచోటే ఉందండీ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పరాభవం తట్టుకోవడం ఆ మొగుడివల్ల కాలేదు.  టిఫిన్‌ దగ్గర తీశాడు.

గుర్తుపెట్టుకోండి..
ఇదేంటి ఉప్మానా? లై యా? (పోస్టర్లు అతికించే మైదాపిండి)’’ నోట్లోది ఊస్తూ.. ప్లేట్‌ను తోస్తూ.. అన్నాడు భర్త.ఆయన స్వర తీవ్రతకు.. చేష్టకు బిక్కచచ్చిపోయింది భార్య. ‘‘ఉప్మా ఇలా ఉంటేనే మీకిష్టం కదాని ఎప్పుడూ చేసినట్టే మెత్తగా చేశాను’’ భయపడుతూ జవాబిచ్చింది ఆమె. ‘ఏడిచావ్‌! ఏమీ చేతకాదు. నీకసలు తిండి దండగ’ అంటూ లేచాడు చేయి కడుక్కోవడానికి.పెళ్లయిన పద్దెమినిదేళ్ల నుంచి ఈ మాట వినీవినీ వేసారిపోయి ఉందేమో ఆ ఇల్లాలు.. ‘‘నాకేం ఊరికినే కూర్చోబెట్టి తిండి పెట్టట్లేదు మీరు. ఇంటెడు చాకిరీ చేస్తున్నా.. మీకు, మీ పిల్లలకు. గుర్తుపెట్టుకోండి’’ అంది కాస్త కటువుగానే వాళ్లాయన ఉప్మాప్లేట్‌ను టేబుల్‌ మీద నుంచి తీస్తూ!నాకే ఎదురు చెప్తావా? ఏ పెళ్లాం చేయంది నువ్వు చేస్తున్నావా?’’ అంటూ ఆమె చెంప చెళ్లుమనిపించాడు. తమ గదిలో కాలేజ్‌కి రెడీ అవుతున్న అమ్మాయి, అబ్బాయి మొహమొహాలు చూసుకొని ‘‘మమ్మీ ఎప్పుడూ ఇంతే. డాడీకి అనవసరంగా కోపం తెప్పిస్తుంద’’ న్నట్టుగా తలలాడించారిద్దరూ.  నేనూ ఇంట్లో టిఫిన్‌ తినను. కాలేజ్‌ క్యాంటీన్‌ జిందాబాద్‌’’ అన్నాడు అబ్బాయి. ‘‘నేను కూడా’’ అంది అమ్మాయి. భర్త వెళ్లిపోయాడు. అవమానంతోనే వంటింట్లోకి వెళ్లి పిల్లలకు లంచ్‌ సర్దసాగింది.

టూ మచ్‌
మమ్మీ.. నాకు వంద, చెల్లికి వంద ఇవ్వూ’’ అంటూ హాల్లోకొచ్చి కేకేశాడు కుమారుడు. ‘‘డబ్బులా.. ఎందుకూ?’’ అంటూ బాక్స్‌లు తీసుకొని వచ్చింది తల్లి.ఆ ఉప్మా మేమూ తినలేం.. క్యాంటీన్‌లో తింటాం’’ అంటూ కుడి చేయిచాచి వేళ్లను తనవైపు కదిలించసాగాడు ‘ఇవ్వు’ అన్నట్టుగా. మీరూ అలాగే అంటారేంట్రా.. ఎప్పుడూ చేసినట్టే..’’ అని ఆమె సమాధానం చెప్పేలోపే.. ‘‘నీ సోది వినే ఓపికలేదుగానీ ముందు డబ్బులివ్‌ మమ్మీ’’ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా ఏమాత్రం మర్యాద లేకుండా. కొడుకు ప్రవర్తనకు కోపం ముంచుకొచ్చింది అయినా తమాయించుకుంది. ‘‘నా దగ్గరెక్కడుంటాయ్‌.. మీ డాడీని అడగాల్సింది’’ అంది టిఫిన్‌ బాక్స్‌లు అందిస్తూ.మమ్మీ దిస్‌ ఈజ్‌ టూ మచ్‌.. ఈ లంచ్‌ మాత్రం ఎందుకూ? అక్కర్లేదు’’ అన్నాడు కొడుకు బాక్స్‌ను తిరస్కరిస్తూ. నీకూ అక్కర్లేదా?’’ అదే కోపంతో కూతురుని అడిగింది ఆమె.‘‘ప్చ్‌..’’ అంది తల అడ్డంగా ఊపుతూ. చివుక్కుమంది తల్లి మనసు. లోపలికి వెళ్లి వెదికి వెదికి నూటయాభై రూపాయలు తెచ్చిచ్చింది.  చేతిలోంచి విసురుగా లాక్కుంటూ వెళ్లిపోయాడు కొడుకు. వెనకాలే కూతురు. కనీసం బై కూడా చెప్పకుండా.

పనిమనిషిలా...
నీరసంగా సోఫాలో కూలబడింది ఆ తల్లి. పెళ్లయినప్పటి నుంచీ భర్త పద్ధతి అంతే. కాని పిల్లల తీరే ఆమెకు బాధ కలిగిస్తోంది. ‘ఈ మధ్యయితే మరీ మితిమీరుతున్నారు. తనంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతోంది. వాళ్ల మంచి కోసం ఏది చెప్పినా.. చెప్పాలనుకున్నా హీనంగా తీసిపడేస్తున్నారు. వాళ్ల విషయంలో ఏం మాట్లాడబోయినా ‘‘బాగా తెలుసని చెప్పొచ్చావా? వాళ్లు నా పిల్లలు. నేను చెప్పినట్టు వింటారు’’ అని పిల్లల ముందే ఆయన చులకన చేయడం, వాళ్లముందే చేయిచేసుకోవడంతో ఈ ఇంట్లో తన స్థానమేంటో వాళ్లకు అర్థమైపోయింది. కొడుకైతే అచ్చంగా నాన్నకు నకలుగా తయారయ్యాడు. పనిమనిషిలా చూస్తున్నాడు’అని అనుకునేసరికి దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకు. ‘కట్టుకున్నవాడికెలాగూ గౌరవం లేదు. కనీసం కన్నపిల్లలైనా విలువిస్తారనుకుంటే తండ్రిని మించిపోయారు. ఛీ.. ఏం బతుకు నాది’ అంటూ ఏడ్చేసింది.

అమ్మాయిని కొట్టాడు
మధ్యాహ్నం మూడు గంటలప్పుడు.. ప్రణీత్‌.. మీ అబ్బాయేనా?’’ అంటూ ఫోన్‌ వచ్చింది శేఖర్‌కి.  అవునండీ.. మీరెవరు?’’ అన్నాడు ఆ తండ్రి.‘‘నేను మీ అబ్బాయి కాలేజ్‌ ఏరియా పోలీస్‌స్టేషన్‌ సీఐని.. మీరు అర్జెంట్‌గా రావాలి’’ అవతలి నుంచి ‘ఎందుకు.. ఏమైంది’ అని అడిగేలోపే ఫోన్‌ కట్‌ చేశారు సీఐ.  ఉన్నపళంగా బయలుదేరాడు కంగారుపడుతూ! శేఖర్‌ వెళ్లేటప్పటికే అతని భార్యా  స్టేషన్‌లో ఉంది. సీఐని విష్‌ చేసి ‘‘ఏమైంది’’ అని అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. వాళ్లకు ఎదురుగా నుదుటికి బ్యాండెయిడ్‌ వేసుకొని కూర్చున్న అమ్మాయిని కళ్లతోనే చూపించింది ఆమె. ఇంకేదో అడిగేలోపే.. ‘‘మీ అబ్బాయి ఆ అమ్మాయిని కొట్టాడు’’ అన్నాడు సీఐ.. శేఖర్‌ సందేహాన్ని తీరుస్తున్నట్టుగా.

తన భార్య పక్కనే ఉన్న కొడుకుని, సీఐని, తమకు ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ అయోమయంగా.. ‘‘అసలు ఏమైంది’’అని అడిగాడు.  కొడుకు ఏదో చెప్పబోతుండగా.. ‘‘నువ్వేం చెప్తావ్‌గానీ ఉండబ్బాయ్‌’’ అని వారించి ‘‘మీ అబ్బాయి ఆడపిల్లల పట్ల చాలా దురుసుగా బిహేవ్‌ చేస్తున్నాడండీ.. చాలా అమర్యాదగా మాట్లాడ్తాడు. ఇదివరకే రెండు, మూడుసార్లు మాకే కాదు, ప్రిన్సిపల్‌ వరకూ కంప్లయింట్స్‌ వెళ్లాయ్‌ మీ అబ్బాయి మీద.  ఏదో పిల్లలు.. కలిసి చదువుకుంటున్నప్పుడు అలాంటివి ఉంటాయ్‌.. ఫ్రెండ్లీగా తీసుకోవాలి’ అని అమ్మాయిలకు సర్దిచెప్పాం. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండమని మీ అబ్బాయికీ వార్నింగ్‌ ఇచ్చాం. అయినా మార్పులేదు. ఈ రోజు ఏకంగా చెయ్యే చేసుకున్నాడు’’ అని చెప్పింది ఆ అమ్మాయితోపాటు వచ్చిన లెక్చరర్‌.

‘‘సర్‌.. ప్రణీత్‌ మా పట్ల కూడా చాలా మిస్‌బిహేవ్‌ చేశాడు ఎన్నోసార్లు. నోటికొచ్చినట్టు మాట్లాడ్తాడు. మేం తిరిగి ఏదైనా అంటే.. బూతులు తిడతాడు’’ అని చెప్పింది ప్రణీత్‌ క్లాస్‌మేట్‌ ఇంకో అమ్మాయి. ‘‘ఈ రోజు కూడా అంతే.. చిన్న విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి నాతో ఆర్గ్యూ చేసి.. ఓడిపోతున్నాడనే అక్కసుతో నన్ను తోశాడు సర్‌. బెంచీ ఎడ్జ్‌ మీద పడ్డాను. ఐబ్రో మీది చర్మం చిట్లి రక్తం వచ్చింది’’ జరిగింది వివరించింది ఆ అమ్మాయి. ‘‘ఏరా.. అంత మొనగాడివా నువ్వు?’’ అన్నాడు సీఐ.. ప్రణీత్‌ను ఉద్దేశించి.

భార్యకు గౌరవం ఇవ్వండి...
సర్‌.. అమ్మాయిలకు పంతమేంటి సర్‌? నేనేదో సబ్జెక్ట్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తుంటే ‘తప్పు తప్పు’ అని నాకే వంక పెట్టారు. నేను చెప్పినదాన్నే తప్పు పట్టారు. మా ఇంట్లో మా చెల్లి అలా మాట్లాడినా కొడతాను. చివరకు మా అమ్మ ఎదురు చెప్పినా నాకు కోపం సర్‌. ఆడపిల్లలకు మగవాళ్లతో పోటీ ఏంటి? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి గాని’’ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అన్నాడు ప్రణీత్‌.

తండ్రితో సహా అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు వాడి మాటలకు. ప్రణీత్‌ మైండ్‌ సెట్‌ అర్థమైన సీఐ.. కేస్‌ పెట్టకుండా అమ్మాయికి, లెక్చరర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రణీత్‌ మాటలతో వాడి కుటుంబ నేపథ్యాన్ని గ్రహించగలిగింది లెక్చరర్‌. లాస్ట్‌వార్నింగ్‌ ఇస్తూ  వాడిని వదిలేస్తున్నట్టు చెప్పింది. ఆ పిల్లలను తీసుకొని వెళ్లబోతూ ‘‘ఇంట్లో మీ భార్యకు గౌరవం ఇవ్వడం నేర్చుకొండి. ఆడపిల్లలతో ఎలా మెలగాలో తెలుసుకుంటాడు మీ అబ్బాయి’’ అని సీరియస్‌గా సలహా ఇచ్చి బయటకు నడిచింది లెక్చరర్‌. ప్రణీత్‌ వాళ్లమ్మ భర్త వంక చూసింది. తలదించుకున్నాడతను. ప్రణీత్‌కు కౌన్సెలింగ్‌ స్టార్ట్‌ చేశాడు సీఐ. ఆ మాటలు ప్రణీత్‌ తండ్రి చెవినా పడుతున్నాయ్‌.

నువ్వు గౌరవం ఇస్తేనే నీకు గౌరవం
సాధారణంగా మన కుటుంబాల్లో భర్తకు భార్య టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌. కుటుంబ సభ్యుల అందరిముందే ఆమెను విమర్శించడం, తిట్టడం వంటివి చేస్తుంటాడు. ఇది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అందుకే ముందు కుటుంబంలో అందరూ సమానం అనే భావన పిల్లల్లో కలిగించాలి. ఇంట్లో తల్లి, అక్క, చెల్లికి గౌరవం ఇస్తేనే బయట నువ్వు గౌరవం పొందుతావనే విషయాన్ని మగపిల్లలకు బోధించాలి. కుటుంబంలో ప్రేమానురాగాలు, గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాతావరణం ఉండాలి.
– డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, ల్యూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌
- శరాది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement