2024లో ఆటో విడిభాగాల జోరు | Auto components industry to grow 10-15 percent in FY24 | Sakshi
Sakshi News home page

2024లో ఆటో విడిభాగాల జోరు

Published Tue, Mar 14 2023 4:06 AM | Last Updated on Tue, Mar 14 2023 4:06 AM

Auto components industry to grow 10-15 percent in FY24 - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజాగా అంచనాలు వెలువడ్డాయి. ఇందుకు దేశ, విదేశీ మార్కెట్ల నుంచి ఊపందుకోనున్న డిమాండు దోహదపడనున్నట్లు ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ అసోసియేషన్‌(ఏసీఎంఏ) పేర్కొంది. యూఎస్, యూరప్‌ తదితర ప్రధాన మార్కెట్లలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలున్నప్పటికీ దేశీ ఆటో విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 23 శాతం ఎగసింది. 56.5 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ బాటలో మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 15 శాతం పుంజుకోగలదని ఏసీఎంఏ అంచనా వేసింది.  

ఐసీఈ ఎఫెక్ట్‌
ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్స్‌(ఐసీఈ) తయారీలో వినియోగించే ఆటో విడిభాగాల కోసం ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. యూఎస్, యూరప్‌ తదితర పశ్చిమ దేశాల మార్కెట్లు ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లుతుండటం ప్రభావం చూపుతోంది. దీంతో దేశీ విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనుంది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(2022 మార్చి– డిసెంబర్‌) ఎగుమతులు, దిగుమతులు బ్యాలన్స్‌డ్‌గా 15.1 బిలియన్‌ డాలర్ల చొప్పున నమోదైనట్లు పారిశ్రామిక సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఏసీఎంఏ డైరెక్టర్‌ విన్నీ మెహతా వెల్లడించారు. పశ్చిమ దేశాలలో ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీ ఆటో విడిభాగాల ఎగుమతులు అంచనాలకు అనుగుణంగా పుంజుకోనున్నట్లు అంచనా వేశారు. ఎగుమతుల్లో ఎలాంటి మందగమన పరిస్థితులనూ గమనించలేదని తెలియజేశారు. దేశీ ఆటో మార్కెట్‌ అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా దిగుమతుల్లో సైతం వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు.  

వృద్ధి కొనసాగుతుంది
ఏడాది కాలంగా పలువురు ప్రస్తావిస్తున్నట్లు యూఎస్‌ తదితర ప్రధాన మార్కెట్లలో ఎలాంటి మాంద్య పరిస్థితుల సంకేతాలూ కనిపించలేదని ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ సంజయ్‌ కపూర్‌ పేర్కొన్నా రు. నిజానికి ఆటో విడిభాగాల పరిశ్రమ వృద్ధి బాటలోనే పయనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ నుంచి లభించిన వివరాల ప్రకారం జనవరిలోనూ పటిష్ట అమ్మకాలు నమోదుకాగా.. ఇకపైన కూడా ఈ జోరు కొనసాగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. వృద్ధిరీత్యా దేశీ మార్కెట్‌ అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతు ల్లో బలహీనతలున్నప్పటికీ దేశీ డిమాండ్‌ ఆదుకోగలదని అంచనా వేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీలవైపు ప్రయాణించడంలో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనున్నట్లు వివరించారు. ఈవీల కారణంగా ఐసీఈ విభాగంలో డిజైన్, డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో దేశీ విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement