కొత్త కోడి.. గమ్మత్తు కోడి
భోగి వెలుగులు
పదీపదిన్నరకైనా నోట్లోకి టూత్‌బ్రెష్ వచ్చేయడం పెద్ద ప్రారంభోత్సవం. స్నానం ముగించడం మహోత్సవం. బయటికొచ్చి మనుషులకు కనిపించడం బ్రహ్మోత్సవం. ఉదయాన్నే చల్లగా బస్సు దిగి ఉంటారు. మరీ ఉదయాన్నే దిగి ఉంటే, భోగి మంటల్ని దాటుకుని వెచ్చగా ఇంట్లోకి వెళ్లిపోయి ఉంటారు. మళ్లీ పడుకోడానికి! అంత త్వరగా తెల్లారిపోతే ఎలా? హైదరాబాద్ మెట్రో బాడీ తట్టుకుంటుందా! కనీసం పది వరకైనా పడుకోవాలి. పదిన్నరకు లేచినా లైఫ్‌లో అదో పెద్ద అచీవ్‌మెంట్. నోట్లోకి టూత్‌బ్రెష్ వచ్చేయడం పెద్ద ప్రారంభోత్సవం. స్నానం ముగించడం మహోత్సవం. బయటికొచ్చి మనుషులకు కనిపించడం బ్రహ్మోత్సవం.
ఎప్పుడైనా చూడండి.. మనిషి కన్నా ఊరే ముందు నిద్రలేస్తుంది. కోడి నిద్రలేపుతుంది అనుకుంటాం. కోడిని కూడా ఊరే నిద్రలేపుతుంది. పొలం వెళ్లడానికి, పాలు పొయ్యడానికి ఊళ్లో ఒక్కరు ముందు లేచినా.. ఊరే ముందు లేచినట్టు! ఒళ్లు అలిసి పొలంవాళ్లు, పాలవాళ్లు లేవడం కొద్దిగా అలస్యం అయినా సరే, ఊరే ముందు నిద్రలేచినట్లు. వాళ్లకంటే ముందు వాళ్ల ఇంటి ఇల్లాలు లేచి ఉంటుంది కాబట్టి! ఒంట్లో ఆమెకు ఎలా ఉన్నా, ఇంటికోసం లేచి కూర్చుంటుంది. అందుకే కోడి.. ఊరితో పెట్టుకున్నా ఇల్లాలితో పెట్టుకోదు. పనిలేని వాళ్లు కోడితో గేమ్స్ ఆడుతున్నారని చెప్పి, పని తెమలని ఇల్లాళ్లతో కోడి గేమ్స్ ఆడదు. వాళ్ల దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుంటుంది. ‘లేడీస్ ఫస్ట్’ అని రెస్పెక్ట్ ఇస్తుంది. వాకిట్లో బరాబరామని చీపురు చప్పుడు విన్నాకే, కోడి కొక్కొరొకోమంటుంది. కావాలంటే ఉదయాన్నే లేచి చూడండి. ముందు లేవడం, ముగ్గులెయ్యడం.. ఊళ్లకు, ఇల్లాళ్లకు అచీవ్‌మెంట్‌కాదు. అదొక మామూలు పని. మనిషన్నవాళ్లు చెయ్యవలసిన పని. ఏ టైమ్‌కి చెయ్యాల్సిన పనిని ఆ టైమ్‌కి చెయ్యని మనిషిని ఊరిప్పుడు కోపంగా చూస్తోందో లేదో.. ఊళ్లో ఉన్న కోడి మాత్రం విడ్డూరంగా చూస్తుంది.
రాత్రే కదా హైదరాబాద్‌లో బయల్దేరాం. మనలో కొందరింకా బస్సులోనే ఉండి ఉంటారు. వాళ్లు ఊళ్లో దిగ్గానే కోడి మెడ తిప్పి చూస్తుంది.. వీడెవడో కొత్త కోడిలా ఉన్నాడని.. ఎత్తు కోడిలా ఉన్నాడని.. గమ్మత్తు కోడిలా ఉన్నాడని చూస్తుంది! చేత్తో సూట్‌కేస్ పట్టుకుని, భుజాల వెనక్కి బ్యాగు వేలాడేసుని ఊళ్లోకి దిగిన ఆ కోడి.. అల్లుడు కోడా, కొడుకు కోడా, అన్న కోడా, తమ్ముడి కోడా, బావ కోడా, మరిది కోడా అని చూస్తుంది. వాళ్ల పక్కనే ఇంకేదైనా కోడి కనిపిస్తే అది అతిథి కోడా, అతి చేయబోతున్న కోడా అని ఒకట్రెండుసార్లు తలతిప్పి చూస్తుంది.
కోడి తలతిప్పి చూసిందంటే.. ఆయనెవరో లీడర్‌లా అది మనల్ని ప్రశ్నిస్తోందనే! కోడికి తన టైమింగ్స్ తప్ప హైదరాబాద్‌లో ఉన్న ఎంజీబీస్ టైమింగ్‌లు, జేబీఎస్ టైమింగులు తెలీవు. దారి మధ్యలో ఉండే టోల్‌గేట్లు, రైల్వేగేట్ల గురించి తెలీదు. ‘ఏబ్బాయ్ ఇప్పుడు తెల్లారిందా?’ అన్నట్టు చూస్తుంది. ‘ఒకరోజు ముందుకు రాలేకపోయా’ అన్నట్టు చూస్తుంది. ‘ముందొస్తే నువ్వూ భోగిమంటలకు కూర్చునేవాడివిగా.. చిన్న ఎండుపుల్లైనా వేసేవాడివి..’ అన్నట్టు చూస్తుంది.
ఊరు అలా చూడదు. కన్నతల్లి కదా.. కోడిలానో, లీడర్‌లానో ప్రశ్నించదు. వచ్చిందే చాలనుకుంటుంది. సంక్రాంతి వచ్చేసిందనుకుంటుంది. కోడికి ఒకటే రూపం. ఊరికి మలుపుకో రూపం. పెద్ద కాల్వ ఒక రూపం. ప్రాథమిక పాఠశాల ఒక రూపం. దొరువు ఒక రూపం. దొరువు గట్టు మీద ఊడలమర్రి ఒక రూపం. అమ్మ పిలుపు ఒక రూపం. నాన్న జ్ఞాపకాలు ఒక రూపం.
పెద్దకాలువ వీపు నిమిరిందీ, పాఠశాల పలక దిద్దిందీ, ఊడలమర్రి చీకట్లో దెయ్యమయి ఊగిందీ, ‘ఒరే ఎక్కడ్రా’ అని అమ్మ గాభరాగా ఊరంతా వెతుకులాడిందీ, సెకండ్ క్లాసొచ్చి తలవంపులు తెచ్చినందుకు ‘వాడీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు’ అని నాన్న అనలేకపోయిందీ.. తడిమే జ్ఞాపకాలే కానీ, తడుముకునేలా చేసే ప్రశ్నలు కాదు. ‘ఎన్నేళ్లయిందిరా నిన్నుచూ సి’ అని ఊరు ఊరంతా అమ్మై చూసే ఒక్క చూపుకు జలజలా రాలే కన్నీళ్లు.. ఎన్ని భోగిమంటలకు మనం ఊరొచ్చి వెళితే ఆ భగభగల్లో ప్రక్షాళన అవుతాయో సీఎం కేసీఆర్ చెప్పలేడు, మాదాపూర్‌లోని హైటెక్ సీటీ చెప్పలేదు.
చలి మూడు నెలలు ఉండిపోతుంది. సంక్రాంతికో, శివరాత్రికో వెళ్లిపోతుంది. ఊరు దాటొచ్చిన బతుకులోని ముక్కుదిబ్బడ కూడా.. ఉండాలి, పోవాలి తప్ప.. ఉండిపోకూడదు. ఊళ్లో బతుకు లేదనుకున్నప్పుడు ఉద్యోగం మనల్ని ఒళ్లోకి తీసుకున్న మాట నిజం. ఉద్యోగమే బతుకైపోతున్నప్పుడు.. ఒక్కసారైనా వచ్చిపొమ్మని ఊరు మన కోసమే.. కేవలం మన కోసమే భోగినీ, సంక్రాంతినీ చేసుకుంటున్నదీ నిజం.
మాధవ్ శింగరాజు