మిసెస్ మీగడ!
సమ్‌సారం
సంసారంలో సినిమా
పెళ్ళయ్యి ఐదేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. అతిగా ప్రేమించే అత్తయ్యగారు. మరి... అంతగా ప్రేమించే అత్తగారికి రిటర్న్‌లో ఆ మాత్రం ప్రేమ చూపించకపోతే ఎలా? ముందునుంచి అణకువగా వుండే నా అనంతికకు ‘కుదరదు’ అన్న పదం అసలు తెలియదు. పోనీ ‘ఇప్పుడే కాదు, కాసేప య్యాక చేస్తా’ అనడమూ రాదు. తనకు తెలిసిందల్లా ‘ఇదిగో వస్తున్నా’ అనడం మాత్రమే. చిన్నోడు ఏడ్చినా, అత్తగారు పిలిచినా చెంగుతో చేతులు తుడుచుకుంటూ ‘ఇదిగో వస్తున్నా’ అని ప్రత్యక్షమయిపోతుంది. లాస్ట్‌లో పడుకునేది, ఫస్ట్‌లో లేచేది తనే. రోజులో కాసేపైనా కూర్చునే ఛాన్సుండదు అనంతికకు.
రోజూ నేను పళ్ళు తోముకుని వచ్చేటప్పటికి వేడివేడి కాఫీ టీపాయి మీద పెట్టేది. కానీ కొన్ని రోజులుగా నేను అడిగినా ‘అనంతిక’ కానీ ‘కాఫీ’ కానీ వెంటనే ప్రత్యక్షం కావడం లేదు. అందుకే ఒకరోజు కాఫీ మానేశా. నేను కాఫీ మానేశానన్న విషయం చాలా సంతోషంగా చెప్పా. అదేదో ఆరోగ్యానికి మంచిది కాదన్నట్టు! అమ్మ నవ్వింది – ‘కాఫీ ఏం చేస్తుందిరా శుభ్రంగా తాగక! నేను కలిపియ్యనా?’ఉహు.. ఉహు .. వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపి వాకింగ్‌కి వెళ్ళా. ఇక అప్పటినుంచి నో మార్నింగ్ కాఫీ.
నాలుగేళ్లు అలా మార్నింగ్ కాఫీ తాగలేదు. ఆ తరువాత ఒకరోజు అనంతికతో వేరే విషయంలో వాదిస్తూ చటుక్కున నోరు జారి – ‘‘నువ్వు కాఫీ ఇవ్వలేకపోతున్నావని నాలుగేళ్ల నుంచి నాకు నచ్చిన కాఫీని నీకోసం మానేశా! నిన్ను కష్టపెట్టకూడదని ఆరోగ్యానికి మంచిది కాదన్నట్టు నాటకం ఆడా. ఐ గేవ్ అప్ సమ్‌థింగ్ ఐ లైక్డ్ సోమచ్ బికాజ్ ఐ లవ్ యూ. మా అమ్మ కాఫీ కలిపితే నువ్వు బాధపడతావని కాఫీనే మానేశా. రోజూ ఆఫీసుకు వెళ్ళాల్సిందే. లేకపోతే బతకడానికి డబ్బులుండవు. ఇంట్లో సామాన్లు రావు. పిల్లల ఫీజులు ఉండవు. పండక్కు నాలుగు స్వీట్లు దిగవు. వేసుకోవడానికి గౌరవమయిన బట్టలు, బంధువులకు భోజనాలు ఉండవు. ఎప్పుడూ నేనేదో సరిగా చేయలేదనే అన్నట్టుగా ఉంటావు. సరిగా చేయడానికి ఇంకా ఏముందని నా దగ్గర. అక్కడ ప్రపంచానికి భయపడాలి.
ఇక్కడ నీకు భయపడాలి... ఎక్కడ బాధపడతావో అని! నాకోసం అన్నీ వదిలి వచ్చావని కదా నేను ఏదయినా నీకోసం వదిలేసేది. మానేస్తా అది కూడా మానేస్తా. వెధవ సిగరెట్టు కాల్చినా భయం భయంగా కాలుస్తా. నువ్వెక్కడ బాధపడతావో అని. మై లైఫ్ ఈజ్ ఓవర్. ఐ హ్యావ్ నథింగ్ టు లివ్ ఫర్! ఎప్పుడూ ప్రాబ్లమ్సే. అన్నీ కష్టాలే. దానికితోడు ఆ మౌనం. నేను ఇంత బాధపడుతుంటే ఒక మాటయినా మాట్లాడవు. అదేదో నేను తప్పు చేసినట్టు... సంజాయిషీ అవసరం అన్నట్టు... నేను నీ ముందు నిలబడి చేసినదానికి, చెయ్యనిదానికి ఎక్స్‌ప్లనేషన్ చెప్పుకోవాలన్నట్టు... ఛీ వాట్ ఈజ్ దిస్ లైఫ్! ఎందుకు ప్రేమించుకున్నాం.
ఎందుకు పెళ్లి చేసుకున్నాం. కన్న కలలన్నీ ఏమైపోయాయి. వి ఆర్ లైక్ స్ట్రేంజర్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఆరేడేళ్ల ప్రేమ, సంసారం త్యాగాలు.. అంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాక కూడా నీకు నేను ఎవరో అర్థం కావడంలేదు. ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు అలాగే నిలబడి ఉన్నావు. తల ఎత్తి చూడనైనా చూడడం లేదు. అంత అసహ్యం వేస్తుందా నేనంటే? ఏంటి? నేను చేసిన ఘోరం. మీ అమ్మానాన్నలను సరిగా చూసుకోలేదా? మీ సిస్టర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వలేదా? మీ ఫ్యామిలీని అవసరంలో ఆదుకోలేదా? ఎందుకు నీకు .. వై డోంట్ ఐ ఎగ్జిస్ట్ ఫర్ యూ. వై యామ్ ఐ... సో రాంగ్ ... ఏమీ మాట్లాడవు కదా అనంతికా!’’
అంతలో అమ్మ పిలిచింది ‘అనంతికా! ’. అనంతిక కదల్లేదు. అదేదో నేను పట్టుకుని వెళ్లనివ్వడం లేదనట్టు. ‘‘ఈ మౌనంతో చంపేస్తావా..’’అని సెల్ఫ్ పిటీతో కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నా. ‘అనంతికా’ అమ్మ మళ్లీ పిలిచింది. నా కన్నీళ్లు ఆగడం లేదు. ఐదేళ్ల జీవితం వృథా అయిపోయిందన్నట్టు ఫీల్ అవుతూ ఇంకా నేరస్తుడిగా అనంతిక ముందు నిలబడి ఉండాలా అన్నట్టు తాత్సారం చేస్తూ నిలబడ్డా. ‘అనంతికా! నా కళ్లజోడు తుడిచిపెట్టవా’ అని అమ్మ మళ్లీ కేక వేసింది. ఇదే మొదటిసారనుకుంటా... అమ్మ పిలిచినా అనంతిక పరుగెత్తకుండా నిలబడి ఉండడం. అనంతిక అలాగే మౌనంగా నిలబడి తన పాదాలనే చూస్తూ ఉంది. పాదం అంతా తడిసిపోయి ఉంది... కన్నీళ్ళతో! నాకు కనబడకుండా తల దించుకుని బాధపడుతుందనుకుంటా. అనంతిక భుజానికి నా భుజం రాసుకుంటూ మీద గదికి వెళ్ళా. దూరంగా వినపడింది ‘ఇదిగో వస్తున్నా అత్తయ్యా’ అని! రాత్రి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు – అప్పటికి అనంతిక ఇంకా మంచం మీదకు రాలేదు. పొద్దున మృదువయిన స్పర్శకు నిద్ర లేచా. నా భుజం తట్టి పిల్లవాడిని లేపినట్టు లేపి చేతికి కాఫీ ఇచ్చింది. కలో నిజమో తెలుసుకునే లోపలే ‘ఇదిగో వస్తున్నా..’ అని వెళ్లిపోయింది అనంతిక.
బాధలన్నీ మగవాడివే అన్నట్టు... బాధ్యతలన్నీ నావే అన్నట్టు ఫీలయిన నాకు ఆ రోజు సిగ్గుగా అనిపించింది. అనంతిక తన బాధ, బాధ్యత ఏదీ బయటకు చెప్పుకోదు. నొచ్చుకుంటుంది కానీ నొప్పించదు. ప్రేమ చూపిస్తుంది కానీ చూపించుకోదు. ఆ రోజు నుంచి పొద్దున్న కాఫీ డ్యూటీ నాదయింది. కానీ ఇప్పటిదాకా అనంతిక కాఫీ పూర్తిగా తాగినరోజు లేదు. ఎవరో ఒకరు పిలుస్తారు... కాఫీ పెట్టిన చోటే మీగడ కట్టి పోతుంది. అవును, అనంతిక నా కాఫీ మీద మీగడ.
కాఫీ నేనే పెట్టుకోవడం మంచిది
సినిమాలో సంసారం
భగవాన్ (కృష్ణ భగవాన్) లాయర్. అతని భార్య సత్యభామ (హేమ) గృహిణి. భార్యకు బెండ్ అవకుండా అదుపులో పెట్టుకోవాలనుకుని అజమాయిషీ చూపిస్తుంటాడు భగవాన్. ‘ఏమే.. టీ’ అనగానే చిటికెలో పట్టుకొచ్చేస్తుంటుంది. ఓ రోజు ఇంట్లో మందు కొడుతుంటాడు భగవాన్. సత్య ‘ఏవండీ ఇక చాలండీ’ అనగానే ‘నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా?’ అని విసుక్కుంటాడు. ఇంతలో దొంగలొస్తారు. దొంగల్ని చితకబాది పోలీసులకు అప్పగిస్తుంది సత్య. ‘దీని కెపాసిటీని తక్కువగా అంచనా వేశా. ఇప్పుడు దీంతో ఎలా మసులుకోవాలి... టెన్షన్ వస్తోంది. కాఫీ తాగాలి’ అనుకుని ఏమేవ్ అంటాడు.
‘పిలిచారాండీ’ అనగానే ‘అబ్బే ఏమీ లేదు’ అంటాడు. ‘లాభం లేదు నేనే వెళ్లి కాఫీ పెట్టుకోవడం మంచిద’నుకుని వంటగదిలోకి వెళతాడు. ‘ఏం కావాలండీ’ అని భార్య అడగ్గానే ‘అబ్బే ఏం లేదు’ అంటాడు బెరుకుగా. ‘కాఫీ అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా మీకెందుకు శ్రమ’ అని భార్య అనగానే ‘నీ కెందుకు శ్రమ అని’ నసుగుతాడు. ‘మీరు నిజంగానే నా శ్రమని గుర్తిస్తే సంతోషిస్తా. రాత్రి జరిగినదానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే భరించలేను. మీరెళ్లి కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తా’ అంటుంది సత్యభామ ‘పెళ్లైన కొత్తలో’ సినిమాలో.
– చినబాబు
మీ సంసారంలోని సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్: samsaaram2017@gmail.com