ఫిట్‌నెస్‌ ఛాంపియన్‌ | Special Story On Womens Boxer Deepthi | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ ఛాంపియన్‌

Published Mon, Jan 20 2020 1:49 AM | Last Updated on Mon, Jan 20 2020 1:49 AM

Special Story On Womens Boxer Deepthi - Sakshi

దీప్తికి ఫిట్‌గా ఉండడం ఇష్టం. అందరినీ తనలా ఫిట్‌గా ఉంచడం ఇంకా ఇష్టం. క్రీడలన్నా క్రీడాకారులన్నా కూడా ఎంతో ఇష్టం. వారిని విజయం వైపు నడిపించడంలో తానూ భాగం పంచుకోవడం మహా ఇష్టం. ఈ ఇష్టాలన్నీ మేళవించి క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారామె. పేరొందిన మహిళా బైక్‌ రేసర్లు, బాక్సింగ్‌ ఛాంపియన్లకు కూడా ఫిట్‌నెస్‌ పాఠాలు బోధిస్తున్న ఈ తెలుగు కోచ్‌... ఫిట్‌గా ఉంటేనే ఏ రంగంలోనైనా హిట్‌ కొడతామని అంటున్నారు. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. కాలేజీ రోజుల నుంచీ.. ఫిట్‌నెస్‌ మీద ఇష్టంతో విభిన్న రకాల వ్యాయామ శైలులను సాధన చేశాను. అలా  పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఎంబీయే చేశాక స్వంతంగా మార్కెటింగ్‌ కంపెనీ ప్రారంభించాను. పొద్దస్తమానం ల్యాప్‌ట్యాప్‌ ముందు కూర్చోవడంతో ఏదో మిస్‌ అవుతున్నాను అనిపించేది. అదే సమయంలో పెళ్లి, బాబు పుట్టిన తర్వాత ఆరోగ్యం విషయంలోనూ కొన్ని తేడాలు కనిపించాయి. కాలేజీ రోజుల్లో లేని ఈ సమస్య అంతా  కూర్చుని చేసే జాబ్‌ వల్లే అని అర్ధమయ్యాక... మార్కెటింగ్‌ కంపెనీకి గుడ్‌బై చెప్పేశాను.

కిక్‌ ఇచ్చింది
మునుపటి ఫిట్‌నెస్‌ను సాధించడంతో పాటే ఇక ఈ రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా కూడా మారాను. అలా కొనసాగుతూనే ఈ రంగంలో ఉన్న మిగతా దారులనూ వెతికాను. క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా ఉండటం చాలా ఆసక్తిగా అనిపించింది. కిక్‌బాక్సింగ్‌లో మూడేళ్లు జాక్సన్‌ మాస్టర్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాను. క్రీడాకారులకు ట్రైనర్‌గా మారడానికి ముందు అన్ని రకాలుగా అధ్యయనం చేశాను. వారి మైండ్‌సెట్‌ను అర్ధం చేసుకున్నాను. నేనూ అలవరచుకున్నాను. ఇంటర్నేషనల్‌ సర్ఫర్స్, సెయిలర్స్, స్విమ్మర్స్‌.. ఇలా ఎక్కువ మంది క్రీడాకారులు చెన్నైలో ఉన్నారు. అక్కడైతే మరింత మందికి నా సేవలు అందించవచ్చునని  మూడున్నరేళ్ల క్రితం చెన్నైకి షిఫ్ట్‌ అయ్యాను. స్పోర్ట్స్‌ పర్సన్స్‌కి కోచ్‌గా ఉంటూనే ఇప్పుడు ఎఫ్‌ 45 పేరుతో రెండు ఫిట్‌నెస్‌ స్టూడియోలను నడుపుతున్నాను.

ఆట.. బాట
అంతర్జాతీయ సర్ఫ్, సెయిలర్స్, స్విమ్మర్స్‌.. ఇలా అన్ని కేటగిరీలో స్పోర్ట్స్‌ టాపర్స్‌  పలువురికి మా స్టూడియోలో శిక్షణ అందిస్తున్నాం. నా ఆధ్వర్యంలో 25 మంది ట్రైనర్లు ఉన్నారు. వీరందరితో కలిసి పూర్తి ట్రైనింగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తాను.  వ్యక్తిగతంగా స్పోర్ట్స్‌ పీపుల్‌ని ట్రైన్‌ చేయడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. క్రీడాకారులు ట్రోఫీలు, ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి క్రీడాకారుల విజయాల్లో భాగం పంచుకోవడం అనేది చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఇంటర్నేషనల్‌ ఫిమేల్‌ రేసర్‌ బైక్‌లో నెంబర్‌ వన్‌ అయిన అలీషా అబ్దుల్లాకు రెండేళ్లుగా పర్సనల్‌ ట్రైనర్‌గా ఉన్నాను. అలాగే  ఇప్పుడు స్పోర్ట్స్‌ నేప«థ్యంలో సినిమాలు బాగా తయారవుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు జాన్‌కొకేన్‌ ఓ బాక్సింగ్‌ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆ మూవీ కోసం జాన్‌ని మూడు నెలలుగా ట్రైన్‌ చేస్తున్నాం. భరత్‌ తదితర సినిమా సెలబ్రిటీలూ మా ఫిట్‌నెస్‌ స్టూడియోలకు వస్తారు.

మండే మాంక్‌
కండలు తిరిగిన దేహం వంటివి కాకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉండడమే చాలా మంది లక్ష్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని శారీరక, మానసిక, భావోద్వేగాలకు సంబంధించిన ప్రయోజనాలు అన్నీ మేళవించి అందిస్తూ 55 నిమిషాల్లో చేసే వ్యాయామం  పరిచయం చేస్తున్నా.  మండే మాంక్‌ పేరుతో ఫిట్‌నెస్‌ యాప్, వెబ్‌సైట్‌ కూడా లాంచ్‌ చేయబోతున్నాను. దీంట్లో  మెంటల్లీ ఫిట్‌గా ఎలా ఉండాలి? ఫిజికల్లీ ఫిట్‌గా ఎలా ఉండాలి? సైకియాట్రిస్ట్, న్యూట్రీషియన్‌ సూచనలు... ఇవన్నీ  ఉంటాయి. ఏ ప్రాంతానికి తగిన ఆహారపు అలవాట్లను బేస్‌ చేసుకుంటూ డైట్‌కు సంబంధించిన సూచనలు అందిస్తున్నాం.

ఇళ్లలో ఉండేవారు, ఆఫీసుల్లో వర్క్‌ చేసేవారు ఎవరికి ఏ విధమైన ఫిట్‌నెస్‌ అవసరమో అలాంటివి మండేమాంక్‌లో చేర్చాం. మూడు నెలల్లో ఈ యాప్‌ని లాంచ్‌ చేస్తాను. మండేమాంక్‌ పేరుతో ఏపీ, తెలంగాణలోనూ  స్టూడియోలను ప్రారంభించబోతున్నా. మూడేళ్లలో 75 çస్టూడియోలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మెట్రో నగరాల్లోనే కాకుండా మిగతా పట్టణాల్లోనూ ఫిట్‌నెస్‌ స్టూడియోలను చేరువ చేయాలని నా ఉద్దేశం’’ అని తెలిపారు దీప్తి.
– ఎస్‌.సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement