
యశస్వికి వినికిడి లోపం. ఏ శబ్దాలకూ స్పందించదు. కానీ చదరంగంలోని గుర్రపు డెక్కల చప్పుళ్లు, ఏనుగుల ఘీంకారాలు, భటులు పరుగులు తీస్తున్న ధ్వనులు.. అవన్నీ చక్కగా వినిపిస్తాయి. ఇటీవలే ప్రపంచ చెస్ పోటీలలో పాల్గొని, జూనియర్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించింది. ఊళ్లో ఘనస్వాగతం పొందింది.
యశస్వి కర్ణాటకలోని బంత్వాల్ గ్రామ బాలిక. పదో తరగతి చదువుతోంది. ఈ నెలలో యూకే లోని మాన్‌చెస్టర్‌లో జరిగిన అంతర్జాతీయ బధిరుల చెస్ పోటీలలో పాల్గొని కాంస్య పతకం సాధించింది. యశస్వి తల్లి యశోద స్కూల్ టీచర్. తండ్రి తిమ్మప్ప ల్యాబ్ టెక్నీషియన్. మెడల్ సాధించుకొచ్చిన యశస్వికి తను చదువుకున్న కాడేశ్వల్య హైస్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా స్వాగతం పలికినప్పుడు ఈ తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో పులకించిపోయారు. ‘‘ఇది మా అమ్మాయి పాల్గొన్న మొట్టమొదటి అంతర్జాతీయ పోటీ. జాతీయ స్థాయిలో రెండుసార్లు అవార్డులు అందుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
అక్కకూ వినిపించదు!
పెద్దమ్మాయి యతిశ్రీ (20) ప్రస్తుతం పుత్తూరులో బీకాం చదువుతోంది. ఆమె కూడా బధిరురాలే. ‘‘యతిశ్రీకి ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు, ఆమె శబ్దాలకు స్పందించడంలేదని గ్రహించాను. అప్పటికి తనకు కేవలం 20 శాతం మాత్రమే వినికిడి శక్తి ఉంది. నేను టీచర్‌ని కావడం వల్ల, ముందుగా నేను చదువుతున్న పాఠశాలలోనే చేర్పించి, ఆ తరవాత దగ్గరలో ఉన్న పాఠశాలలో చదివించాను. పెద్దయ్యాక కూడా దగ్గరలోనే ఉన్న కాలేజీలోనే చేర్పించాను. యతిశ్రీ చాలా చక్కగా భరతనాట్యం చేస్తుంది. బొమ్మలు కూడా వేస్తుంది. రకరకాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించింది’’ అని పెద్ద కూతురు గురించి కూడా గొప్పగా చెబుతారు యశోద. ‘ఎలారా దేవుడా’ అనుకున్నారుమొదట్లో ఈ దంపతులు, భగవంతుడు తమను చిన్నచూపు చూశాడనే భావనలో ఉండేవారు. రెండో అమ్మాయి యశస్వి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి బాగానే వినిపిస్తుందనుకున్నారు. ఒక నెల అయ్యాక,యశస్వికి కూడా వినపడట్లేదని తెలిసిపోయింది. దాంతో హతాశులయ్యారు. ‘‘డాక్టరుకి చూపించినా ప్రయోజనం లేకపోయింది. యతిశ్రీ కంటే యశస్వికి ఇంకా బాగా తక్కువగా వినిపిస్తుంది. కానీ చాలా తెలివైనది. చదువులో 90 శాతం మార్కులు సాధించేది’’ అంటారు యశోద. పిల్లలు ఎన్ని విజయాలు సాధించినా, వారికి వైక ల్యం ఉంటే అది తల్లిదండ్రులకు బాధను కలిగిస్తుంది. అందుకే ఆ తల్లి శని ఆదివారాలలో యశస్విని స్పీ^Œ థెరపీ కోసం మంగళూరుకు తీసుకెళ్లేవారు. యశస్వికి చదువుతో పాటు చదరంగం మీద కూడా మక్కువ ఏర్పడింది. ముందుగా ఇంట్లోవారితో ఆడి, ఆ తరవాత స్కూల్‌లో ఆడింది. ఆమె ఆటలోని నేర్పరితనాన్ని గమనించిన టీచర్లు పుత్తూరులోని జీనియస్ చెస్ స్కూల్‌లో చేర్పించారు.
బాధను మరిపించింది.
చెస్ పోటీల కోసం ఈ ఏడాది జూన్ 25వ తేదీన యశస్వి ఢిల్లీ చేరుకుంది. జూలై ఆరవ తేదీన ఇంగ్లండ్ వెళ్లే వరకు ఢిల్లీలో బాగా ప్రాక్టీస్ చేసింది. ‘‘ఈ సాధన యశస్వికి ఒక మంచి అనుభవం. ఇంటి నుంచి దూరం వెళ్లడం ఇదే మొదటిసారి. మేం కూడా తన వెంట వెళ్లాలనుకున్నాం. కానీ కుదరలేదు. భగవంతుడి దయ వల్ల అన్నీ సాఫీగా జరిగిపోయాయి. మల్లి హందా అనే అమ్మాయితో కలిసి భారతదేశం తరఫున బాలికల విభాగంలో ఆడి వచ్చింది మా అమ్మాయి. జూనియర్స్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది. మేం పడిన బాధంతా మరచిపోయాను. మా పిల్లలిద్దరూ చక్కగా రాణిస్తున్నందుకు ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది’’ అంటారు యశోద.
– రోహిణి