బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే పరబ్రహ్మం
తైత్రియోపనిషత్
మానవ జీవనంలో ఋతం (సర్వదృష్టి) స్వాధ్యాయం (చదువుకోవడం), ప్రవచనం (చదువు చెప్పడం), సత్యం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శాంతి, అగ్నిహోత్రం, యజ్ఞం, అతిథులను పూజించడం, సమాజసంక్షేమకార్యాలు, మంచి సంతానం అనేవి తప్పనిసరిగా ఉండాలి. ‘సత్యవచనుడు’ సత్యానికీ, పౌరశిష్టి, తపస్సుకూ, నాక మహర్షి స్వాధ్యాయ ప్రవచనాలకూ ప్రాధాన్యం ఇచ్చాడు. ‘సంసారవృక్షానికి నేనే మూలాన్ని. నేనే శిఖరాన్ని. నా కీర్తి పవిత్రం. నేను సంపన్నుణ్ణి. కాంతిమంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, మరణం లేని వాణ్ణి’ అనే ఆత్మవిశ్వాసంతో, ఉన్నత లక్ష్యంతో మానవుడు జీవించాలని త్రిశంకు మహర్షి చెప్పాడు.
‘శిష్యులారా! సత్యం పలకండి. ధర్మాన్ని ఆచరించండి. శ్రద్ధగా చదవండి, గురుదక్షిణ చెల్లించండి. సంతానవంతులు కండి. సత్యమార్గాన్ని తొలగకండి. ధర్మం, సత్కర్మలు, అధ్యయనం, ప్రవచనం, దేవకార్యాలు, పితృకార్యాలు మానకండి. తలిదండ్రులను గురువును, అతిథులను దైవాలుగా పూజించండి. నాలోని మంచినే స్వీకరించండి. చెడ్డపనులు చేయకండి. పెద్దలను గౌరవించండి. దానం శ్రద్ధగా చెయ్యండి. మహాత్ములను అనుసరించండి. ఇదే గురువుల ఆదేశం. ఉపదేశం. ఇదే వేదం చెప్పేది.
దీన్ని ఉపాసించండి అని విద్యపూర్తి అయిన సందర్భంలో ఇచ్చే ఈ సందేశం భారతీయ సంస్కృతిలోని గురుశిష్య సంబంధాన్ని పై తరం కింది తరానికి చె ప్పవలసిన మార్గదర్శకసూత్రాలను బోధించే శిక్షావల్లి. ఇది తైత్తిరీయోపనిషత్తుకే తలమానికంగా మానవజాతిని తీర్చిదిద్దుతుంది. విద్య ముగించుకుని వెళ్లే విద్యార్థులకు చెప్పే ఈ హితోపదేశాన్ని ఇప్పుడు పెళ్లికి ముందు చేసే స్నాతకంలో వినిపిస్తున్నారు. విద్యార్థులు అందరికీ దీనిని వినిపించి అర్థం చెబితే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది
తైత్తిరీయోపరిషత్తులో రెండవ అధ్యాయం ఆనందవల్లి. దీనిలో తొమ్మిది అనువాకాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలను దాటి బ్రహ్మానందాన్ని పొందే క్రమాన్ని ఆనందవల్లి విశదంగా తెలియచేస్తుంది.
బ్రహ్మజ్ఞానం అనంతం. దానిని పొందినవాడు అత్యున్నత స్థితికి చేరుకుంటాడు. హృదయపు గుహలో సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ అయిన పరబ్రహ్మ ఉన్నాడని తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మం అవతాడు. పరమాత్మనుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి భూమి, భూమినుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి ప్రాణి ఆవిర్భావం జరిగింది.
ఇది అన్నమయ శరీరం. అన్నం నుంచే మానవులుగాని, ఇతర ప్రాణులుగానీ జన్మిస్తున్నాయి. అంతా అన్నాన్నే బ్రహ్మగా ఉపాసిస్తున్నారు. ప్రాణులన్నీ అన్నం వల్ల పుడుతూ వర్థిల్లుతున్నాయి. అన్నంతోనే మరణిస్తున్నాయి. అన్నిటికీ అన్నమే మూలం. అన్నంతో పెరిగే బాహ్యశరీరం కాక లోపల మరో శరీరం ఉంది. అది ప్రాణమయం. దానితోనే అన్నమయ దేహం బతుకుతోంది. దానికి కూడా తల, కుడి, ఎడమ, కింద అన్నీ ఉన్నాయి. దాని శరీరం ఆకాశం. కింది భాగం భూమి. ఇది ప్రాణమయ శరీరం.
ఎవరిని గురించి చెప్పటానికి మాటలు లేవో, మనసు కూడా చేరలేదో అతడే పరబ్రహ్మ. ఇది తెలిసిన వానికి భయం లేదు. ప్రాణమయ శరీరానికి ఈ మనోమయ శరీరమే ఆధారం. దీనిలో విజ్ఞానమయ శరీరం ఉంది. దీని తల శ్రద్ధ. కుడిభాగం ఋతం, ఎడమ భాగం సత్యం, ఆత్మ యోగం, తేజస్సు వెనుక భాగం. ఇది మనోమయ వర్ణన.
విజ్ఞానమే మానవులచే యజ్ఞాలు, కర్మలు చేయిస్తోంది. సర్వదేవతలు విజ్ఞానమే బ్రహ్మగా ఉపాసిస్తున్నారు. విజ్ఞానమే బ్రహ్మమని తెలుసుకున్నవాడికి ఏ ప్రమాదమూ లేదు. అన్ని పాపాలూ పోతాయి. అన్ని కోరికలూ తీరుతాయి. మనోమయ శరీరానికి ఆధారంగా ఈ విజ్ఞానమయ శరీరం ఉంటుంది. బుద్ధితో ఏర్పడిన ఈ విజ్ఞానమయ శరీరంలో ఆత్మానందమయ శరీరం ఉంటుంది. దానితో విజ్ఞానమయ శరీరం పరిపూర్ణం అవుతుంది. ఇది కూడా విజ్ఞానమయంలాగానే ఆకారం కలిగి ఉంటుంది. దానికి శిరస్సు ప్రియం. కుడి భాగం మోదం. ఎడమ భాగం ప్రమోదం. ఆత్మ ఆనందం. పరబ్రహ్మమే వెనుక భాగం. ఇది విజ్ఞానమయ వర్ణన.
- డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్