శరీరానికి... మనస్సుకి.. వజ్రం
లైఫ్
వజ్రం కలకాలం నిలిచే ఉంటుంది. అలాగే వజ్రాసనాల వల్ల వచ్చే ఆరోగ్యం కూడా. యోగాలో అత్యంత ముఖ్యమైన ఆసనంగా దీన్ని పరిగణిస్తారు. ధ్యానం చేసేవాళ్లు ఈ ఆసనంలో ఉండే ధ్యానం చేయడం మనం గమనించవచ్చు. వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం అన్నట్టే... దీని వల్ల వచ్చే లాభాలకు సాటి ఇదే తప్ప మరొకటి కాదు. ఎక్కువ మంది చేయగలదీ... సులభ సాధనతో ఆరోగ్యానికీ సానపెట్టేది అయిన వజ్రాసన గురించిన విశేషాలు ఈ వారం...
వజ్రాసన
మోకాళ్ల మీద నిలబడి పాదాలు మడమలు కలిపి ఉంచి... మడమల మీద రెండు పిరుదులు ఆనించి కూర్చోవాలి. మడమలు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. రెండు చేతులూ ముందు మోకాళ్ల మీద సౌకర్యంగా పెట్టుకొని, తల నిటారుగా ఉంచాలి. కళ్లు మూసి ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు ఆసనంలో ఉండే ప్రయత్నం చేయాలి. సాధన చేసే కొద్దీ 20 నుంచి 30 నిమిషాల వరకు కూర్చోగలుగుతారు. ప్రారంభ సాధకులు కూర్చోవడంలో ఇబ్బందిగా ఉంటే (యాంకెల్స్) చీలమండల కింద ఒక మెత్తని దిండును ఉంచుకోవాలి. అవసరమైతే సీటు భాగానికి, కాఫ్ మజిల్స్‌కి మధ్యలో కూడా ఒక మెత్తని దిండుని ఉంచవచ్చు. దీని వల్ల మోకాళ్ల మీద పడే భారం తగ్గుతుంది.
ఉపయోగాలు: వజ్రాసనంలో కూర్చున్నప్పుడు నడుము కింది భాగాలైన కాళ్లలోకి రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. పెల్విక్ రీజియన్... అంటే కడుపు, పొత్తి కడుపు భాగాలకు రక్తప్రసరణ ఎక్కువ అవుతుంది. అందువల్ల భోజనం చేసిన తరువాత ఈ ఆసనంలో కూర్చున్నట్లయితే జీర్ణవ్యవస్థవైపు రక్తప్రసరణ సాధారణంగా జరిగే దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకి సంబంధించిన గ్రంథుల అవయవాలు మరింత ప్రేరేపింపబడి... అరుగుదల బాగా జరుగుతుంది. ఎసిడిటీ, అల్సర్లు, ఉదరకోశ సమస్యలు, మలబద్దకం నివారణకు... పిరుదుల భాగం తగ్గడానికి ఈ ఆసనం మహత్తరంగా ఉపయోగపడుతుంది. మనసు ప్రశాంతమవుతుంది.
వికృష్ట వజ్రాసన
పాదాలు రెండూ విడదీసి, ఆ మధ్యలో (ఖాళీ ప్రదేశంలో) పిరుదుల భాగాన్ని పూర్తిగా భూమి మీద ఆనించి, కూర్చున్నట్లయితే దానిని వికృష్ట వజ్రానం అంటారు. అలా కాకుండా రెండు కాళ్ల వేళ్లూ నిలబెట్టి ఉంచి రెండు మడమలూ కలిపి ఉంచి, ఆ మడమల మీద కూర్చున్నట్లయితే దానిని అంగుష్ట వజ్రాసనమని పిలుస్తారు.
సుప్త వజ్రాసన
వజ్రాసనంలో కూర్చుని వెనుకకు వెళ్లి, మోచేతులు భూమి మీద ఆనించి, ఆ సపోర్ట్‌తో వీపుని కూడా భూమి మీద నెమ్మదిగా ఆనించి, అక్కడ నుండి మెడ, తల భాగాలను నేల మీద ఆనించి, చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్లి స్ట్రెచ్ చేసి ఉంచినా లేదా చేతులు రెండూ కట్టుకుని తల కింద పెట్టుకుని పడుకున్నా... దానిని సుప్త వజ్రాసనం అంటారు.
వీరాసన
విడదీసి ఉంచిన పాదాల మధ్యలో కూర్చున్న తరువాత వెనుకకు ఒరిగి, రెండు మోచేతులూ భూమి మీద ఆనించి, రెండు అరచేతులూ సీటు పక్కన భూమి మీద ఉంచి భూమికి నొక్కుతూ, వీపు భాగాలని తరువాత మెడ భాగాలని ఆ తరువాత తల భాగాన్ని భూమి మీద ఉంచి, చేతులు రెండూ వెనుకకు స్ట్రెచ్ చేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆసనం పూర్తి స్థితిలో వీపుపై భాగాలే కాకుండా వీపు మధ్య భాగం, కింద భాగం కూడా భూమి మీద ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి. మోకాళ్లు రెండూ దూరంగా కాకుండా వీలైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే మోకాళ్లు గాలిలోకి లేవకుండా పూర్తిగా భూమి మీదనే ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి.
ఉపయోగాలు
పిరుదుల (హిప్స్) భాగాలను, తొడ భాగాలను తగ్గించుకోవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. తొడ కండరాలను శక్తివంతంగా గుంజడం జరుగుతుంది కాబట్టి వెరికోస్ వెయిన్స్ సమస్యకు పరిష్కారంగాను, డెజైస్టివ్ పవర్ పెరగడానికీ ఉపయోగపడుతుంది.
జాగ్రత్తలు
మోకాలు సమస్య ఉన్నవారు ఎంతవరకు సాధ్యపడితే అంతవరకే చేయాలి.
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్