అనంతం నుంచి అనంతానికి... | Spiritual information by giridhar | Sakshi
Sakshi News home page

అనంతం నుంచి అనంతానికి...

Aug 19 2018 1:02 AM | Updated on Nov 9 2018 6:22 PM

Spiritual information by giridhar - Sakshi

సత్యంగా చెప్పబడే అనంతశక్తి సకల చరాచర సృష్టికి హేతువని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఒకే ఒక సత్యాన్ని కొందరు బ్రహ్మగా, మరికొందరు ఆత్మగా, మరి కొందరు ఈశ్వరునిగా గుర్తిస్తూ ఉండగా, సైంటిస్టులు విశ్వశక్తిగా లేక అనంతశక్తిగా నిర్ధరిస్తున్నారు.ఆ అనంతశక్తిని చూద్దామంటే చూడలేము. స్పృశిద్దామంటే స్పృశించలేము. అంతులేనిది, కాలాతీతమైనది. నిశ్చలంగా ఉండగలిగేది. ఖాళీ లేనంతగా వ్యాపితమైంది , రూపంలేనిది. అదే సమయంలో అన్ని ఖగోళరూపాలుగా మారగలిగేది. కాంతిగా, శబ్దంగా, ఉష్ణంగా, జీవంగా, నిర్జీవంగా, ఏ పదార్థంగానైనా మారగలిగేది. కొలమానాలకు అతీతమైనది. దానిని అర్థం  చేసుకోవడమే సాధ్యమవుతుంది.

అటువంటి మహాశక్తి గురించి ఉపనిషత్తులు బ్రహ్మమని, సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి ఆత్మ అనీ విశ్లేషణలు చేశాయి.  వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ఆ అనంత శక్తిని ఏ విధంగా ఊహించగలిగారోనన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఆత్మ అనంతము, సర్వరూపధారి, నిష్క్రియత్వమైనదని శ్వేతాశ్వతరోపనిషత్‌ చెప్పగా, అది సత్యం, అదే ఆత్మ అంటూ ఛాందోగ్యోపనిషత్‌ అంటుండగా, అందరిలో ఉండే నీ ఆత్మయే అతడు అంటూ బృహదారణ్యకోపనిషత్‌ తేటతెల్లం చేస్తోంది. ఆత్మ సర్వాంతర్యామి కాబట్టి, మనలో కూడా ఆ అనంత శక్తే నిండి ఉన్నదనేది తెలుసుకోవాలి. భౌతిక రూపాలు వేరు కాబట్టి లక్షణాలు మాత్రమే భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం జీవుల పుట్టుకకు కారణం సూర్యరశ్మి, భూమి, జలం, వాయువు అని తెలుస్తోంది. ఆధ్యాత్మికత ఒక అడుగు ముందుకువేసి ఈ నాలుగు శక్తులకు ఆకాశాన్ని జోడించి పంచభూతాలుగా పేర్కొన్నది. విజ్ఞానశాస్త్ర పరంగా ఆలోచిస్తే భూమి తదితర గ్రహాలు సూర్యుని నుండి పుట్టినవి. ఈ సూర్యునిలో ఉన్నవి హైడ్రోజన్, హీలియం వాయువులు. ఈ వాయువుల్లో ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు అత్యల్ప ప్రమాణాల్లోనే ఉన్నవి. కేంద్రక సంలీనం ప్రక్రియ వలననే ఈ సౌరశక్తి జనిస్తుంది!

ఈ అత్యల్ప ప్రమాణాల ఎలక్టాన్ర్, ప్రోటాన్, న్యూట్రాన్లు క్వార్కు లాంటి అత్యంత సూక్ష్మకణాలనుండి ఉద్భవించినవని, ఈ క్వార్కులు అనంతశక్తి నుండి రూపాంతరం చెందినవే. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మగా చెప్పబడే అనంతమైన శక్తి నుండి ఉద్భవించినవేనని ఆధునిక విజ్ఞాన శాస్త్రం తెలుపుతోంది. అనంతశక్తిలోనే ఉద్భవించి, చరించి, కాలప్రమాణం ముగిసిన అనంతరం తిరిగి ఈ భౌతిక రూపాలన్నీ శక్తి రూపాన్ని పొందుతూ వస్తున్నాయి. మరోవిధంగా చెప్పుకుంటే జీవి తన ప్రాణం కోల్పోయిన తర్వాత దహించ బడితే, ఆ శరీరం కొంత ఉష్ణం, కొంత వాయువు, కొంత నీటి ఆవిరి, కొంత బూడిద, కొంత కాంతిశక్తిగా విఘటనం చెందుతుంది. అవే పంచభూతాలని మనకు తెలుసు.

– గిరిధర్‌ రావుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement