జీవితంతో ఆమె చాలాకాలం పోరాడింది. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసింది! గ్రామస్థులు రక్షించడంతో కాస్త ఊపిరి తీసుకుంది. నేడు ఊరికే ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె పేరు లతా జాదవ్. ఊరు మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని తిల్వానీ గ్రామం.
లతా జాదవ్ నడుపుతున్న కిరాణా షాపు మహిళలు కోరుకునే హక్కులకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే ‘నేను పదో తరగతి తరవాత కూడా చదువుకుని ఉంటే నా పరిస్థితి వేరేగా ఉండేది’ అంటున్నారు ఆరు పదులు నిండిన లతా జాదవ్. గ్రామంలో కిరాణా షాపు పెట్టిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందినప్పటికీ ఆమె ఈ మాటలు అనడానికి వెనుక పెద్ద కథే ఉంది.
తల్లి మాటపై పెళ్లి
రెండు దశాబ్దాల క్రితమే లత స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు! అప్పటికి లత తల్లి అంగన్‌వాడీ టీచరు. వ్యవసాయ కూలీ కూడా. తండ్రి మూడు సంవత్సరాలు మిలటరీలో పనిచేసి తిరిగి గ్రామానికి వచ్చిన సమయం అది. ఆయనా ఓ పిండిమరలో పనికి కుదిరాడు. లత కూడా తన తల్లికి వదాంగే గ్రామం అంగన్‌వాడీలో సహాయానికి వెళ్లేది. కొంతకాలానికి అంగన్‌వాడీ మూత పడింది.
తండ్రి క్యాన్సర్ బారిన పడి, కన్నుమూశాడు. దానితో ఇంటి బాధ్యత లత తల్లి మీద పడింది. ‘‘మేం ఏడుగురు పిల్లలం. ఇంతమందిని చదివించడం అమ్మకి కష్టమే అయినా, చేతనైనంతవరకు మమ్మల్ని చదివించింది’ అంటారు లత. పదో తరగతి పూర్తి కాగానే, లతకు వివాహం చేయాలనుకుంది లత తల్లి. పై చదువులు చదవాలని ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి మాటపై వివాహం చేసుకుంది లత.
మెట్టినింట్లో నరకం
అత్తవారింట్లో అడుగు పెట్టిన లత, మామగారి పొలంలో ఎనిమిదేళ్లు వ్యవసాయ కూలీగా పనిచేసింది. మామగారు తాగుబోతు. వచ్చిన ఆదాయం ఆ తాగుడికి, తాగి పడ్డ గొడవలకే సరిపోయేది. ఇంత జరుగుతున్నా అత్తగారు మామగారిని వెనకేసుకొచ్చేది. లత భర్త బలాసో జాదవ్ రైతు. సొంతంగా వ్యవసాయం చేస్తూనే కూలీగానూ పనిచేసేవాడు. ఏడాదిలో ఆరు నెలల పాటు, పక్క గ్రామంలో చెరకు కోతకు వెళ్లేవాడు. అతనూ మద్యానికి బానిసై, లతను హింసించడం ప్రారంభించాడు.
తిరిగి తల్లి దగ్గరికే..!
‘‘ప్రతి రోజూ నన్ను కొట్టేవాడు. నేను పుస్తకాలు చదవడం ఆయనకు నచ్చేది కాదు. రెండు మూడుసార్లు నా కళ్లజోడు కూడా పగలగొట్టేశాడు. నేను కిరాణా షాపు పెట్టిన తరవాత, అక్కడకు వచ్చి అనేకసార్లు నన్ను జుట్టుపట్టి లాగి, షాపు నుంచి బయటకు ఈడ్చేశాడు. అతని బారినుంచి తప్పించుకోవడానికి ఒక్కోసారి నేను షాపులో తాళం వేసుకుని ఉండేదాన్ని. ఒక్కోసారి గళ్లాపెట్టిలో డబ్బులన్నీ లాక్కెళ్లిపోయేవాడు’’ అని.. నాటి రోజుల్ని తలచుకుని కన్నీటి పర్యంతం అవుతుంది లత.
ఇంత జరుగుతున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోయేసరికి తన కష్టాలను పంచాయితీ దృష్టికి తీసుకెళ్లారు లత. అక్కడా న్యాయం జరగలేదు. ఇక చేసేది లేక వదాంగేలో ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. లత పుట్టింటికి వెళ్లిన సమయంలో, ఆమె చచ్చిపోయిందని నమ్మించి, ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు! కొత్తగా వచ్చిన భార్యకు అసలు విషయం తెలియడంతో ఆమె కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది.
మారాను రమ్మని పిలిచి
లత పుట్టింట్లో ఉన్న రోజుల్లో ఒకరోజు భర్త ఆ ఊరు వచ్చి, బడిలో ఉన్న కొడుకును తీసుకెళ్లిపోయాడు! కూతురిని మాత్రం తీసుకువెళ్లలేదు. రెండేళ్లు గడిచాయి. ‘నేను మారాను. నిన్ను ప్రేమగా చూసుకుంటాను’ అని ఇంటికి తిరిగి రమ్మని బతిమాలాడు.
భర్త కపట ప్రేమను నమ్మి, లత తిరిగి భర్త ఇంటికి చేరింది. మళ్లీ అదే చేదు అనుభవం! మద్యం సేవించి తనను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ వేధింపుల్ని భరించలేక ఒకరోజు లత ఆత్మహత్య చేసుకోవాలని అరవై అడుగుల లోతు ఉన్న బావిలో దూకబోయింది. కొడుకు అది గమనించి పెద్దగా అరిస్తే ఇరుగుపొరుగు వచ్చి కాపాడారు.
వద్దంటే వద్దన్నాడు!
కొడుకు పెద్దయ్యాక సైకిల్ రిపేర్ షాపు పెట్టాడు. అప్పుడే, 1990 ప్రాంతంలో లత కిరాణా కొట్టు పెట్టాలని నిశ్చయించుకుంది. కొడుకుని వ్యవసాయం వైపు ప్రోత్సహించింది. కిరాణా కొట్టు ప్రారంభించే విషయంలో భర్త నుంచి ఎంత వ్యతిరేకించినా వచ్చినా పట్టించుకోలేదు. స్వతంత్రంగా బతకాలనే తన కల నెరవేర్చుకోడానికి లత దేనినైనా విడిచిపెట్టేందుకు ఆమె సిద్ధపడుతుందని భర్త అర్థం చేసుకున్నాడు. అలా తిల్వానీ గ్రామంలో మగవారి సహాయం లేకుండా కిరాణా దుకాణం ప్రారంభించిన మొట్టమొదటి మహిళగా నిలిచింది లత.
కొట్టు నడుపుతూ పొలం కొనుక్కుంది
లత దైనందిన జీవితం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. ఆవు, గేదెల పాలు పిండి, పేడంతా ఒక చోటకు చేర్చుతుంది. ఆ తరువాత కిరాణా దుకాణానికి Ðð ళ్లి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేస్తుంది. మళ్లీ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కిరాణా దుకాణంలో ఉంటుంది.
వారానికి మూడురోజులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాజని గ్రామానికి వెళ్లి పశువులకు దాణా తీసుకువస్తుంది. ఇప్పుడు లత కేవలం కిరాణా షాపు సొంతదారు మాత్రమే కాదు, సమీప గ్రామంలో అర ఎకరం పొలానికి రైతు కూడా. ఇక భర్త అంటారా.. గత ఏడాది జరిగిన ఒక ప్రమాదంలో మరణించాడు. ‘ఆ ఘటన జరగడానికి రెండేళ్ల ముందు నుంచీ నన్ను కొట్టడం మానేశాడు’ అని గుర్తు చేసుకుంటుంది లతా జాదవ్.
– రోహిణి
Comments
Please login to add a commentAdd a comment