ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావని, సాటిమానవుడికి చేసే అనేకమైన సేవల ద్వారా కూడా భగవంతుడికి చేరువ కావచ్చునని నిరూపిస్తోంది హరేకృష్ణ ఉద్యమం. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి స్వర్ణదేవాలయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గల∙స్వయంభూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం. రోడ్డు నెంబర్ 12లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది.
ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం స్వయంభువుగా వెలసిందని ప్రతీతి. నిజాం కాలంలో అక్కన్న, మాదన్నలు ఇక్కడకు వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెబుతారు. శివుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అందుకే లక్ష్మీనరసింహుడి విగ్రహానికి ఎదురుగా శివుడి విగ్రహం ఉంటుంది. శివుడు తపస్సు చేయగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి శివుడి శిరస్సుపై శంఖం ఉంచి దీవించాడట. అందుకే ఇక్కడి శివలింగంపై శంఖం ఉంటుంది కనుక పాంచజన్యేశ్వరుడిగా పేరు వచ్చింది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రదేశంలో అనేక అద్భుతాలు.
ఆలయ విశిష్టత
స్వయంభువనూ శ్రీ లక్ష్మి నరసింహస్వామి, పాంచజన్యేశ్వర స్వామి(క్షేత్ర పాలకుడు), రాధాగోవింద, జప ఆంజనేయస్వామి, గరుడ, పురాతన నారాయణ శాలగ్రామం (జల గర్భంలో ఉండే శిల) ఈ క్షేత్రంలో కొలువుదీరారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీవారి నందనవనం, జలపాతం, ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తూ, సందర్శకులకు భూతల వైకుంఠంలో ఉన్నామా అన్నంత అనుభూతి కలిగిస్తాయని ఆలయ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస తెలిపారు. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలోగల గండకీ నదిలో లభించిన సాలగ్రామ శిల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గర్భాలయంలోనే అరుదైన ‘జలగర్భ నారాయణ సాలగ్రామ శిల’ గా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. ప్రపంచంలోగల అతిపెద్ద సాలగ్రామ శిలల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి.
రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడో చేతిలో జపమాల ఉంటుంది. నాల్గవ చేతిలో అక్షమాల ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహుడిని చూసుకుంటూ హనుమంతుడు అపురూపంగా కనిపిస్తాడు. శ్రీచతుర్భుజ జప ఆంజనేయస్వామిని భక్తులు ముందు దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు మంత్ర పీఠంలో జపం చేసి ఆలయంలోని శ్రీ రాధా గోవిందుల అర్చామూర్తుల సుందరాకృతులను మనస్సునిండా నింపుకుని హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తన్మయత్వం పొందుతారు. తర్వాత అనంతశేషుడిపై నిల్చుని ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం క్షేత్రపాలకుడిగా ఉన్న పాంచజన్యేశ్వరుడని దర్శించుకుంటారు.
హరేకృష్ణ ఉద్యమం చేస్తున్న ఆధ్యాత్మిక, సమాజ సేవ కార్యక్రమాలలో కొన్ని...
దేవాలయానికి 10 మైళ్లు లోపు ఎవరూ ఆకలితో ఉండకూడదన్న హరేకృష్ణ ఉద్యమం వ్యవస్థాపకాచార్యులు శ్రీ శ్రీ ప్రభుపాదులవారి ఆశయానికి అనుగుణంగా సంస్థ తమ ప్రణాళికలను రూపొందించింది. విద్యార్థులు ఆకలి వల్ల చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో సంస్ధ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర తెలంగాణలో అంకురార్పణకు ఈ ఆలయమే కేంద్రస్ధానం. మరిన్ని వివరాలకు 9396956984ను సంప్రదించవచ్చునని హరేకృష్ణ ఉద్యమం తెలంగాణ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస తెలిపారు.
హరేకృష్ణ ఉద్యమం హైదరాబాద్ ఆధ్వర్యంలో యవతకి స్వశక్తికరణ సదస్సులు నిర్వహించి, ప్రతి ఆదివారం భగవద్గీత ద్వారా సమాజ విలువలతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం యువతకి ప్రస్తుత ప్రపంచం వాస్తవికతలకు వేద జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో బోధిస్తుంది. అలాగే రోజువారీ జీవితంలో అనుభవించే కఠినమైన సమస్యలకు పరిష్కారాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి, జీవితంలో కుంగుబాటులను అధిగమించి, ఆత్మవిశ్వాసాలను అధిగమించటం, ఇంకా సమాజంలో ఎలా కొనసాగించాలో, ఎలా పర్యవేక్షించాలంటే ఎన్నో విషయాలకు వేదికగా మారడం ముదావహం.
లౌకిక విద్యాసంస్థలు ఈ ప్రకృతిని మన ఇంద్రియ భోగాల కోసం ఎలా ఉపయోగించుకోగలమో నేర్పుతాయి. కాని మనిషి ఎదుర్కొనే ఒత్తిడి, అసంతృప్తి, కుంగుబాటు, ఆవేదనలు, జయాపజయాలు, కీర్తి, అప్రతిష్టలు మొదలైన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనగలమని బోధించేవి మాత్రం ఆధ్యాత్మిక కేంద్రాలే. మంచి సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక బోధనలు అత్యంత ఆవశ్యకమని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి నమ్మకం. మన దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలు కావాలన్నది ఆయన తపన. మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న పరమార్థాన్ని తీర్చి, కలియుగ కల్మషాలన్నిటిని పారద్రోలడానికి దేవాలయాలు దోహదం చేస్తాయి.
ఇందుకోసమే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అనువుగా ఈ స్వర్ణదేవాలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం నుంచే అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా చిన్నారులకు సంస్కృతీ వారసత్వ పండుగ, యువతకు జానపదం, గృహస్తులకు ‘గిఫ్ట్’, గ్రామాల్లో ఆధ్యాత్మిక బోధన, దేవాలయంలో ఏడాది మొత్తం జరిపించే పండుగలతోపాటు ప్రముఖ తీర్థయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా సమాజ సేవలో భాగంగా అక్షయపాత్ర, అన్నపూర్ణ 5 రూ. భోజనం, భోజనామృతం, సద్దిమూట, అక్షయ అల్పాహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment