
అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణదేవాలయం(Golden Temple)లో దారుణం చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులపై ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ఆలయ సిబ్బందితో పాటు ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఉలిక్కిపడ్డారు.
శిరోమణి గురుద్వారా కమిటీ(Shiromani Gurdwara Committee) ప్రతినిధి ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగానే అతను దాడికి పాల్పడ్డాడు. ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులపై రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి హర్యానాకు చెందినవాడని, ఈ ఘటన అనంతరం ఆలయ సిబ్బంది అతనిని పట్టుకుని తమకు అప్పగించారన్నారు. గాయపడిన భక్తులు మోహాలీ, బఠిండా, పటియాలా నుంచి వచ్చినవారని తెలిపారు. గాయపడినవారందరినీ గురు రామ్‌దాస్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు వచ్చిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.
పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ మీడియాతో మాట్లాడుతూ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్(Darbar Sahib Complex)లోని రెండవ అంతస్థులో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆలయంలో పనిచేస్తున్న జస్బీర్ సింగ్ గుర్తించి, కిందకు రమ్మని కోరగా, అందుకు అతను నిరాకరించాడన్నారు. దీంతో జస్బీర్ సింగ్ రెండవ అంతస్థుకు వెళ్లి అతనిని కిందకు దిగాలని కోరారు. అయితే అతను వెంటనే ఒక రాడ్‌తో జస్బీర్ సింగ్‌పై దాడి చేశాడు. దీనిని చూసిన ఇతర సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో వారు కూడా గాయపడ్డారు. నిందితుడిని జుల్ఫాన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని గురుప్రీత్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య
Comments
Please login to add a commentAdd a comment