స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్!
ఆయన ఏ సినిమా తీసినా అందులో హృదయాన్ని స్ప ృశించే కథనం ఉంటుంది. ఆ సినిమా రీమేక్ గానో, డబ్బింగ్‌గానో మరో భాష సినీ ప్రేమికులను పలకరిస్తుంటుంది. దాని ద్వారా పరిచయం అయ్యే నటీనటులు లేదా సాంకేతిక నిపుణులు తర్వాత సినీ పరిశ్రమకే వరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా గుర్తుండి పోతాయి ఆయన సినిమాలు. ఆయనే భారతీ రాజా...
మద్రాస్ ప్రెసిడెన్సీలోని తేని ప్రాంతంలో ఉండే అల్లినగరంలో పుట్టిన చిన్నస్వామికి జింకలను వేటాడటం, సాహిత్యం చదవడం చాలా ఇష్టం. ఆ ఊరికి పక్కనే పెద్ద అడవి. అక్కడ అతడి వేట సాగేది. వేట... సరదాను తీరిస్తే, సాహిత్యం... సృజనాత్మకతను వెలికితీసింది. సినీదర్శకుణ్ణి చేసింది. చిన్నస్వామిగా అడవిలో జింకలను వేటాడిన అతడు... భారతీరాజాగా మారి సినీ పరిశ్రమలో అనేకమంది ప్రతిభావంతులను వేటాడి పట్టుకొన్నాడు. వారి ప్రతిభకు మరింత పదును పెట్టాడు. వారిని స్టార్స్‌ని చేసి తాను స్టార్ డెరైక్టర్ అయ్యాడు!
నల్లమనుషులను, సముద్రంపై ఆధారపడి బతికే వారి యాస, భాషలను, పచ్చని ప్రకృతిని తెరపై చూపించే ప్రయత్నం చేశారు భారతీరాజా. అసలు సిసలు పల్లెలను తెరమీద ఆవిష్కరించాడు. అందుకే... దక్షిణాది సినిమా స్వరూపాన్ని మార్చేసిన దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారు భారతీరాజా.
‘పదునారు వయదునిలే’తో బాలనటి శ్రీదేవిని హీరోయిన్‌గా పరిచయం చేయడంతో బోణీ చేశారు భారతీరాజా. అది ఆయనకు కూడా తొలి సినిమానే. రెండో సినిమా ‘కిళక్కే పోగుమ్ రైల్’తో రాధికను తెరమీదికి తెచ్చారు. అదే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తెలుగు నటుడు సుధాకర్. రచయితగా, దర్శకుడిగా, హీరోగా ఒక వెలుగు వెలిగిన భాగ్యరాజా కూడా భారతీరాజా శిష్యుడే.
భారతీరాజా దగ్గర అసి స్టెంట్‌గా పనిచేస్తూ, ఆయన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలను చేస్తూ వచ్చిన భాగ్యరాజాను హీరోని చేశారు భారతీరాజా. ఆ సినిమాతోనే రతీ అగ్నిహోత్రి కూడా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళనటుడు, దర్శకుడు మణివణ్ణన్‌కి కూడా భారతీరాజాయే గురువు. ‘సీతాకోక చిలుక’ తమిళ వెర్షన్‌తో కార్తీక్, రాధల్ని హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఆ సినిమా తెలుగు రీమేక్‌తో కార్తీక్ తెలుగు వాళ్లకు పరిచయమైతే... ముచ్చర్ల అరుణ హీరోయిన్ అయ్యింది.
ప్రసిద్ధ తమిళ గీత రచయిత వైరముత్తు కూడా భారతీరాజా కనిపెట్టిన కవే. ‘డాన్స్‌మాస్టర్’లో కమల్‌కి జోడీగా నటించిన రేఖ, ‘మంగమ్మగారి మనవడు’ తమిళ వెర్షన్ ‘మన్‌వాసనై’తో రేవతిలు హీరోయిన్లు అయ్యారు ఆయన చలువ వల్లే. ఆయన ‘నిళల్‌గల్’ సినిమాతో పరిచయం చేసిన రవి ఆ తరువాత నిళల్‌గల్ రవిగానే స్థిరపడిపోయారు. ఇంకా భానుప్రియ, సుకన్య, రంజిత, రియాసేన్, ప్రియమణి, కాజల్... వీళ్లందరి తొలి సినిమాల కెప్టెన్ కూడా భారతీరాజానే.
ఇంతమంది గొప్ప నటీనటులను వెలికి తీయడం మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను వెలికి తీయడమంటే మాటలూ కాదు. అది భారతీరాజాకు మాత్రమే సాధ్యమేమో!
ఏకలవ్యులలా ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు వసంత బాలన్, బాల, శివకుమార్ వంటి తమిళ దర్శకులు. ఇంతమంది స్టార్లనూ, డెరైక్టర్లనూ ప్రభావితం చేసిన భారతీరాజాను స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్ అనొచ్చు.
- జీవన్