సదాశివకు సగౌరవ నివాళి
స్మృతి సంచిక
సామల సదాశివ సంగీతానికి సేవ చేశారా సంగీతం సామల సదాశివకు సేవ చేసిందా చెప్పడం కష్టం. సంగీతం, సదాశివ వేరువేరు కాదు.
తెలుగులో సినిమా సంగీతం గురించి విరివిగా రాసినవారు ఉన్నారు.
దక్షిణాది సంగీతం గురించి రాసినవారూ సరే. కాని ఉత్తరాది సంగీతం గురించి తెలుగులో అందునా సామాన్య పాఠకులకు ఆసక్తి రేగేలా ఏవో ముచ్చట్లు చెబుతున్నట్టుగా రాసి, వారిని ఆ అమృతభాండాగారంలో
మునకలేయించినవారు సదాశివ. తెలుగు, హిందీ, మరాఠి, ఉర్దూ
భాషలలో ఆయనకున్న పాండిత్యం, ప్రవేశం తెలియనిది కాదు. ఉర్దూ, పారశీక కవుల గొప్పదనాన్ని, కలం విన్యాసాలను ఆయన అలుపెరగకుండా రాస్తూ ఆ తీపికరమైన రచనల కోసం కొత్త పాఠకులనే సృష్టించగలిగారు. సదాశివ ‘మలయమారుతాలు’, ‘యాది’ ఎంత ఆదరణ పొందాయో, ఆయన ప్రాణగడ్డ అయిన అదిలాబాదును ఎలా దర్శనీయమైన స్థలంగా చేశాయో అందరికీ తెలిసిందే.
అటువంటి మహనీయునికి నిజమైన నివాళి ఏమిటి?
ఇదిగో ఈ స్మృతి సంచికే.
సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ (కావలి- నెల్లూరు జిల్లా) వారు
కె.రామచంద్రమూర్తి సంపాదకత్వ సూచనలతో వెలువరించిన ఈ 1200 పేజీల మహాసంచిక తన మకుటం- ‘పరిశోధన’కు తగినట్టుగా
మహామహులు రాసిన ఉత్తమోత్తమ సంగీత, సాహిత్య, సాంస్కృతిక,
రాజకీయ పరిశోధనా వ్యాసాలతో నిండి మనసుకు మాత్రమేగాక మేధకు కూడా ఆహారం కోరే వారిని ఉక్కిరిబిక్కిరి చేసేంత స్థాయిలో ఉండి ఒక అద్భుత విందు భోజనంగా మారింది. ఒకరా ఇద్దరా? వేదుల సత్యనారాయణ శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పన్యాల జగన్నాథరావు, శ్రీరంగం నారాయణబాబు, శ్రీపాద పినాకపాణి, కొండపల్లి శేషగిరిరావు, భుజంగ
రాయశర్మ, ఆరుద్ర, తల్లావఝల శివశంకరశాస్త్రి, కవికొండల వేంకటరావు వంటి ఉద్దండులెందరో రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సింబలిస్టు ధోరణి- రోణంకి అప్పలస్వామి, తోలుబొమ్మలాటలు- కూర్మా వేణుగోపాలస్వామి, నీలగిరి పాటలు- యు.ఎ.నరసింహమూర్తి, వెంకట రామకృష్ణకవులు- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, హనుమంతరాయ చిత్రకళామందిరము- అబ్బూరి రామకృష్ణారావు, గీత గోవిందం- సి.వేదవతి, బౌద్ధంతో వికసించిన హిందీ- ఆలూరి బైరాగి వంటి వ్యాసాలు ఎన్నో
పాఠకుల జ్ఞానదాహాన్ని పరిశోధనాభిలాషను తీరుస్తాయి.
రామాయణంలో అజ్ఞాతంగా ఉండిపోయిన పాత్రగా అందరూ భావించే ఊర్మిళ గురించి కోడూరి పుల్లారెడ్డి చేసిన పరిశీలన చాలా
కుతూహలం కలిగిస్తుంది. రొమాంటిసిజం గురించి నండూరి వేంకట
రామకృష్ణమాచార్యులు రాసిన వ్యాసం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ తప్ప. చింతా దీక్షితులు గురించి మల్లాది రామకృష్ణశాస్త్రి ఏం రాస్తారో
తెలియాలంటే ఈ స్మృతి సంచికే గతి. కాళిదాస మాళవిక గురించి రాసే యోగ్యులు భుజంగరాయశర్మ కాక మరెవరు? రాయప్రోలు చెప్పిన
రాయలనాటి గాథలు ఎట్టివి? ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో సేకరించి అనువదించి గుదిగుచ్చి లక్షల రూపాయలు వెచ్చింది రాశి పోయడం అంటే మామూలు మాట కాదు. మన సాహిత్య సంస్కృతుల పట్ల భక్తి గౌరవాలు సరే ఒక రకమైన ఉన్మత్తత ఉంటేనే ఈ పర్వతసమానమైన పని సాధ్యం.
సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ తరఫున ఎన్.వి.రమణయ్య, కె.తాతిరెడ్డి కలసి గతంలో దొడ్ల రామచంద్రరెడ్డి, పి.పి.రావు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శంకరన్‌ల స్మృతి సంచికలు ఎంతో ఘనమైనవిగా, విలువైనవిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు సదాశివ స్మృతి సంచిక. ఇవన్నీ ఏ ఇంట ఉన్నా ఆ ఇంట మణులు మాణిక్యాలు ఉన్నట్టు. భావితరాల కొరకు నిధి నిక్షేపాలు ఉన్నట్టు. ఇందుకోసం పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. గిరిధర్ గౌడ్ ముఖచిత్రం బాగుంది. శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రచురణలో శ్రద్ధ ఉంది.
- సాక్షి సాహిత్యం
పరిశోధన- సామల సదాశివ స్మృతి సంచిక
వెల- అమూల్యం
ప్రతులకు: 9963500130