Memory issue
-
ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..!
గతేడాది సరిగ్గా ఇదే రోజు ఈ క్షణం ఏం చేశారో చెప్పండంటే దాదాపు చాలామందికి గుర్తుండకపోవచ్చు. అయితే ఇకపై ఈ సమస్య తీరనుంది. మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునేలా కొత్త టెక్నాలజీని రూపొందించారు. ఈమేరకు అద్వైత్పాలీవాల్ అనే యువకుడు ప్రత్యేక గాడ్జెట్‌ను తయారు చేశారు.‘ఐరిస్’ అనే ఈ పరికరానికి చాలా ప్రత్యేకతలున్నట్లు ఆయన తెలిపారు. ‘ఇది మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నిమిషం వ్యవధిలో ఫొటోలు తీస్తుంది. ఇలా తీసిన ఫొటోలను యూజర్లు వాడుతున్న డివైజ్‌లో లేదా క్లౌడ్‌లో టైమ్‌లైన్ ప్రకారం స్టోర్ చేసుకుంటుంది. ఇది కృత్రిమమేధ సాయంతో పనిచేస్తుంది. గతంలో మాదిరి ప్రస్తుతం ఏదైనా సంఘటన జరిగితే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుంది. ఈ ‘ఐరిస్’ పరికరం ధరించేందుకు వీలుగా ఉంటుంది’ అని అద్వైత్ పేర్కొన్నారు.ఐరిస్ ఫొటోలు తీస్తున్నప్పుడు వినియోగదారులు డిస్ట్రాక్షన్(పరద్యానం)లో ఉన్నట్లు గమనిస్తే తిరిగి ట్రాక్‌లోకి రావాలని సూచిస్తుంది. గతం గుర్తుపెట్టుకోలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అద్వైత్ తెలిపారు. రోగులు, పని ప్రదేశాల్లో భద్రతకు, వృద్ధుల సంరక్షణకు ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఐరిస్‌కు సంబంధించి వ్యక్తుల గోప్యతపై అద్వైత్ స్పందించారు. ‘ప్రతి ఆవిష్కరణకు మంచి, చెడూ ఉంటాయి. జ్ఞాపకశక్తి సరిగా లేనివారికి ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఫొటో రికార్డులను ఎలా వాడుతారన్నది మాత్రం కీలకంగా మారనుంది. గోప్యతా, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో అంతిమంగా నిర్ణయించుకునేది మాత్రం వినియోగదారులే’నని అద్వైత్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ‘తప్పు జరిగింది..క్షమించండి’ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ), హార్డ్‌వేర్‌లో కొత్త ఆవిష్కరణల కోసం కేంబ్రిడ్జ్‌లో ‘హ్యాకర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆగ్మెంటేషన్ ల్యాబ్‌లో అద్వైత్ ఈ పరికరాన్ని తయారు చేశారు.I built Iris, a wearable that gives you infinite memory of your life.It takes a picture every minute, captions and organizes them into a timeline, and uses AI to help you remember forgotten details.Iris also has a focus mode. It notices when you get distracted and proactively… pic.twitter.com/fQxzpBRmIA— Advait Paliwal (@advaitpaliwal) September 24, 2024 -
జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చాలాసేపు ప్రయత్నిస్తేనేగానీ ఏదీ గుర్తుకురాదు. మరి కారణం?
మనుషులను నడిపించేదే జ్ఞాపకం. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వృద్ధాప్యం వచ్చే సరికి ఏదైనా గుర్తు చేసుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది. చాలాసేపు ప్రయత్నిస్తేనేగానీ ఏదీ గుర్తుకురాదు. మరి దీనికి కారణం మన మెదడులో మెమరీ ఫుల్ అయిపోవడమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ బాల్యం, యవ్వనం.. ఓ ట్రెజర్‌హంట్ సాధారణంగా ఒక వయసు దాటగానే ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తు చేసుకోవడానికి కష్టపడుతుంటారు. మిగతా విషయాల్లో చురుగ్గా ఉన్నవారు కూడా ఈ విషయంలో ఇబ్బందిపడుతుంటారు. ఇదేమిటన్న దానిపై హార్వర్డ్, కొలంబియా, టొరంటో యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. వివిధ దశల్లో మనిషి మెదడు తీరును పరిశీలించారు. బాల్యంలో ప్రతీది కొత్తగా, అద్భుతంగా తోస్తుందని. అనుభవంలోకొచ్చే ప్రతి విషయాన్ని ఆస్వాదించే సమయమని.. ఆ దశలోని ప్రతి జ్ఞాపకం ఇట్టే గుర్తుండిపోతుందని వారు చెప్తున్నారు. యవ్వనంలో అనుభవాలు, అనుభూతులు కూడా మెదడులో నిక్షిప్తమైపోతాయని.. అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఈ జ్ఞాపకాల దొంతరలు పెరిగిపోతాయని వివరిస్తున్నారు. వృద్ధాప్యంలో ఎందుకు? చాలా మందిలో ఒక వయసు దాటిపోయాక మెదడు శక్తి ఏమాత్రం తగ్గిపోకున్నా.. జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం మాత్రం ఇబ్బందికరంగా మారుతుంటుంది. బాల్యం నుంచీ పేరుకుపోయిన జ్ఞాపకాల దొంతరలే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. వేలకొద్దీ జ్ఞాపకాల్లోంచి మనం అనుకున్న విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకునేప్పుడు.. సదరు జ్ఞాపకాలతోపాటు, దానికి సంబంధమున్నవి కొన్ని, ఏమాత్రం సంబంధం లేనివి మరికొన్ని జ్ఞాపకాలు కూడా బయటికి (రిట్రీవ్) వస్తున్నట్టు గుర్తించారు. అలాంటి వాటిలో ఏది సరైనదని ఒక్కోసారి మెదడు గందరగోళానికి గురవుతూ ఉంటుందని తేల్చారు. కొందరు వృద్ధులపై పరిశీలన జరిపి.. శాస్త్రవేత్తలు తాము గమనించిన అంశాలను ధ్రువీకరించడానికి కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. యువత, వృద్ధుల మధ్య కొన్ని టాస్కులతో పోటీ పెట్టారు. ఇందులో విశ్లేషణ, ఇతర అంశాలకు సంబంధించి వృద్ధులు తమ అపార జ్ఞానంతో త్వరగా టాస్కులు పూర్తిచేసినట్టు గుర్తించారు. అంటే సృజనాత్మకతలో, నిర్ణయాలు తీసుకోవడంలో యువత కంటే ముందంజలో ఉన్నట్టు తేల్చారు. కానీ జ్ఞాపకశక్తికి వచ్చేసరికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకాస్త లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని చెప్తున్నారు. తమ పరిశోధన ఆధారంగా పెద్ద వయసువారు గందరగోళానికి గురికాకుండా ఉండటానికి.. వారిలో జ్ఞాపకశక్తి పెంచడానికి ఉన్న మార్గాల అన్వేషణపై దృష్టిపెట్టామని పేర్కొంటున్నారు. -
ఫొటోలు, వీడియోలతో ఫోన్ స్టోరేజ్ నిండిందా?
Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్‌లో స్పేస్ కోసం అంత టైం పట్టదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్‌వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్.. దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్‌లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు. వాట్సాప్‌లో.. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్‌లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్‌ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. క్లౌడ్ సర్వీస్.. ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్లిమిటెడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్‌తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి. ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్స్‌పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్‌లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది. -
Health Tips: జంక్‌ఫుడ్ తింటున్నారా? అల్జీమర్స్, డిప్రెషన్.. ఇంకా..
జంక్‌ఫుడ్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, డయాబెటిక్, రక్తపోటు, చెడ్డ కొవ్వు పేరుకుపోవడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మనందరికీ తెలిసిందే! ఐతే జంక్‌ఫుడ్ జ్ఞాపకశక్తి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వివరాలు మీకోసం.. అత్యధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారంలో ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నాలుగు వారాలపాటు వృద్ధాప్య ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపి జ్ఞాపకశక్తి కోల్పోయేలా ప్రేరేపిస్తుందట. ఐతే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలను జోడించిన జంక్‌ఫుడ్ ఇచ్చిన ఎలుకల్లో ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ తగ్గడం కూడా వీరి పరిశోధనల్లో భాగంగా కనుగొన్నారు. అంతేకాకుండా ప్రాసెస్ చేయబడిన ఆహారం వృద్ధుల్లో ఆకస్మికంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేసి.. అల్జీమర్స్‌కు దారితీసేలా చేస్తుందని ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన సైకియాట్రి, బిహేవియరల్ హెల్త్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రూత్ బారియంటోస్ కూడా పేర్కొన్నారు. మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం కూడా ఉందని, తరచుగా నిరాశకు లోనవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఏదేమైనా.. ఇటువంటి జంక్‌ఫుడ్ తీసుకున్న చిన్నవయసున్న ఎలుకల్లో ఎటువంటి కాగ్నిటివ్ సమస్యలు తలెత్తలేదని పరిశోధకులు వెల్లడించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా? -
అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!
సరిగ్గా పొద్దున్నే ఏడు గంటలకు లేవానుకుని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. ఉదయం అది మోగగానే దాని పీకనొక్కేసి మళ్లీ దుప్పట్లో దూరిపోతున్నారా అయితే మీ మెదడును మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లేనని ఇటీవల వైద్యులు తేల్చి చెప్పారు. అలారాన్ని తాత్కాలికంగా ఆపేసి మరో 10 నిమిషాలు పడుకుందాంలే అనుకుని పడుకోవడం భ్రమ మాత్రమేనట. నిజానికి మన మెదడు అలారం మోతతో మెలకువకు సిద్ధమయ్యాక తిరిగి వెనక్కి వెళ్లడం నిద్రావస్థ సైకిల్‌కు భంగం చేకూరుస్తుందని, అదే ఆనాటి మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇలా అలారం మోగగానే సినిమాల్లో లాగా దాని తలపైన ఒక్కటిచ్చి తిరిగి పడుకోవడం అలవాటుగా మారిందంటే దీర్ఘకాలంలో దాని దుష్ఫలితాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ఖాయమంటున్నారు వైద్యులు. ఉత్సాహాన్ని ఊదేసే స్లీప్ ఇనర్షియా.. నిద్రలేమి బీపీ, జ్ఞాపక శక్తి తగ్గడం తదితర అనేక శారీరక, మానసిక ఆనారోగ్యాలకు కారణమౌతుంది. కంటినిండా నిద్రపోతే మరునాడు మీలో ఉత్సాహం పొంగిపొర్లుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అదే నిద్రనుంచి మేల్కొనడానికి అలారం పెట్టుకొని దాన్ని తాత్కాలికంగా ఆపేసి, తిరిగి ముడుచుకొని పడుకుందామనుకుంటే మాత్రం అది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం వల్ల నిద్రాభంగం అవుతుందే తప్ప తిరిగి నిద్రలోకి జారుకోవడం అంటూ ఉండదని స్లీప్ ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. అలారాన్ని ఆపేసి పడుకోవడంతో మీ శరీరం, మీ మెదడు పడుకోవాలో, మేల్కోవాలో అర్థం కాని స్థితిలోకి వెళ్తుందట దాన్నే నిద్రలో నిద్ర (స్లీప్ ఇనర్షియా) అంటారు. ఈ స్థితి రోజంతా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిద్ర మేల్కోవడానికి ఆ పదినిముషాలూ బద్ధకించడం వల్ల ఉత్సాహానికి బదులు ఆ రోజంతా బద్ధకాన్ని కొనితెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిద్రలో రెండు దశలు మన నిద్ర రెండు భాగాలుగా ఉంటుంది. తొలి పార్శ్వం కనుగుడ్లు కదలకుండా(నాన్రాపిడ్ ఐ) ఉండే నిద్ర. రెండవ భాగం కనుగుడ్లు వేగంగా కదిలుతుండే (రాపిడ్ ఐ) నిద్ర. కనుగుడ్లు కదలకుండా ఉండే నిద్ర నుంచి కనుగుడ్లు కదిలే నిద్ర రెండూ రాత్రంతా ఒక సైకిల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే నిద్రపట్టిన వెంటనే వచ్చే స్థితిలో కనుగుడ్ల కదలిక ఉండదు. ఇది దీర్ఘ నిద్రను సూచిస్తుంది. ఆ తరువాత వచ్చే నిద్రావస్థలో మాత్రం కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. ఇది మెలకువ స్థితిలో ఉండే నిద్ర. మంచి నిద్రపట్టడం అంటే ఈ లయబద్ధమైన నిద్రావస్థకి భంగం వాటిల్లలేదని అర్థం. అలాకాకుండా మెలకువకోసం పెట్టుకున్న అలారం మోగిన వెంటనే లేవకుండా తిరిగి నిద్రపోవడం శారీరక మానసిక సహజక్రియని అడ్డుకుంటున్నట్లే. -
సదాశివకు సగౌరవ నివాళి
స్మృతి సంచిక సామల సదాశివ సంగీతానికి సేవ చేశారా సంగీతం సామల సదాశివకు సేవ చేసిందా చెప్పడం కష్టం. సంగీతం, సదాశివ వేరువేరు కాదు. తెలుగులో సినిమా సంగీతం గురించి విరివిగా రాసినవారు ఉన్నారు. దక్షిణాది సంగీతం గురించి రాసినవారూ సరే. కాని ఉత్తరాది సంగీతం గురించి తెలుగులో అందునా సామాన్య పాఠకులకు ఆసక్తి రేగేలా ఏవో ముచ్చట్లు చెబుతున్నట్టుగా రాసి, వారిని ఆ అమృతభాండాగారంలో మునకలేయించినవారు సదాశివ. తెలుగు, హిందీ, మరాఠి, ఉర్దూ భాషలలో ఆయనకున్న పాండిత్యం, ప్రవేశం తెలియనిది కాదు. ఉర్దూ, పారశీక కవుల గొప్పదనాన్ని, కలం విన్యాసాలను ఆయన అలుపెరగకుండా రాస్తూ ఆ తీపికరమైన రచనల కోసం కొత్త పాఠకులనే సృష్టించగలిగారు. సదాశివ ‘మలయమారుతాలు’, ‘యాది’ ఎంత ఆదరణ పొందాయో, ఆయన ప్రాణగడ్డ అయిన అదిలాబాదును ఎలా దర్శనీయమైన స్థలంగా చేశాయో అందరికీ తెలిసిందే. అటువంటి మహనీయునికి నిజమైన నివాళి ఏమిటి? ఇదిగో ఈ స్మృతి సంచికే. సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ (కావలి- నెల్లూరు జిల్లా) వారు కె.రామచంద్రమూర్తి సంపాదకత్వ సూచనలతో వెలువరించిన ఈ 1200 పేజీల మహాసంచిక తన మకుటం- ‘పరిశోధన’కు తగినట్టుగా మహామహులు రాసిన ఉత్తమోత్తమ సంగీత, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ పరిశోధనా వ్యాసాలతో నిండి మనసుకు మాత్రమేగాక మేధకు కూడా ఆహారం కోరే వారిని ఉక్కిరిబిక్కిరి చేసేంత స్థాయిలో ఉండి ఒక అద్భుత విందు భోజనంగా మారింది. ఒకరా ఇద్దరా? వేదుల సత్యనారాయణ శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పన్యాల జగన్నాథరావు, శ్రీరంగం నారాయణబాబు, శ్రీపాద పినాకపాణి, కొండపల్లి శేషగిరిరావు, భుజంగ రాయశర్మ, ఆరుద్ర, తల్లావఝల శివశంకరశాస్త్రి, కవికొండల వేంకటరావు వంటి ఉద్దండులెందరో రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సింబలిస్టు ధోరణి- రోణంకి అప్పలస్వామి, తోలుబొమ్మలాటలు- కూర్మా వేణుగోపాలస్వామి, నీలగిరి పాటలు- యు.ఎ.నరసింహమూర్తి, వెంకట రామకృష్ణకవులు- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, హనుమంతరాయ చిత్రకళామందిరము- అబ్బూరి రామకృష్ణారావు, గీత గోవిందం- సి.వేదవతి, బౌద్ధంతో వికసించిన హిందీ- ఆలూరి బైరాగి వంటి వ్యాసాలు ఎన్నో పాఠకుల జ్ఞానదాహాన్ని పరిశోధనాభిలాషను తీరుస్తాయి. రామాయణంలో అజ్ఞాతంగా ఉండిపోయిన పాత్రగా అందరూ భావించే ఊర్మిళ గురించి కోడూరి పుల్లారెడ్డి చేసిన పరిశీలన చాలా కుతూహలం కలిగిస్తుంది. రొమాంటిసిజం గురించి నండూరి వేంకట రామకృష్ణమాచార్యులు రాసిన వ్యాసం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ తప్ప. చింతా దీక్షితులు గురించి మల్లాది రామకృష్ణశాస్త్రి ఏం రాస్తారో తెలియాలంటే ఈ స్మృతి సంచికే గతి. కాళిదాస మాళవిక గురించి రాసే యోగ్యులు భుజంగరాయశర్మ కాక మరెవరు? రాయప్రోలు చెప్పిన రాయలనాటి గాథలు ఎట్టివి? ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో సేకరించి అనువదించి గుదిగుచ్చి లక్షల రూపాయలు వెచ్చింది రాశి పోయడం అంటే మామూలు మాట కాదు. మన సాహిత్య సంస్కృతుల పట్ల భక్తి గౌరవాలు సరే ఒక రకమైన ఉన్మత్తత ఉంటేనే ఈ పర్వతసమానమైన పని సాధ్యం. సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ తరఫున ఎన్.వి.రమణయ్య, కె.తాతిరెడ్డి కలసి గతంలో దొడ్ల రామచంద్రరెడ్డి, పి.పి.రావు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శంకరన్‌ల స్మృతి సంచికలు ఎంతో ఘనమైనవిగా, విలువైనవిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు సదాశివ స్మృతి సంచిక. ఇవన్నీ ఏ ఇంట ఉన్నా ఆ ఇంట మణులు మాణిక్యాలు ఉన్నట్టు. భావితరాల కొరకు నిధి నిక్షేపాలు ఉన్నట్టు. ఇందుకోసం పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. గిరిధర్ గౌడ్ ముఖచిత్రం బాగుంది. శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రచురణలో శ్రద్ధ ఉంది. - సాక్షి సాహిత్యం పరిశోధన- సామల సదాశివ స్మృతి సంచిక వెల- అమూల్యం ప్రతులకు: 9963500130