![Junk Food Harms Your Memory A New Study Reveals - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/16/Junk-Food.jpg.webp?itok=je84JlZN)
జంక్‌ఫుడ్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, డయాబెటిక్, రక్తపోటు, చెడ్డ కొవ్వు పేరుకుపోవడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మనందరికీ తెలిసిందే! ఐతే జంక్‌ఫుడ్ జ్ఞాపకశక్తి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వివరాలు మీకోసం..
అత్యధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారంలో ఇన్‌ఫ్లమేటరీ కారకాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నాలుగు వారాలపాటు వృద్ధాప్య ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపి జ్ఞాపకశక్తి కోల్పోయేలా ప్రేరేపిస్తుందట. ఐతే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలను జోడించిన జంక్‌ఫుడ్ ఇచ్చిన ఎలుకల్లో ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ తగ్గడం కూడా వీరి పరిశోధనల్లో భాగంగా కనుగొన్నారు.
అంతేకాకుండా ప్రాసెస్ చేయబడిన ఆహారం వృద్ధుల్లో ఆకస్మికంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేసి.. అల్జీమర్స్‌కు దారితీసేలా చేస్తుందని ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన సైకియాట్రి, బిహేవియరల్ హెల్త్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రూత్ బారియంటోస్ కూడా పేర్కొన్నారు. మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం కూడా ఉందని, తరచుగా నిరాశకు లోనవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు.
ఏదేమైనా.. ఇటువంటి జంక్‌ఫుడ్ తీసుకున్న చిన్నవయసున్న ఎలుకల్లో ఎటువంటి కాగ్నిటివ్ సమస్యలు తలెత్తలేదని పరిశోధకులు వెల్లడించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment