తండ్రి సాక్షాత్తూ విష్ణుస్వరూపుడు | story about father and he's greatness | Sakshi
Sakshi News home page

తండ్రి సాక్షాత్తూ విష్ణుస్వరూపుడు

Published Sat, Mar 18 2017 11:57 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

తండ్రి సాక్షాత్తూ  విష్ణుస్వరూపుడు - Sakshi

తండ్రి సాక్షాత్తూ విష్ణుస్వరూపుడు

మార్కండేయ మహర్షి కోసం మృకండుడు ఎంత తపస్సు చేసాడో చెప్పడానికి మాటలు చాలవు. ద్రోణాచార్యు లవారు అశ్వత్థామను పొందడానికి పరమశివుడిని గురించి తపస్సు చేశాడు.

దుష్టుడైన కుమారుడు పుడితే అంతకుముందు పుణ్యం చేసుకున్న ఏడు తరాల పితృదేవతల్ని కిందకు లాగేస్తాడంటుంది దేవీ భాగవతం. అందుకే భార్య గర్భంతో ఉన్నప్పుడు గర్భ సంస్కారాలు చేస్తారు. ఆ గర్భంనుంచి వచ్చే జీవుడు ఎవడు, ఎటువంటివాడొస్తున్నాడో తెలియదు. ఒక్కొక్కసారి శత్రువు కూడా పుత్రుడిగా వస్తాడు, బాధపెట్టడానికి. కొడుకుగా వచ్చి ఏ మాటా వినడు. తండ్రిని ఏడిపించడమే తన ఉద్దేశం అన్నట్లు వస్తాడు. లోపల ఉన్న జీవుడు ఏ సంస్కారంతో వస్తాడో తెలియదు కాబట్టి వాడిని సంస్కరించడం కోసమే గర్భ సంస్కారాలొచ్చాయి. ఒకవేళ అవన్నీ చేయలేకపోతే, కనీసం శ్రీరామాయణాన్నంతటినీ వింటారు. గర్భిణీ స్త్రీ అలా వింటే ఆమె సమస్త సంస్కారాలు పొందినట్లు లెక్క. దానివలన ఉత్తముడైన వాడు, వంశానికి కీర్తి తెచ్చే కొడుకు పుడతాడు. అది కూడా చేయలేని పక్షంలో బాలకాండలో చెప్పిన షణ్ముఖోత్పత్తి, శ్రీ మద్భాగవతం దశమ స్కందంలోని కృష్ణలీలలు వినమన్నారు. అవి రెండూ విన్నాకూడా ఉత్తముడైన కుమారుడు జన్మిస్తాడంటుంది శాస్త్రం.

కాబట్టి పుట్టేటప్పుడే కుమారుడు మంచివాడు పుట్టాలనీ, పుత్ర సంతానం కలిగితే దానివలన తాను పున్నామ నరకాన్ని పోగొట్టుకోవచ్చన్న ఆర్తితో తండ్రి కుమారుణ్ణి కంటాడు. కుమారుణ్ణి పొందడానికి తండ్రి ఎంత ఆర్తి పొందుతాడన్నది పురాణాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మార్కండేయ మహర్షికోసం మృకండుడు ఎంత తపస్సు చేసాడో! ద్రోణాచార్యులవారు అశ్వత్థామను పొందడానికి పరమశివుడిని గురించి తపస్సు చేసిన ప్రదేశం ఇప్పటికీ ఉంది. డెహ్రాడూన్‌నుంచి ముస్సోరీ  వెడుతుంటే మధ్యలో ఒక పెద్ద  పర్వత గుహ, అందులో ఒక అద్భుతమైన శివలింగం, దాని ముందు ద్రోణాచార్యులవారు కూర్చుని తపస్సు చేసుకున్న అరుగు మనకు కన్పిస్తాయి. సంతానాపేక్ష కలిగిన వారు ఆ క్షేత్రాన్ని ప్రత్యేకంగా దర్శిస్తుంటారు. శ్రీకాకుళంలో శ్రీముఖలింగం ఎంత గొప్పదో అశ్వత్థామ కోసం ద్రోణాచార్యులవారు తపస్సు చేసిన క్షేత్రం కూడా అంత గొప్పది. సంతానాన్ని పొందడానికి తండ్రి వీర్యం కారణమయింది కనుక తండ్రి బ్రహ్మ అంశను పొంది ఉన్నాడు.

తండ్రి సాక్షాత్‌ విష్ణు స్వరూపుడు. ఎందుచేత అంటే– విష్ణువు సర్వజగద్రక్షకుడు. రక్షణ అనేమాట ఎప్పుడు అన్వయించినా సరే, అది విష్ణువుకే అన్వయమవుతుంది. దానర్థం కేవలం విష్ణువే రక్షిస్తాడని, బ్రహ్మ, శివుడు రక్షించరనేది నా ఉద్దేశం కాదు. సాధారణంగా రక్షణ అనేది విష్ణువుపరంగానే ఉంటుంది. జాగృదావస్థకు అంతటికీ కూడా ఆధిపత్యం శ్రీమహావిష్ణువుదే. అందుకే నిద్ర లేచినప్పుడు నోటివెంట ఒక నామమే రావాలి. వేరొకటి రాకూడదు. మీరు ఏ సంప్రదాయంలో ఉన్నా, ఎవరిని ఆరాధించినా నిద్రలేవగానే నోటివెంట మూడుమార్లు ప్రకటనంగా వైఖరీవాక్కుగా రావలసిన మాట ’శ్రీహరీ’, ’శ్రీహరీ’, ’శ్రీహరీ’ అనే నిద్ర లేవాలి.

ఎందుకలా అంటే– మనసు నిద్రలేచినప్పుడు ఇంద్రియాలన్నీ కూడా నిద్ర లేస్తాయి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నాలుక రుచి, ముక్కు వాసన, చర్మం స్పర్శ ఇలా వేటి పనులను అవి మొదలుపెడతాయి. ఐదు ఇంద్రియాలకు  వాటి పనులు అవి సక్రమంగా నిర్వర్తించడానికి పరమేశ్వరుడు శక్తి  ఇచ్చాడు కదా! ఇంద్రియాలను మాత్రం ఇచ్చి కేవలం వాటి శక్తిని ఆయన వెనక్కి  తీసేసాడనుకోండి.. అప్పుడు ‘సుఖము’, ‘దుఃఖము’ అనే రెండు మాటలుంటాయా లోకంలో..? ఆలోచించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement