చేతులెలావచ్చాయో.. | father killed son angry on wife | Sakshi
Sakshi News home page

చేతులెలావచ్చాయో..

Published Tue, Sep 12 2017 11:42 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

చేతులెలావచ్చాయో.. - Sakshi

చేతులెలావచ్చాయో..

భార్యపై కోపం.. కొడుక్కి శాపం
ముక్కుపచ్చలారని బాలుడిని చిదిమేసిన తండ్రి
ఇల్లాలు కాపురానికి రావడం లేదనే ఘాతుకం
తిరుమలగిరి మండలం కొంపెల్లిలో దారుణం
నిందితుడి అరెస్ట్‌.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు


మద్యం మత్తు అతడిని రాక్షసుడిగా మార్చింది. భార్య కాపురానికి రావడం లేదని కక్ష పెంచుకున్నాడు.. పూటుగా మద్యం సేవించి ముక్కుపచ్చలారని కుమారుడిని తల్లి నుంచి వేరు చేసి వెంట తీసుకెళ్లాడు.. కడుపున పుట్టిన కొడుకనే కనికరంకూడా లేకుండా గొంతు నులిమి చిదిమేశాడు.. అనంతరం మృతదేహాన్ని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఈ దారుణ ఘటన నల్ల గొండ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నాగర్జునసాగర్‌/తిరుమలగిరి :  
జిల్లాలోని తిరుమలగిరి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన బయ్యా రవికి ఇదే గ్రామానికి చెందిన నాగమణితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు సాయికుమార్‌ (6), వైష్ణవి(4) సంతానం. రవి ఇదే గ్రామంలో కిషన్‌ అనే రైతు వద్ద వ్యవసాయ పాలేరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అనుమానంతో..
ఐదేళ్ల వరకు సాఫీగా సాగిన వీరి సంసారంలో అనుమానంచిచ్చురేపింది. అప్పటి నుంచి రవి తాగుడుకు బానిసగా మారి నిత్యం భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం గ్రామంలో జరిగిన గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలో రవి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆపై భార్యతో తగాదా పెట్టుకుని చితకబాదాడు. చిత్రహింసలకు తట్టుకోలేకపోయిన నాగమణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

నిత్యం పూటుగా తాగుతూ..
భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి రవి పనికి కూడా వెళ్లడం లేదు. ఇంటి వద్దనే ఉంటూ నిత్యం మద్యం సేవిస్తూ గడుపుతున్నాడు. అయితే పలుమార్లు భార్యను ఇంటికి రమ్మని పిలిచినా రాకపోవడంతో రాక్షసుడిగా మారిపోయాడు.

ఆదివారం సెలవు కావడంతో..
రవి కుమారుడు సాయికుమార్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సాయికుమార్‌ సాయంత్రం అమ్మమ్మ ఇంటి వద్దే స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఇది రవి గమనించాడు. కారపొట్లం ఇప్పిస్తానని కుమారుడిని వెంట తీసుకుని తాను పాలేరుగా పనిచేస్తున్న వ్యవసాయ భూమి వైపు వెళ్లాడు.

గొంతు నులిమి.. బావిలోకి తోసేసి..
మద్యం మత్తులో కుమారుడిని వెంట తీసుకెళ్లిన రవి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. భార్యపై ఉన్న కోపాన్ని కుమారుడిపై చూపుతూ కొడుతుండడాన్ని సమీపంలోనే పనిచేస్తున్న మరో పాలేరు గమనించాడు. కుటుంబ తగాదాల్లో జోక్యం ఎందుకనే ఉద్దేశంతో దూరంగా వెళ్లి పనిచేసుకుంటున్నాడు. అయితే, మద్యం మత్తులో ఉన్న రవి కుమారుడి గొంతు నులిమి ఊపిరి తీసేశాడు. ఎక్కడ బయట పడుతుందోనన్న ఆందోళనతో బావిలోకి తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మిన్నంటిన రోదనలు
కుమారుడి మృతదేహాన్ని చూసిన నాగమణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న బాలుడు విగతజీవిగా మారడంతో సాయికుమార్‌ అమ్మమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఘాతుకానికి ఒడిగట్టిన తండ్రి రవికి శాపనార్థాలు పెట్టారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ కుర్మయ్య పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రవిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం సాయంత్రమే కోర్టులో హాజరుపరిచినట్టు హాలియా సీఐ పార్థసారథి తెలిపారు.  

కాటేసి.. కనిపించడం లేదంటూ..
కొద్ది సేపటి తర్వాత గ్రామానికి వచ్చిన రవి తన కుమారుడు కనిపించడం లేదని గ్రామస్తులకు తెలిపాడు. అప్పటికే గుమిగూడిన గ్రామస్తులు చర్చించుకుంటుండగానే రవి పనిచేసే చోటే పాలేరుగా పనిచేస్తున్న వ్యక్తి అక్కడికి వచ్చి కాసేపటి క్రితం వరకు రవి, సాయికుమార్‌ వ్యవసాయ బావి వద్దే ఉన్నారని, బాలుడి గొంతు నులుముతుండగా తాను గమనించానని పేర్కొన్నాడు. అక్కడే ఉన్న రవిని గ్రామస్తులు అనుమానంతో పట్టుకుని విచారించగా తానే ఘాతుకానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అప్పటికే చీకటి కావడంతో గ్రామస్తులు, పోలీసులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మోటార్లతో నీటిని తోడారు. తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement