
‘పడయప్ప (నరసింహ) సినిమాలోని నీలాంబరి పడయప్పను సవాల్ చేస్తుంది. అలాగని ఆమె స్త్రీవాద ప్రతినిధేమీ కాదు. విలన్‌గా కనిపించిన మహిళ. సమాజంలో స్త్రీని చూసే కోణానికి ప్రతీక ఆ భూమిక. ఆడవాళ్లను చూసే విధానం మారినప్పుడే వాళ్లను చిత్రీకరించే తీరు మారుతుంది. చిత్రీకరించే తీరు మారినప్పుడే వాళ్ల పట్ల సమాజం దృష్టీ మారుతుంది’
ఒక పోస్ట్‌కార్డ్ మీద ప్రింట్ అయిన మ్యాటర్ అది. ఎవరికి పోస్ట్ చేశారు ఆ కార్డ్‌ను? ‘పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్’కు! ఇదొక ప్లాట్‌ఫామ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిల్పకారులు, ఆర్కిటెక్ట్స్, డాన్సర్స్, సంగీతకారులు, జర్నలిస్టులు, ఎన్‌జీవోల నుంచి ఈ పోస్ట్‌కార్డులను ఆహ్వానిస్తోంది ఆ ప్రాజెక్ట్. వాళ్లు ఆచరించే సిద్ధాంతాలు లేదా విశ్వాసాలు, వాళ్లు పాటించే సూత్రాలు, చేస్తున్న పని ఇలా దేనిగురించైనా నాలుగు మాటలు రాసిన ప్రతి, వాళ్ల ఫొటోగ్రాఫ్‌తో సహా. తర్వాత ఆ మాటలను పోస్ట్‌కార్డ్ మీద ప్రింట్ చేసి.. ఆ ఫొటోను దానికి జతపరుస్తోంది ఆ ప్రాజెక్ట్.
ఎందుకు?
‘చేయడానికి చాలా పనులుంటాయి.. ప్రతి పని మానసిక వికాసాన్నిస్తుంది.. ఆరోగ్యంగా బతకడానికి అది చాలా అవసరం.. ఇవన్నీ ఇమిడి ఉన్న విశాల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయాలన్నదే ఈ పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్ వెనకున్న ఉద్దేశం. బహుముఖ ప్రజ్ఞను నమ్ముతాన్నేను. ఆ దిశగా ఈ తరం తర్ఫీదు కావాలనీ ఆశపడ్తున్నాను. దాన్ని సాధించడానికే ఈ పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్’ అంటోంది దీన్ని ప్రారంభించిన ప్రియాంక ఉలగనాథన్.
ఎలా?
ఈ పోస్ట్‌కార్డ్‌లన్నిటినీ పిల్లల దగ్గరకు తీసుకెళ్లి.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రంగాల్లో ఎంత మంది కృషి చేస్తున్నారు.. వాళ్ల పనివిధానం.. నైపుణ్యం.. జీవన శైలి.. సంస్కృతి.. కళారూపాలు .. ఇలా అన్నిటి గురించి వాళ్లకు చెప్తూ పిల్లల ఆలోచనా పరిధిని పెంచే ప్రయత్నం చేస్తోంది.
రెండున్నర నెలల కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి పలురంగాలకు చెందిన యాభై మందికి పైగా నిపుణుల నుంచి పోస్ట్‌కార్డులు అందాయి. కొంతమంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆర్థికవేత్తల నుంచీ పోస్ట్‌కార్డ్స్ అందుతున్నాయట. ఈ ప్రాజెక్ట్‌లో మరో భాగస్వామి చెన్నైకి చెందిన శిల్పి.. దీపిక. పోస్ట్‌కార్డ్ మీద తన ముఖాన్ని చిత్రించి.. ఆ ముఖం మీద మెడలను వేలాడేసిన పక్షుల పెయింటింగ్ వేసింది. మనుషుల నిర్లక్ష్యం వల్ల పక్షిజాతి ఎంత ప్రమాదంలో పడిందో చెప్పే చిత్రం అది. తమిళనాడులోని కూడంకుళమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద పనిచేసిన ఫొటోగ్రాఫర్ అమృతారాజ్ స్టీఫెన్ ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉంటోంది.
ఆమె ఈ పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్‌కు ఒక పోస్ట్‌కార్డ్‌ను పంపారు. కూడంకుళమ్ న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌కు రష్యా అందిస్తున్న సాంకేతిక మద్దతును ఆపేయాలని విన్నవిస్తూ రష్యన్ అంబాసిడర్‌కు కుడంకుళం పిల్లలు రాసిన విన్నపాన్ని, కుడంకుళం మీద తాను తీసిన ఒక ఫొటోనూ జత చేస్తూ. ఇలా పర్యావరణం కోసం పోరాడుతున్న వాళ్ల నుంచీ పోస్ట్‌కార్డ్‌లు వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్‌కు. పిల్లల్లో సామాజిక స్పృహను కల్పించేందుకూ పోస్ట్‌కార్డ్ ఉద్యమం ఓ మాధ్యమంగా పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment