
ఆయన మహావిష్ణువు అంశావతారం. మానవులకు ఆయుర్వేదాన్ని అనుగ్రహించినవాడు. సకల దేవతలు, దైత్యులు కలిసి చేసిన సముద్రమథనంలో చివరిగా అమృతం వెలువడింది. ఆ అమృత కుంభాన్ని తీసుకుని వచ్చిన దివ్యపురుషుడు ధన్వంతరి. ఆయన సముద్రం నుండి వస్తున్నప్పుడు దశదిశలా వెలుగు విరజిమ్మింది. ఆయన సింహం వంటి పరాక్రమశాలి. సాక్షాత్తూ విష్ణుస్వరూపుడిగా భాసిల్లుతున్న ఆయనే శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు ఆయన అంశావతారంగా ద్వాపరయుగంలో కాశీరాజు ధన్వుని కుమారుడిగా పుట్టి ఆయుర్వేద దేవుడిగా పేరు పొందిన ధన్వంతరి. ఆయన దేవవైద్యుడు.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు సమీపంలో సోమనాథపురమనే ఒక ఊరుంది. అక్కడ కేశవదేవాలయమనే త్రికూట దేవాలయం ఉంది. హొయ్సళరాజులకాలంలో నిర్మించబడిన అత్యద్భుతశిల్పకళ ఆ ఆలయం సొంతం. ఆ ఆలయం చుట్టూ అలంకరించబడిన అనేక వైష్ణవ శిల్పాలలో ధన్వంతరి విగ్రహం విశేషమైనది. ఈ శిల్పం ఆసీనస్థితిలో ఉంటుంది. కుడిచేతిలో అమృత కలశాన్ని, ఎడమచేతిలో ఔషధమూలికలను కలిగి ఉంటుంది.
శ్రీరంగం తమిళనాడులోని ప్రముఖ వైష్ణవక్షేత్రం.అంతేగాక 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. ఇక్కడి రంగనాథస్వామి ఆలయానికి వెనుకవైపు ధన్వంతరిస్వామివారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో స్వామి నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భగుడిలోని స్వామివారు నిలుచుని ఉన్న భంగిమలో ఉండి, కుడిచేతిలో అమృతకలశాన్ని, ఎడమచేతిలో ఔషధీమూలికను పట్టుకుని, వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిస్తాడు. ధన్వంతరిని దర్శించుకుంటే దేహాన్ని బాధించే సాధారణ రోగాలేగాక నయంకాని మొండి జబ్బులనుండి కూడా ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment