వింతై వింతింతై ఈ ప్రపంచంలో కుఛ్ కుఛ్ హోతా హై | Strange the world | Sakshi
Sakshi News home page

వింతై వింతింతై ఈ ప్రపంచంలో కుఛ్ కుఛ్ హోతా హై

Published Thu, Sep 10 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

వింతై వింతింతై ఈ ప్రపంచంలో కుఛ్ కుఛ్ హోతా హై

వింతై వింతింతై ఈ ప్రపంచంలో కుఛ్ కుఛ్ హోతా హై

మడతడిపోతాడంతే!
అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు మనకు తెలుసు. మరి సూట్‌కేస్‌లో పట్టే సజీవ శరీరాన్ని చూశారా? చాన్సే లేదంటారా? అయితే ఇది చదవండి.
 ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సూట్‌కేస్‌లో కూడా దూరి తనకు తానే మడతడిపోతాడంతే! ఈ అమెరికన్ కుర్రోడి పేరు జార్జ్ ఇవాన్ లెటోర్ రోబెల్స్. ఎలాగంటే అలా మడతడిపోవడం, చర్మాన్ని ఎలాస్టిక్‌లా సాగదీయడం ఇతగాడి స్పెషాలిటీలు. అంతేకాదు, కీళ్లనూ స్థానభ్రంశం చేయించగలడు. కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చేలా చేసి, మళ్లీ వెనక్కు తీసుకోగలడు.

ఇదివరకు ఏ ఉద్యోగం చేసేవాడో గానీ, ఇప్పుడు మాత్రం ఈ ఫీట్లే ఇతగాడికి భేషైన స్వయం ఉపాధిగా మారాయి. ప్రపంచమంతా చుట్టేస్తూ ఈ ఫీట్లను ప్రదర్శిస్తున్నాడు. ఈ ఫీట్లతోనే ‘వరల్డ్స్ స్ట్రెచియస్ట్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. ఇతగాడి చర్మం ఎలాస్టిక్‌లా సాగిపోవడానికి కారణం ‘ఎహ్‌లర్స్ డాన్‌లాస్ సిండ్రోమ్’ అని, అది ఇవాన్‌కి పుట్టుకతోనే ఉందని వైద్యులు చెప్తున్నారు.
 
భౌ భౌ... డాంకీ...
 కుక్క పని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలంటారు. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో ఉండే కాల్, టామ్ దంపతులు జంతుప్రేమికులు. ఇంట్లో కుక్క, నక్క, పిల్లి, తోడేలు వంటి జంతువులను పెంచుకుంటున్నారు. కాల్ 50వ పుట్టిన రోజుకి ఈ గాడిద గిఫ్ట్‌గా వచ్చింది. అప్పుడు దాని వయసు ఎనిమిది నెలలు. గాడిద కన్నా అది కుక్కలాగే ప్రవర్తిస్తుండటంతో దీనికి డాగీ అని పేరుపెట్టారు. ‘డాగీ ఒంటరిగా ఉండడానికి అస్సలు ఇష్టపడదు. రోజూ ఉదయం టామ్‌తో పాటు ఆఫీస్‌కి వెళ్తుంది. టామ్ రాసుకుంటూ ఉంటే అది టీవీలో స్పోర్ట్స్ చూస్తుంది. టెన్నిస్ అంటే చచ్చేంత ఇష్టం. ఇతర జంతువులతో కలివిడిగా ఉంటుంది. ఏ జంతువుతోనైనా ఇట్టే స్నేహం చేస్తుంది. రెండుపూటలా జాగింగ్‌కి వెళ్తుంది. తెలిసిన వాళ్లు ఇంటికొస్తే తోక ఆడించుకుంటూ వాళ్ల చుట్టూ తిరుగుతుంది’ అంటూ డాగీ గురించి మురిపెంగా వర్ణిస్తుంది కాల్. పచ్చనితోటలో పసుప్పచ్చని అడవిపూల పందిరి కింద దీనికి ఒక షెడ్ కట్టి అపురూపంగా చూసుకుంటోంది ఈ జంట. షెడ్ నుంచి నేరుగా ఇంట్లోకి రావడానికి ప్రత్యేకమైన దారి కూడా ఏర్పాటు చేశారు. అయితే డాగీ క్లోజ్‌గా ఉండే గ్రిఫ్ అనే తోడేలుకి డాగీ అంటే చచ్చేంత అసూయట. డాగీని కాల్, టామ్‌లు ముద్దు చేస్తుంటే మూతి ముప్పై వంకర్లు తిప్పుకుంటుందట. డాగీ రాజభోగానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది!
 
గ్రాండ్ బ్యాండ్
ఓల్డ్ ఈజ్ ట్రెండీ. ఏజ్ ఈజ్ ఓన్లీ అ నంబర్. ముదిమి మురిపాన్ని పంచే రెండో బాల్యం అని గ్రహించి ఆడిపాడి చిందులేస్తున్నారు జపాన్‌లో 80 పైబడ్డ బామ్మలు. ‘ఓఆఎ84’ అనే పేరుతో ఓ మ్యూజిక్ బ్యాండ్‌నీ క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్‌లోని 33 మంది బామ్మల వయసు 84 ప్లస్. ఈ గ్రూప్‌లో అత్యధిక వయసున్న బామ్మ యమాషిరోకి 97 ఏళ్లు. జపాన్ అంతటా ఈ గ్రానీస్‌కి గ్రాండ్ వెల్‌కమే. ‘ఏదో చేయాలనే తపన, కొత్తతేదో నేర్చుకోవాలనే ఆరాటం, అనుక్షణం ఆనందం అనుభవిస్తూ దాన్ని ఇతరులకూ పంచాలనే మా తాపత్రయం.. యంగ్‌స్టర్స్‌కీ ఆదర్శం’ అంటారు వీళ్లు. బామ్మలు ప్రదర్శనల కోసం ఎక్కడికి వెళ్లినా ముందు జాగ్రత్తగా బ్యాక్‌స్టేజ్‌లో బీపీ మానిటర్స్, డిఫిబ్రిలేటర్స్ (సినిమాల్లో చూసే ఉంటారు.. గుండె ఆగిపోతే షాక్ తో గుండెకు స్పందననిచ్చే పరికరం) వంటివీ రెడీగా పెట్టుకుంటారట. ఈ గ్రానీస్‌కి జపాన్‌లోని సినిమా స్టార్స్‌కున్నంత ఫాలోయింగ్ ఉందట. వీళ్లక్కెడకి వెళ్లినా కెమెరాలు ఫాలో అవుతుంటాయట. ‘అందరం కూర్చోని టీ తాగుతూ గాసిప్ మాట్లాడుకోవడమంటే మాకు చాలా ఇష్టం. మా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలాగే ఉంటున్నాం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం.. మేమంతా ఒక్కటి అన్న భావనతో ఉంటాం’ అంటారు బామ్మలు.
 కొసమెరుపు: ఈ బామ్మల్లా ఉండాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ జన్మలో ట్రై చేసుకోండి. ఒకినవాలో పుట్టండి. అక్కడున్న వాళ్ల ఆయుఃప్రమాణం ప్రపంచంలోనే ఎక్కువ.
 
కీర్తిశేషుడు లాల్ బిహారీ
చచ్చిపోయిన వాళ్లపేరు మీద రేషన్ కార్డ్ మంజూరు చేయడం, బతికి ఉన్న వాళ్లు చచ్చిపోయినట్టుగా ఓటర్ కార్డ్ క్యాన్సల్ అవడం మన దేశంలో చల్తా హై! దీనికి లాల్ బిహారీ మంచి ఉదాహరణ.ఎవరీయన? ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ ఆయన సొంతూరు. 1955లో పుట్టాడు. 1975 ప్రభుత్వ లెక్కల్లో చనిపోయాడు.

 ఎలా?: లాల్ బిహారీ తాతముత్తాతల నాటి పొలం కోసం ఆయన బంధువు ఒకాయన  ప్రభుత్వ అధికారులకు లంచిమిచ్చి లాల్‌బిహారీ మరణించినట్టుగా ప్రభుత్వలెక్కల్లో నమోదు చేయించాడు. విషయం తెలిసినప్పటి నుంచి ‘నేను చావలేదు.. బతికే ఉన్నాను మొర్రో’ అంటూ అధికారగణంతో యుద్ధమే చేశాడు. నో సక్సెస్.  

 తర్వాత?: ముల్లును ముల్లుతోనే తీయాలని గ్రహించిన బిహారీ తనకు తాను ఉత్తుత్తి అంత్యక్రియలు జరిపించుకొని అవి రికార్డుల్లో నమోదు చేయించి తన భార్యచేత వితంతు పరిహారానికి దరఖాస్తు చేయించాడు. అంతేకాదు తన పేరు వెనక మృతిక్ (అంటే కీర్తిశేషులు) అని తగిలించుకొని 1989 ఎన్నికలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి పోటీగా నిలబడ్డాడు. ఈ పోరాటానికి ఫలితం ‘లాల్ బిహారీ మరణించలేదు.. బతికే ఉన్నాడు’ అంటూ అధికారులు ప్రభుత్వ రికార్డులను మార్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement