
కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలి. ఫోలిక్ యాసిడ్ కోసం గర్భవతులు పాలకూర తినాలి. ఇలా వేర్వేరుగా తినకుండా అన్ని ప్రయోజనాలూ ఒకేదానిలో ఉండాలంటే... స్ట్రాబెర్రీ తినాలి. ఇటీవల స్ట్రాబెర్రీల వల్ల కలిగే అనేక ప్రయోజనాలపై నిర్వహించిన అధ్యయనంలో తెలిసిన అంశాలివి...
మంచి చూపు కోసం: వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుంది. ఈ సమస్యను ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ అంటుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీల్లోని విటమిన్–సి బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు.
క్యాన్సర్ నివారణ : స్ట్రాబెర్రీల్లోని యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లతో చాలా క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఈ విషయం ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురితమైంది.
గర్భవతుల కోసం: గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు... ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్‌ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం వీటి నుంచి దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment