వారి జీవితాలు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. ఉక్కిరిబిక్కిరి చేసే కష్టాల్లో కూడా వారి వ్యక్తిత్వాలు ఊరటనిస్తాయి. ‘నేటి పరాజయమే రేపటి విజయానికి సూచిక’ అనే స్ఫూర్తిని పంచుతాయి. ఓటమి ఎన్నడూ జీవితానికి ముగింపు కాదు... అన్న సత్యాన్ని చాటి చెబుతాయి. విజయం కోసం కసితో ప్రయత్నించాలనే సందేశాన్ని ఇస్తాయి. వారి తొలి ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. పలువురి హేళనకు గురయ్యాయి. అయితే ఆ అపజయాల బాటే అంతిమంగా విజయం ముంగిటకు చేర్చింది. ఈ ప్రస్థానాన్ని బట్టి వారి వైఫల్యాలను ఫెయిల్యూర్స్ గా చూడలేం. ఆ అపజయాలను విజయానికి సోపానాలుగా భావిస్తే, యువత వాటినుంచే స్ఫూర్తిని అలవరచుకోవచ్చు!
అసమర్థుడే... విజేత అయ్యాడు!
సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యమే కానీ.. చర్చిల్ వ్యక్తిగత జీవితంలో అసమర్థుడనే పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో వైఫల్యాల మధ్య 62 యేళ్ల వయసుకు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక గానీ చర్చిల్ సమర్థత ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఆరో తరగతి ఫెయిలైన ఆయనే నోబెల్ బహుతి స్థాయికి ఎదిగాడంటే ఆశ్చర్యం కలగమానదు. దీనికంతటికీ ఆయన పట్టుదల, కృషే కారణం. అందుకే ఆయన జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు.
పరాజయం అతడి పుట్టినిల్లు!
అమెరికా అధ్యక్షపీఠం అనే అంతిమ విజయం సాధించేంత వరకూ ప్రతి అధ్యాయంలోనూ లింకన్ జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలే. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని రకాలుగా ఎదురుదెబ్బలు తినగలడో అన్నిరకాలుగానూ విధి లింకన్ జీవితంలో ఆడుకుంది. అయితే వాటన్నింటికీ ఎదురునిలిచి అత్యున్నత స్థాయికి చేరగలడమే అబ్రహం లింకన్‌ను ఒక చెక్కుచెదరని ధీశాలిగా ప్రపంచం ముందు నిలిపింది.
చీకటి నుంచి పుట్టిన దివ్వె... ఇప్పుడంటే.. ఆమెను అంతా ‘నల్లకలువ’గా కీర్తిస్తున్నారు, ఆమె సంపాదనను చూసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర మీద ఆమెను టాక్ షోల రాణిగా చూస్తున్నారు కానీ.. బాల్యం నుంచి ఒక నీగ్రోగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటినీ తట్టుకొని ఈ స్థాయికి ఎదిగిందంటే.. ఓప్రా ఓరిమికి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.
ప్రపంచం తక్కువ అంచనా వేసింది...
సినిమా మేకింగ్‌కు సంబంధించి స్పీల్‌బర్గ్ సినిమాలు ఇప్పుడు ఎంతోమందికి అత్యుత్తమ గ్రంథాలు. సినిమా సక్సెస్‌కు అవి సిలబస్ లాంటివి. అదంతా ఇప్పుడు... దర్శకుడు కాక ముందు స్పీల్‌బర్గ్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ థియేటర్‌లో బీఏ చదవడానికి దరఖాస్తు చేసుకుంటే... తిరస్కరణకు గురయ్యింది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు... మూడుసార్లు! ఈ దిగ్దర్శకుడికి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి కూడా అర్హత లేదని డిసైడ్ చేసింది యూనివర్సిటీ. తనకు ఇంత అవమానాన్ని మిగిల్చిన డిగ్రీని మాత్రం ిస్పీల్‌బర్గ్ అంత తేలికగా వదల లేదు. దర్శకుడిగా మారిన ఎన్నో ఏళ్ల తర్వాత... 2002లో గ్రాడ్యుయేషన్ మీద తన కసి తీర్చుకున్నాడు.
ఒంటరిగా అడ్డంకులు దాటిన వండర్...
హ్యారీ పోటర్ సిరీస్‌తో ప్రపంచానికి ఒక మాయ ప్రపంచాన్ని పరిచయం చేసిన రౌలింగ్ ఘనతను ప్రపంచం అంత సులువుగా గుర్తించలేదు. ఈ రచనలను అచ్చొత్తించడానికి ఒక్క పబ్లిషర్ కూడా ముందుకు రాలేదు. వ్యక్తిగతంగా కూడా అనేక కష్టాలు. వైవాహికజీవితం విఫలమైంది. పిల్లలు కూడా ఆమెకు భారమే అయ్యారు. అలా డిపెండెంట్ హోదాలో ఉన్న రౌలింగ్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళల్లో ఒకరిగా నిలిచారు.
- జీవన్‌రెడ్డి
విజయవంతమైన అపజయాలు..!
Published Wed, Sep 11 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement
Advertisement