
తూనీగలా పరిగెట్టే చురుకైన విరాళికి అకస్మాత్తుగా జ్వరం. 23 రోజులు కోమాలోకి తీసుకెళ్లిన ఆ జ్వరం... 24 గంటలూ చక్రాల కుర్చీకే పరిమితమయ్యేలా చేసింది. వైకల్యం కాళ్లకే గానీ... మనసుకూ, మనిషికీ కాదని గ్రహించాక ఇక వెనుదిరిగి చూడలేదు. మోడలింగ్ చేయాలన్నది ఆమె కల. మనసుకు రెక్కలు మొలిచి... పట్టుదలను చేతుల చేతలకు ఆవాహన చేసుకుంటే... కలలకు కాళ్లొచ్చి లక్ష్యం దాకా తీసుకెళ్తాయని తెలిసింది విరాళికి. అదెలా...? ‘మిస్ ఇండియా వీల్‌చైర్ పాజెంట్’కు ఎంపిక కావడం ద్వారా!!
‘‘నీకు నువ్వు ముఖ్యం. ముందు నీ మీద నువ్వు దృష్టిపెట్టడం మొదలుపెట్టు. సమాజాన్ని మెప్పించాలని ప్రయత్నించకు. అందులోపడి నీ సంతోషాన్ని దూరంచేసుకోకు. శారీరక వైకల్యం నిజంగా వైకల్యమే కాదు. కరుణ, దయ, ప్రేమ లేకపోవడమే అసౖలైన వైకల్యం! కలల మజిలీ చేరడానికి, లక్ష్యసాధనకు శారీరక వైకల్యం అడ్డే కాదు. ఆత్మస్థయిర్యం ఎంతదూరాన్నైనా నడిపిస్తుంది. ఎన్ని అడ్డంకులనైనా ఎదిరిస్తుంది. ఎన్ని సమస్యలనైనా జయిస్తుంది.
నీ హక్కును పొందే వరకు పోరాడుతూనే ఉండు!’’ తన రైటప్ పూర్తి చేసి మళ్లీ ఒక్కసారి చదువుకుంది. సంతృప్తి, ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆ ముఖంలో! తను పంపించాల్సిన వెబ్‌సైట్‌కు పోస్ట్ చేసింది. పర్సనల్ కంప్యూటర్‌ను టర్నాఫ్ చేసి వీల్‌చైర్‌ని వెనక్కి తిప్పింది తన గదిలోకి వెళ్లడానికి ఆమె. పేరు విరాళి మోది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంటోంది. కాని అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెరిగింది.
నేపథ్యం: విరాళి వాళ్ల కుటుంబం ప్రతి యేడాది అమెరికా నుంచి ముంబై (స్వస్థలం) వచ్చేది సెలవులు గడపడానికి. అలా తనకు పధ్నాలుగేళ్ల వయసు (2006)లో కూడా ఒకసారి వచ్చింది. అది వర్షాకాలం. సెలవులు గడిపింది. మళ్లీ అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. అక్కడికెళ్లాక ఆమెలో అనారోగ్యం బయటపడింది. ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పితో జ్వరం మొదలైంది విరాళికి. పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు.‘‘ఏం పర్వాలేదు.. సీజనల్ చేంజ్ వల్ల ఇలా అయింది.
నాలుగు, ఆరు గంటలకు ఒకసారి ఈ మాత్రలు వాడండి. అంతా నార్మల్ అయిపోతుంది. భయపడొద్దు’’ అని చెప్పి పంపేశాడు డాక్టర్. ఇంటికెళ్లాక విరాళి పరిస్థితి ఇంకా దిగజారింది. అప్పుడే ఒళ్లంతా కొలిమిలా కాలిపోయేది. ఇంకో రెండుగంటలకు మంచులా చల్లబడేది. విరాళి తల్లిదండ్రులకు భయమేసింది. డాక్టర్ దగ్గరకు మళ్లీ పరిగెత్తారు. పాప కండిషన్ సీరియస్‌గా ఉంది. ఆసుపత్రిలో హడావిడి మొదలైంది. అమ్మాయి స్పృహ తప్పింది. పల్స్ పడిపోతోంది. గుండె ఆగింది.
మూడు ఎలక్ట్రక్ షాక్స్ ఇచ్చి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. కాని శ్వాస తీసుకోలేకపోతోంది. హార్ట్ మానిటర్స్‌ను అమర్చారు. బ్లడ్‌ప్రెషన్ మెషీన్ పెడుతూనే ఐసీయూలోకి మార్చారు. స్పృహ లేదు. అలా 24 గంటలు గడిచాయి. అయినా ఈ లోకంలోకి రాలేదు విరాళి. కోమా అన్నారు డాక్టర్లు. 23 రోజులు కోమాలోనే ఉంది. 24వ రోజు విరాళి బర్త్‌డే. కళ్లు తెరవకపోయినా కూతురికి పుట్టినరోజు జరపాలనుకుంది. భర్తతో చెప్పింది. సరే అన్నాడు. డాక్టర్ల అనుమతీ తీసుకుంది. అమెరికాలోని తన దగ్గరి స్నేహితులను, బంధువులను పిలిచింది.
ఆ రోజు..: విరాళికి ఇష్టమైన వంటలను వండింది. కేక్ తెచ్చారు. ఆసుపత్రిలో విరాళి గదిని డెకరేట్ చేశారు. నర్సుల సహాయంతో విరాళికి స్పాంజింగ్ చేసి కొత్త బట్టలు వేసింది. కరెక్ట్‌గా పధ్నాలుగేళ్ల కిందట ఆమె పుట్టిన సమయానికి విరాళితో కేక్ కట్ చేయించారు. విరాళిలో చిన్న కదలిక. ఆ తల్లి దృష్టిలో పడ్డా... 23 రోజుల్నించి ఇలాంటి భ్రమలు ఆమెను చాలా ఆశపెట్టాయి. అందుకే పట్టించుకోలేదు. కాని పడుకున్న ఆ శరీరంలో మళ్లీ చిన్న కదలిక. ఈసారి ఆ తల్లి మనసు ఆత్రంగా కళ్లు చేసుకొని చేసుకొని చూసింది.
హ్యాపీ బర్త్‌డే టూ యూ విరాళీ అని పాడుతున్న స్నేహితులు, బంధువులను ‘హుష్... ’ అంటూ నోటి మీద వేలేసి చూపిస్తూ ఆపింది. అందరూ ఒక్కసారిగా ఆపేసి ఆమెనే చూశారు. ఆమె విరాళిని చూసింది. విరాళి తల తిప్పింది కుడి నుంచి ఎడమవైపు. ‘బేటా... ’ ఆనందోద్వేగంతో కేక విరాళి తల్లిది. అందరి దృష్టి అటువైపే. బిడ్డ కదిలింది. వెంటనే కళ్లూ తెరిచింది. కనుబొమలు ముడి వేసింది. ‘‘నేనురా.. అమ్మను.. ’’ ఆమెను తోసేస్తూ.. ‘‘బేటా.. మై పాపా’’వాళ్ల నాన్నా.. ఆయనను తోసేస్తూ ‘‘వీరూ బేటా.. మై చాచా’’ ఇలా అందరూ ఒకర్ని కాదని ఇంకొకరు.
విరాళిని ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విరాళీకి అలసటగా ఉంది. మళ్లీ కళ్లు మూసుకుంది. అందరిలో కంగారూ. డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు. చకచకా టెస్ట్‌లు మళ్లీ. తల్లిదండ్రుల్లో ఆందోళన ఏం చెప్తారో డాక్టర్లు అని. ‘‘అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చింది. కానీ... ’ అని ఆగారు. ‘‘కానీ ఏంటీ’’ భయంగా పేరెంట్స్. మెడ నుంచి కింద వరకు పారలైజ్ అయిపోయింది. కదల్లేదు. దాదాపు జీవితాంతం వీల్ చెయిరే’’ చెప్పారు డాక్టర్లు. కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలియని విరాళి తన బర్త్‌డేకు వచ్చిన వాళ్లందరినీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తోంది.
కలల నడక ఆగలేదు: విరాళికి మోడల్ కావాలని, సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచీ కల. దానికోసం స్కూలింగ్ అయిపోగానే ట్రైనింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. తల్లిదండ్రులూ ఆమె కోరికను కాదనలేదు. కాని ఇప్పుడు తను అసలు నడవలేదని తెలిస్తే బిడ్డ తట్టుకుంటుందా? అయినా చెప్పక తప్పలేదు. చెప్పారు.తను నడవలేదు. జీవితమంతా వీల్‌చైర్ ఆసరానే అనే నిజాన్ని విరాళీకీ చెప్పారు. షాక్ అయింది. ఆ షాక్‌లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. డిప్రెషన్‌తో కుంగిపోయింది.
మళ్లీ దానికి ట్రీట్‌మెంట్ / మాత్రలు... హాస్పిటల్.. విసుగొచ్చింది విరాళికి. ఇది కాదు తన జీవితం! ఇలా బతకాలని అనుకోలేదు! మారాలి! ఇంకొకరి సానుభూతితో ఎన్నాళ్లు బతుకీడుస్తుంది? కాళ్ళు లేకపోతే ఏం? మనసుకు రెక్కలున్నాయి. మెదడుకు శక్తి ఉంది! ఎక్కడికైనా వెళ్లగలుగుతుందీ... ఏమైనా చేయగలుగుతుంది. ఆ ధైర్యం తను ఉన్న స్థితిని అంగీకరించేలా చేశాయి. తర్వాత ట్రీట్‌మెంట్‌కు శరీరాన్ని సిద్ధం సింది. కొంత కొంతగా మార్పు వచ్చింది. కాని చక్రాల కుర్చీ వీడేంతగా కాదు. మోడలింగ్.. నటన.. తన లక్ష్యం! తిరిగి ముంబైకి వచ్చేసింది. మోడలింగ్ అవకాశాలకోసం ఫోటో షూట్ మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే ఇండియాలో వికలాంగులకోసం సరైన ప్రయాణ వసతి లేదని ప్రాక్టికల్‌గా అనుభవించి, అర్థం చేసుకుంది. వాళ్ల హక్కులకోసం పోరాడ్డం ప్రారంభించింది. ఆ పోరాట ఫలితం కేరళలోని ఎర్నాకులంలో వికలాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ స్టార్టవడం. ఇంకోవైపు తన కలల సాధన పట్టాలెక్కింది. 2014లో ‘మిస్ ఇండియా వీల్‌చైర్ పాజెంట్’గా కూడా ఎన్నికైంది. అందుకే అంటుంది.. వైకల్యం శరీరానికి ఉండదు అని!
-విరాళి
Comments
Please login to add a commentAdd a comment