విభిన్నం
అర్ఘ్యా బెనర్జీని...సన్నిహితులు సరదాగా ‘ఫున్‌షుక్ వాంగ్డూ’అని పిలుస్తారు.
వాంగ్డూ?
అది ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో అమీర్‌ఖాన్ పేరు కదా! ఆ సినిమాలో చేసినట్లే, ప్రయోగాత్మకమైన,స్వేచ్ఛాయుతమైన బడికి బెనర్జీ రూపకల్పన చేశారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లాంటి పెద్ద చదువు చదివి, ‘క్రిసిల్’లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్న బెనర్జీ ఉన్నట్టుండి ‘లెవల్‌ఫీల్డ్’ పేరుతో స్కూల్ ఎందుకు మొదలు పెట్టారు?
కాస్త వెనక్కి వెళదాం.
కూతురిని మంచి స్కూల్లో చేర్పించడానికి భార్య ఆసిమాతో కలిసి చిన్నా పెద్దా స్కూళ్లన్నీ తిరిగారు అర్ఘ్యా బెనర్జీ. ఏ స్కూల్లో చూసినా ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈకాలపు స్కూళ్లలో అన్నీ ఉన్నాయి... కానీ పిల్లలకు అవసరమైనది ఏదీ లేదు! అనుకున్నారు బెనర్జీ.
ఐఐయం, అహ్మదాబాద్‌లోని టీచింగ్ మెథడాలజీస్ అంటే బెనర్జీకి ఇష్టం. అక్కడ కథలను, సినిమాలను, నిజజీవిత సంఘటనలను కాన్సెప్ట్‌లుగా బోధిస్తారు. ఉదాహరణకు ‘నాయకత్వం’ అనే అంశం మీద బోధించాల్సి వచ్చిప్పుడు ‘లగాన్’ సినిమాను ఎంచుకొని అందులోని వివిధ సందర్భాలను విశ్లేషణాత్మకంగా చెబుతుంటారు. నిర్వచనాలు, పాఠాలుగా చెప్పడం కూడా ఇలా దృశ్య ఆధారంగా చెప్పడం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. తొందరగా మెదడుకు ఎక్కుతుంది. ఇది ఆశాజనకమైన ఊహ కాదు... శాస్త్రీయంగా నిరూపణ అయిన వాస్తవం. ఇలాంటి విధానం స్కూళ్లలో ఉంటే బాగుండేది అనుకున్నారుబెనర్జీ. ఎవరో వచ్చి ఏదో చేయాలని ఎదురుచూడడం ఎందుకు? తానే ఒక స్కూలు స్థాపిస్తే? అలా మొదలైంది ‘లెవెల్‌ఫీల్డ్ స్కూల్’
పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని సూరి అనే చిన్నపట్టణంలో ‘లెవెల్‌ఫీల్డ్’ను ప్రారంభించారు బెనర్జీ. ఐఐయం-అహ్మదాబాద్‌లో చదువు పూర్తయిన తరువాత ఒక కార్పొరేట్ సంస్థలో చేరి కో-హెడ్ స్థాయికి ఎదిగారు బెనర్జీ. ఆ సమయంలో సిఏ, యంబిఏ చదివిన వాళ్లలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, తార్కిక ఆలోచనలాంటి సాధారణమైన నైపుణ్యాలు లేకపోవడాన్ని దగ్గరి నుంచి గమనించారు.
‘విద్యార్థిదశలోనే పిల్లలకు ఇలాంటివి ఎందుకు నేర్పకూడదు?’ అని ఆలోచించారు బెనర్జీ. కొత్తగా ఆలోచించడం, విశ్లేషణ, రచన..మొదలైనవి విద్యార్థులకు నేర్పడం అత్యవసరం అనుకున్నారు. తాను అనుకున్నవి తానే అమలు చేసే అవకాశం ‘లెవెల్‌ఫీల్డ్’ ద్వారా ఆయనకు వచ్చింది. ఆయన తన ఆలోచనల గురించి పేరెంట్స్‌కు మొదట చెప్పినప్పుడు, అందరూ బెనర్జీని గ్రహాంతరవాసిని చూసినంత ఆశ్చర్యంగా చూశారు. పిల్లలను కాదు.. మొదట తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలనుకొని ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు బెనర్జీ. ప్రయత్నాలు ఫలించాయి. ‘ఎంత ఎక్కువ సేపు చదివితే...అంత ఎక్కువ చదువు వస్తుంది’ అనే అభిప్రాయం నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు కూడా.
ప్రస్తుతం ‘లెవెల్‌ఫీల్డ్’లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు మార్కులతో పనిలేదు. ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. ఆడుతూ పాడుతూనే అందమైన కలలు కంటారు. ఏ కష్టం, ఒత్తిడి లేకుండానే వాటిని నిజం చేసుకుంటారు. ఆధునిక స్కూళ్లతో పోల్చితే ‘లెవెల్‌ఫీల్డ్’ ఆలోచనలు చాదస్తంగా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక మాటను గుర్తు తెచ్చుకుంటే సమాధానంతో పాటు సాంత్వన కూడా దొరుకుతుంది.
‘మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు.
పట్టించుకున్న తరువాత విమర్శిస్తారు.
ఆ తరువాత నిన్ను అనుసరిస్తారు.’
ఒక్కసారి నా బాల్యంలోకి వెళితే... ఫలానా రాజు ఎప్పుడు పదవీచ్యుతుడు అయ్యాడు? ఫలానా రాజు ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు... ఇలాంటి ప్రశ్నలతో కాలమంతా వృథా అయ్యింది అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు, జవాబులతో మనకు ఎంత
ఉపయోగం ఉంది?
- బెనర్జీ
పంచరత్నాలు...
పిల్లలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడం మీద దృష్టి పెడతారు. ఉదా: పఠన నైపుణ్యం. పిల్లలతో ఇష్టమైన కథలను చదివిస్తారు. పాఠ్య పుస్తకాలు అంటూ ప్రత్యేకంగా కనిపించవు.
ఆణిముత్యాల లాంటి పాత రచనలను పునఃకథనం చేస్తారు. తేలికైన భాషలో పిల్లలకు వాటిని చెబుతారు. ప్రాథమిక స్థాయి పిల్లలు కూడా ఈ ఓల్డ్ క్లాసిక్స్ గురించి చెప్పగలిగేలా బోధిస్తారు.
చర్చలు, వాదోపవాదాలు... ఇతర రకాల ప్రక్రియల ద్వారా అవతలి వారితో మాటామంతీ జరిపే నైపుణ్యాలను పెంచుతారు.
గణితం అంటే పిల్లలకు ఉండే సహజమైన భయాన్ని పోగొట్టి, ఆటపాటల ద్వారా ఇష్టాన్ని పెంచుతారు.
రోజూ కొన్ని సమస్యలను ఇచ్చి వాటిని పరిష్కరించమని చెబుతారు. దాన్ని ఒక అలవాటుగా మారుస్తారు. ఉదా: పిల్లలను ఆకట్టుకునే జపాన్ పజిల్స్... సుడోకు, షికాకు, కెన్‌కెన్... మొదలైనవి.
అనగనగా ఒక కొత్త బడి!
Published Mon, May 19 2014 11:00 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement