వాణిజ్యశాస్త్రం చదవలేదు... కానీ ట్రేడింగ్‌లో దిట్ట! | Suji earns a lot from stock market despite being bed ridden | Sakshi
Sakshi News home page

వాణిజ్యశాస్త్రం చదవలేదు... కానీ ట్రేడింగ్‌లో దిట్ట!

Published Thu, Nov 7 2013 11:05 PM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

Suji earns a lot from stock market despite being bed ridden

మా వారి జీతం తక్కువ. ఇల్లు గడవటమే కష్టం... ఇక పొదుపెలా? భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేగానీ గడవని రోజులివి.  ఒక్కరి ఆదాయంతో ఇల్లు గడవట్లేదు!
 
ఇలాంటి కామెంట్లు అనేక సార్లు విని ఉంటాం. ఇది ఎంతసేపూ సమస్యనే చూసేవారి పరిస్థితి. వారి ఆలోచన పరిష్కారం వైపు పోదు. ఇదే అసలు సమస్య. దీనికి సమాధానం ‘సుజాత బూర్ల’... ఎక్కువమందికి ‘సుజి’!
 
 ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ... హ్యాపీగా జీవితాన్ని గడిపేసే ఓ యువతి సుజాత. అలాంటి జీవితంలో ఓ దారుణమైన మలుపు. షిర్డి వెళ్లి వస్తుండగా పెద్ద ప్రమాదం. జీవితం తలకిందులు... ఇక లేవలేదు, నడవలేదు ! ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను కాపాడింది ఒక్కటే...ఆమె ఆలోచన దృక్పథం. సుజాత ఎప్పుడూ సమస్య గురించి ఆలోచించరు. పరిష్కారం గురించి ఆలోచిస్తారు. 2001లో ప్రమాదం జరిగి బెడ్ మీద పడ్డాక.. మొదట తన దేహస్థితిని అర్థం చేసుకుని, తన పనులు తాను చేసుకోవడం నేర్చుకున్నారు. రెండోది... విజయం గురించి పక్కన పెట్టి టెక్స్‌టైల్ జాబ్‌వర్క్ బిజినెస్ మొదలుపెట్టి తన ఆదాయంపై తను బతకడం నేర్చుకున్నారు. మూడోది... ఏ విషయంలోనూ ఎవరి సాయం అవసరం లేకుండా సర్వస్వతంత్రంగా బతకడం నేర్చుకున్నారు. దేశంలో నూటికి తొంబై మంది భయపడే షేర్లలో ఆమె ఏ శిక్షణా లేకుండా సొంతంగా నైపుణ్యం సాధించారు.
 
 షేర్లపై నమ్మకం, విజయం ఎలా?
 
 ప్రమాదం తర్వాత ఆమెలో మెదిలిన ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల మీద ఆధారపడకుండా బతకడం ఎలా అన్నదే. ఆ క్రమంలో టెక్స్‌టైల్ బిజినెస్‌లోకి వెళ్లారు. ఏడాదిలోనే అందులో చాలా ప్రగతి కనిపించింది. పని కూడా పెరిగి, రోజూ ఆఫీసుకు వెళ్లి రావడం అనేది అత్యంత కష్టమైన పనైంది. అపుడు ఆమెకు కనిపించిన మార్గం... షేర్‌మార్కెట్. తొలుత ఒక ఏడాదిన్నరపాటు దానిని అవగాహన చేసుకున్నారు.

2006లో యాభైవేలతో షేర్‌ట్రేడింగ్ మొదలుపెట్టారు. అపుడర్థమైంది షేర్లకు అందరూ ఎందుకు భయపడతారా? అని. మార్కెట్‌లో ఊహలు, భయాలు ఎక్కువ. జనం కూడా వాటికే ఆకర్షితులవుతారు. ట్రేడింగ్‌లో వందశాతం లాభాలు సాధించడం కష్టం. షేర్లంటే... ట్రేడింగే కాదు, ఇన్వెస్ట్‌మెంట్. ఒక కంపెనీ విలువ, వాటి ఉత్పత్తులు, బుక్ వాల్యూ, దాని చరిత్ర వంటి విషయాలపై సొంతంగా అవగాహన తెచ్చుకుని ఆ తర్వాత కొంతకాలంపాటు మదుపు చేయాలి.

అది కూడా తరుగుతూ ఉన్నపుడు అందులో పెట్టుబడులు పెడుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ‘‘అయితే, ఎవరికైనా స్వీయ పరిశీలన తర్వాత ఇది సాధ్యమవుతుంది’’ అన్నారామె. ఒక మంచి చరిత్ర ఉన్న కంపెనీలో ఒక పద్ధతి ప్రకారం, అవకాశం ఉన్నపుడల్లా డబ్బు పెడుతుంటే షేర్లలో లాభాలు సాధ్యం అన్నది సుజాత నేర్చుకున్న నైపుణ్యం. శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఇది అందరికీ సాధ్యమే. ప్రస్తుతం ఆమె ప్రధాన ఆదాయ వనరు షేర్లలో వచ్చే ఆదాయమే. అంతేకాదు, పరిచయస్తులకు తన అనుభవంతో ‘ఫండ్ మేనేజ్‌మెంట్’ చేస్తున్నారు. తద్వారా షేర్లలో తన డబ్బుతోనే కాదు, తన అనుభవంతోనూ ఆదాయం సంపాదిస్తున్నారు.
 
 - ప్రకాష్ చిమ్మల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement