వెరయిటీగా పాత బంగారం | Summer holidays are exhausting | Sakshi
Sakshi News home page

వెరయిటీగా పాత బంగారం

Published Wed, May 23 2018 1:11 AM | Last Updated on Wed, May 23 2018 1:11 AM

Summer holidays are exhausting - Sakshi

చూస్తుండగానే సమ్మర్‌ హాలిడేస్‌ అయిపోవచ్చాయి. సెలవల కోసం పిల్లలు ఎదురు చూసినన్ని రోజులు పట్టలేదు అయిపోవడానికి. మహా ఉంటే మరో వారం రోజులు... జూన్‌ మొదటికల్లా స్కూళ్లు తెరుస్తారు. ఆంధ్రలో అయితే, సెలవులు ఇవ్వడం కాస్త ఆలస్యం అయింది కాబట్టి, బళ్లు తెరవడం కూడా ఇంకో గుప్పెడు రోజుల తర్వాతే. అది సరే, స్కూల్‌ తెరిచేసరికే పిల్లలకు స్కూల్‌ బ్యాగ్, వాటర్‌ బాటిల్స్, లంచ్‌బాక్స్, యూనిఫారమ్, షూస్, టై, బెల్టు, బుక్స్‌ షాపింగ్‌తో పేరెంట్స్‌కు హడావుడి. కొత్తవి కొనక ఎలాగూ తప్పదు. పాతవాటినేం చేస్తారు మరి? అటకమీద పడేస్తారు. లేదంటే ఇంట్లోనే తర్వాత పుట్టిన పిల్లలకు అంటే తమ్ముళ్లకో, చెల్లెళ్లకో బలవంతాన ఇస్తారు. అంతేగా! మరింకేం చేస్తాం అంటారా?
 
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే, చిన్నారులకు కావలసిన స్కూలు సరంజామా కొనడానికి కిందా మీదా అవుతుంటే, ఇళ్లలో పని చేసే వారి పరిస్థితి ఏంటి మరి? ఎప్పుడైనా ఆలోచించారా? కారు డ్రైవర్లు, పాలు పోసి పొట్టపోసుకునేవాళ్లు, ఆకుకూరలు, కూరగాయలు అమ్మే వాళ్లు, చెత్తబండి వాళ్ల పిల్లలు, పేపర్లు, పాలప్యాకెట్లు వేసి చదువుకునే వాళ్ల సంగతి ఏమిటి మరి? పిల్లల చదువుల దగ్గర మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతున్నారేంటి అని తల పట్టుకుంటున్నారా? మరేం లేదు, మీ పిల్లల యూనిఫామ్స్, బుక్స్, స్కూల్‌ బ్యాగ్, వాటర్‌ బాటిల్, షూస్‌ వంటి వాటిలో బాగున్న వాటిని ఇంటిలో పని చేసేవారి పిల్లలకు ఇవ్వండి. వీలయితే, కొత్తవి కొనివ్వడం బెటర్‌. లేదంటే, చిన్న చిన్న చిరుగులు పడ్డవాటికి లేదా జిప్పులు పోయిన బ్యాగ్‌లకు చిన్నాచితకా రిపేర్లు చేయించి వాటిని కొనుక్కోలేని వారికి ఇవ్వండి. ఈ చిన్ని సాయమే వారిని పాఠశాలకు దూరం కాకుండా చేస్తుందేమో! స్టీలుసామాన్ల వారికో లేదా పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో ఇచ్చేసి, వాళ్లు ఇచ్చే ఓచర్లు తెచ్చుకుని, వాటిని వదిలించుకోవడానికి అంతకు పది రెట్లు ఖర్చు చేసి, పర్సుకు చిల్లులు పెట్టుకోకండి. 

ఒకవేళ ఇతరులకు ఇచ్చేంత స్తోమత లేకపోతే, పాత వాటినే, కొద్ది మార్పులతో కొత్త వాటిలా తయారు చేసే ప్రయత్నం చేయండి లేదంటే, రీ సైక్లింగ్‌కు ఇవ్వండి. ఇదంతా ఎందుకంటే, ఒక వస్తువును తయారు చేయడానికి ఎంతో ఖర్చవుతుంది. దానిని పూర్తిగా వాడుకోకుండా మధ్యలోనే పారేసి, కొత్తవి కొంటూ పోతే, ఎంత చెత్త పేరుకు పోతుంది? తద్వారా పర్యావరణానికి ఎంతముప్పు? ప్రకృతిని ప్రేమించే వాళ్లయితే, బుర్రలకు కాస్త పదును పెట్టండి పాత వాటిని ఏం చేస్తే వాటిని పర్యావరణ హితంగా మలచుకోవచ్చో... నెట్‌లో సెర్చ్‌ చేస్తే బోలెడన్ని సైట్లు ... ఉపాయాలు... ట్రై చేయండి మరి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement