ఇలా చేస్తే... వేసవిలోనూ వన్నె తగ్గదిక! | Summer Skin Care | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే... వేసవిలోనూ వన్నె తగ్గదిక!

Published Mon, Mar 14 2016 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

ఇలా చేస్తే...  వేసవిలోనూ వన్నె తగ్గదిక!

ఇలా చేస్తే... వేసవిలోనూ వన్నె తగ్గదిక!

సమ్మర్ స్కిన్‌కేర్
 
స్వేదం చిందించే వేసవిలో చర్మసంరక్షణ నిజంగా ఒక పరీక్షే. బయటకు వెళితే చుర్రుమనే ఎండకు తోడు దుమ్ము, ధూళి, వాహనాల నుండి వెలువడే కాలుష్యం గాలిలో తేలుతూ వచ్చి ముఖానికి మాస్క్ వేసినట్లు కప్పేస్తాయి. ఎప్పటికప్పుడు ఈ మలినాలను తొలగించుకోకపోతే చర్మం నల్లబడడమే కాకుండా రాష్ వస్తుంది. ఈ బాధల నుండి బయటపడి ముఖాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి స్టీమింగ్ బాగా పని చేస్తుంది. ఎండాకాలంలో ముఖానికి తరచు ఆవిరి పట్టాలి. పొడి చర్మానికి రెండు వారాలకొకసారి ఆవిరి పడితే సరిపోతుంది, జిడ్డు చర్మానికి మాత్రం వారానికొకసారి పట్టాలి.

 ఆవిరి పట్టడానికి బ్యూటీపార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్‌లో స్టీమింగ్ గాడ్జెస్ దొరుకుతాయి. వాటిలో నీళ్లు పోసి స్విచ్ వేస్తే ఒకటి రెండు నిమిషాలలోనే ఆవిరి వస్తుంది. బయటకు విడుదలయ్యే ఆవిరి నేరుగా ముఖానికి తగిలేటట్లు పట్టాలి. లేదా ఒక పాత్రలో నీరు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మందపాటి టవల్‌ను తలమీద నుండి పాత్రను కవర్ చేస్తూ కప్పుకోవాలి. నాలుగైదు నిమిషాల సేపు ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే చర్మరంధ్రాలలో ఓపెన్ అయి చేరిన దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి. టిష్యూ పేపర్‌తో కానీ మెత్తని టవల్‌తో కానీ మెల్లగా అద్దాలి. తర్వాత ఐస్ క్యూబ్‌తోగానీ, చల్లని నీళ్లతో కానీ ముఖం కడుక్కుంటే చర్మరంధ్రాలు తిరిగి యథావిధిగా మారుతాయి. ఈ సీజన్‌లో క్రమం తప్పకుండా ఆవిరి పడితే చర్మం కాంతివంతంగా ఉంటుంది.

ముఖం, మెడ భాగాలను క్లెన్సింగ్ మిల్క్‌తో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి క్లెన్సింగ్ మిల్స్ బదులుగా ఆస్ట్రింజెంట్ వాడాలి.రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని మసాజ్ ఆయిల్‌తో కానీ క్రీమ్‌తో కానీ లైట్‌గా మసాజ్ చేసుకోవాలి. వేసవిలో స్వతహాగా చర్మగ్రంధులు ఉత్తేజితమవుతాయి కాబట్టి క్రీమ్ కొద్ది మోతాదులో వాడితే సరిపోతుంది.
 
ఇంట్లోనే ఈజీగా...
చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసు కుంటే అందాన్ని ఆరోగ్యాన్ని ఏకకాలంలో కాపాడుకోవచ్చు.   కొబ్బరి నూనెలో రోజ్‌మెరీ, లావెండర్ లాంటి మీకు నచ్చిన సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచు కోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమేణా కమిలిన భాగం మామూలుగా అయిపోతుంది.
    
ఆరు టీ స్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు పొడిబారిన చర్మానికి, చేతులకి, కాళ్లకి రాస్తే సున్నితంగా తయారవుతాయి.పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, కొంచెం మస్టర్డ్ ఆయిల్ కలపాలి. పగుళ్లు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాయాలి. పది, పది హేను రోజులపాటు ఈ విధంగా చేస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.కొబ్బరి నూనెతో కాళ్లకు మర్ధనా చేసి గోరువెచ్చని నీటిలో కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాల్ని తడిలేకుండా తుడిచి పది మందారపూలు, గుప్పెడు గోరింటాకు, అరచెక్క నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి పాదాలకు పట్టించాలి. అది ఎండిన తరు వాత కడిగెయ్యాలి. చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement