సన్ ర్యాంపేజ్... స్కిన్ డ్యామేజ్ | Sun rampage Skin Damage | Sakshi
Sakshi News home page

సన్ ర్యాంపేజ్... స్కిన్ డ్యామేజ్

Published Thu, May 7 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

సన్ ర్యాంపేజ్...  స్కిన్ డ్యామేజ్

సన్ ర్యాంపేజ్... స్కిన్ డ్యామేజ్

సూర్యుడి మెత్తటి కాంతిలో తళతళలాడే మన చర్మమే, ఆయన మండిపడుతూ తన కిరణాలతో  బలంగా బాధిస్తుంటే విలవిల లాడుతుంది. సూర్యకాంతి చండప్రచండమైనప్పుడు మన చర్మాన్ని భానుడి బాదుడు నుంచి రక్షించుకొనేదెలాగో తెలిపేదే ఈ కథనం.
 
తీక్షణమైన సూర్యుడి కిరణాలతో చర్మానికి నష్టం చేకూరడం తథ్యం. నిజానికి మన చర్మంపై స్వేదగ్రంథులతో పాటు నూనె గ్రంథులూ ఉంటాయి.  మనం ఒంటిపైన బట్టలు కప్పిలేని చోట,్ల భానుడి కిరణాల తాకిడి నేరుగా పడుతూ ఉంటే ఆ నూనె ఎండిపోయి చర్మం పూర్తిగా పొడిబారిపోతుంది. దాంతో పాటు సూర్యుడినుంచి వచ్చే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాకిడితో చర్మం కమిలినట్లుగా నల్లబారిపోవడం కూడా మనందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇది చాలాకాలం పాటు జరుగుతూ పోతే మన చర్మం నిర్మాణతీరు (స్ట్రక్చర్)లోనే మార్పు వస్తుంది.

భగభగలాడే కిరణాలతో చర్మానికి హాని

చండప్రచండమైన వేడిమితో తీక్షణమైన కిరణాల వల్ల చర్మానికి అనేక రకాల నష్టాలు కలుగుతుంటాయి. వాటిలో కొన్ని...
 చర్మం పొడిబారడం: ఎండ వేడిమి వల్ల చర్మంపై ఉండే తేమంతా ఆవిరైపోతుంది. పైగా చర్మంపై ఉండే నూనె గ్రంథుల నుంచి వచ్చే స్రావాలు ఎండిపోయి వయసు కంటే ముందే చర్మంలో ముడుతలు వస్తాయి. దాంతో కొందరు కౌమారంలోనే వయసు పైబడినట్లుగా కనిపిస్తారు.
 సన్ బర్న్స్ : ఎండలోకి చాలాసేపు బయటకు వెళ్లి రాగానే చర్మం నల్లబారినట్లుగా కనిపించడం మనందరికీ అనుభవమే. తీక్షణమైన సూర్యకాంతి వల్ల తక్షణం కనిపించే ప్రభావమిది. అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై పడి చూపే ప్రభావం కారణంగా  ఇది జరుగుతుంది. ఎండకు ఎంత ఎక్కువసేపు ఎక్స్‌పోజ్ అయి ఉంటే చర్మం అంత నల్లబారుతుంది. అదే చాలాసేపు ఎండలో ఉంటే ఒక్కోసారి ఎర్రబారి ఆ తర్వాత అక్కడ చిన్న చిన్న బొబ్బల నుంచి పెద్ద పగుళ్ల వరకూ రావచ్చు.

 పీఎమ్‌ఎల్‌ఈ  (పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్) : ఇది చాలాకాలం పాటు చర్మాన్ని ఎండవేడికి ఎక్స్‌పోజ్ చేస్తూ పోవడం వల్ల కలిగే దుష్పరిణామం. ఎండవేడిమిలో చాలాసేపు ఉన్న తర్వాత దాని దుష్ర్పభావం వెంటనే కనిపించకుండా... ఆ తర్వాత 48 గంటల నుంచి 72 గంటల తర్వాత కనిపిస్తుంది. ఇందులో చర్మంపై చిన్న చిన్న పొక్కుల్లా వస్తాయి. ఇవి వచ్చాక కూడా ఎండకు వెళ్తే వాటిల్లో దురద వస్తుంది.
 ఏక్టినిక్ కెరటోసిస్: ఇది చర్మంపై వచ్చే చిన్న పొక్కు. అచ్చం మొటిమలా  అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది మచ్చలాగా కూడా కనిపించవచ్చు. ఈ మచ్చ రంగు పింక్ / పసుపు / ఎరుపు / గోధుమ (బ్రౌన్) రంగుల్లో కూడా ఉండవచ్చు.

దీంట్లో దురద దాదాపుగా ఉండదు. ఈ మచ్చలు కనిపించాక కూడా చర్మాన్ని రక్షించుకోకుండా అదేపనిగా మళ్లీ ఎండలకు వెళ్తుంటే అది చర్మక్యాన్సర్‌గా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. ఈ మచ్చలు సాధారణంగా నుదుటిపైన నల్లగా కనిపిస్తాయి. వీటిని ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అంటారు. ఎండకు వెళ్లివచ్చాక చర్మంపైన స్పర్శకు చెమటకాయల్లా గుచ్చుకున్నట్లుగా తగులుతాయి లేదా నల్లగా కనిపిస్తాయి. ఈ మచ్చను మెలాస్మా అంటారు. దీన్ని వాడుకభాషలో మంగు అంటారు. చర్మంపై ఉండే ప్రోటీన్లు తమ స్వరూపం కోల్పోయి ముడుతలు పడటం వల్ల వచ్చే వ్యాధిని ‘ఎమైలాయిడోసిస్’ అంటారు. అంచులు స్పష్టంగా కనిపించేలా ఏర్పడి, రంగుమారి కనిపించే మచ్చలను లెంటిజీన్స్ అంటారు. ఇది ఒక్కటే ఉంటే దీన్ని ‘లెంటిగో’ అంటారు.

చికిత్సలు:
 
భానుడి తీక్షణమైన కిరణాలతో వచ్చే అనేక సమస్యలకు చికిత్సలివే...  పూతమందులు: చర్మపు సమస్యలకు అవసరాలను బట్టి కార్టికోస్టెరాయిడ్ క్రీములు వాడాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా సన్‌స్క్రీన్స్ వాడటం వల్ల ఎండలో తిరగడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లో చాలావాటిని నివారించవచ్చు.

సన్‌స్క్రీన్స్ గురించి మరింత వివరంగా :
     
తీక్షణమైన ఎండలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పీఎఫ్) 40 - 50 ఉన్నవి  మేలు. పొడి చర్మం ఉన్నవారికి ఆయిల్ బేస్‌డ్ సన్‌స్క్రీన్స్ వాడటం అవసరం. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి వాటర్ బేస్‌డ్ లేదా జెల్ బేస్‌డ్ సన్‌స్క్రీలు మంచివి.
 మాయిశ్చరైజింగ్ క్రీములు: పొడి చర్మాన్ని రక్షించేందుకు వాడాల్సిన క్రీములివి.
 
ట్యానింగ్ అంటే...

 
చర్మం నల్లగా కావడాన్ని ట్యానింగ్ అంటారు. దీనికి కెమికల్ పీలింగ్ వల్ల ప్రయోజనం ఉంటుంది.
 కెమికల్ పీలింగ్: గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, ఫెరులిక్ యాసిడ్స్ వంటివి ట్యానింగ్ కోసం ఉపయోగపడతాయి.
 
చర్మరక్షణకు ఆహారం :  సూర్యుడి తీక్షణ కిరణాలతో వయసుపైబడటానికి ముందే వృద్ధాప్యం వచ్చినట్లుగా చర్మం కనిపించడాన్ని నివారించడానికి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం మేలు  విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మ జాతి పండ్లు అయిన నారింజ, కమలాలతో పాటు జామ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటివి తినాలి. ఇక కాలీఫ్లవర్ జాతికి చెందిన బ్రాకోలీ వంటివి కూడా మేనికి మేలు చేసేవే  రోజూ తగినన్ని నీళ్లు తాగడం, తాజాపండ్ల రసాలు, మజ్జిగ కూడా చర్మాన్ని జీవం ఉట్టిపడేలా చేస్తాయి. ఇవన్నీ చర్మాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి. దీంతో చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement