మట్టి గమకం
ఆమె చిత్ర కాదు. సునిధి చౌహాన్ కాదు. పాడుతా తీయగా... పార్టిసిపెంట్ కాదు. కనీసం లోకల్ స్టేజ్ సింగ్ కూడా కాదు. కానీ ఉన్నట్టుండి ఆమె లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. వేలాది ప్రశంసలు పొందుతూ ఉంది. నీళ్ల కోసం ఏదో అరుగు మీద బకెట్ పట్టుకుని ఆమె పాడిన పాట ఎవరో వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఎవరీమే అని ఆరాలు ప్రారంభించారు. ‘సాక్షి’ ఆమెను వెతికి పట్టింది. మాట్లాడింది. ఆమె మాటలు వినండి... ‘‘నా పేరు బేబీ. నాకు సంగీతం అంటే ఏంటో కూడా తెలియదు. నేను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ఎవరైనా పాడుతుంటే విని పాడేదాన్ని. ఒక్క అక్షరం కూడా చదువుకోలేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ నా పాట ఇంతమందికి నచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది.మా అమ్మనాన్నలకి మేం ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. నేను పెద్ద అమ్మాయిని. నాన్న వెంకన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ దయాకరుణ కూలి పని చేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, కవలలు. హిమబిందు, ప్రియబిందు. వాళ్లకి పెళ్లిళ్లు అయిపోయాయి. ఇవాళ పెద్ద అమ్మాయి హిమబిందు డెలివరీ కోసం రాజమండ్రి ఆసుపత్రికి వచ్చాను. నేను అక్కడ నుంచే మీతో మాట్లాడుతున్నాను’ అందామె.
మా అమ్మమ్మ పాడేది...
మా అమ్మమ్మ చాలా బాగా పాడేదని మా అమ్మ చెప్పేది. నాకు బహుశా ఆవిడ నుంచి ఈ విద్య అబ్బిందేమో. ఫేస్‌బుక్‌లో నా పాట చూసి మా నాన్న, అమ్మ ఎంతో సంతోషించారు. నాకు ‘బొంబాయి’ చిత్రంలోని ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ పాట అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో పాట నేర్చుకునేదాన్ని. పొలం పనులు చేసుకుంటూ పాడేదాన్ని. చదువు లేకపోయినా నాకు దేవుడు జ్ఞాపకశక్తి ఇచ్చాడు. నా చిన్నప్పటి నుంచే అమ్మ నాన్నలు దగ్గర కూర్చోబెట్టుకుని, నేను పలికే వచ్చీరాని పదాలతోనే పాడించుకునేవారు. చేలల్లో బాగా పాడేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. కొన్ని పదాలు సరిగా పలకలేనేమోనని బెరుకుగా ఉండేది’ అంటారు పసల బేబీ.
మలుపు తిప్పిన రికార్డింగ్
ఒకసారి బట్టలకు గంజి పెట్టుకుని, పక్క వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో అమ్మాయి ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాట పాడుతోంది. ఆ అమ్మాయి వేదికల మీద ప్రదర్శనలిస్తుంది. ఆ అమ్మాయి పాటలో శృతి సరిగ్గా లేదనిపించింది. వెంటనే ఆ అమ్మాయితో ‘నువ్వు తప్పు పాడుతున్నావు, సరైన శృతిలో పాడితే బావుంటుంది’ అని సలహా ఇచ్చాను. వెంటనే ఆ అమ్మాయి నాతో పల్లవి చరణం పాడించింది. వీడియో షూట్ చేసి, నా అనుమతితో ఫేస్‌బుక్‌లో పెట్టింది. నా పాట విన్నాక మా ఆయన వజ్రరావు ‘నువ్వు వయసులో ఉన్నప్పుడే పాడితే బావుండేది. ఎంతో మంచి పేరు సంపాదించేదానివి. నా వల్ల నువ్వు పాడలేకపోయావేమో’ అని బాధపడ్డారు.
సినిమా వారు కూడా...
సినీ పరిశ్రమకు చెందినవారమంటూ బేబీకి చాలా ఫోన్లు వస్తున్నాయి. ‘సినిమాలలో పాడమని పుల్లయ్య పంతులు అనే ఆయన నాకు ఫోన్ చేశారు. కాని నేను వెళ్లడానికి కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల నేను రాలేను అని చెప్పాను. నాకు కూడా అందరిలోను పాడాలని, అందరూ మెచ్చుకోవాలని అనిపిస్తుంది కదా. ఆమె మాటల్లో ఒక్క అపశబ్దం లేదు, ఎక్కడా యాస లేదు, మాటల్లో దోషం లేదు. క్లిష్టమైన ఆలాపన, ఎక్కువ గమకాలు, పెద్ద పెద్ద సంగతులు ఉన్న ఒక పాట వినిపించారు. ఆ పాటలో సంగీత విద్వాంసుల మాదిరిగానే గమకాలను అలవోకగా, అద్భుతంగా పలికారు. తనను ప్రోత్సహిస్తే పాట కచేరీలు చేస్తానని ఎంతో ఉత్సాహంగా పలికారు పసల బేబీ.
ప్రస్తుతం
వడిసలేరు దగ్గర ఉన్న జీడిపప్పు ఫ్యాక్టరీలో పని చేసేవారు బేబీ. అక్కడ కొన్ని సమస్యలు తలెత్తడంతో పని మానేశారు. కొన్ని సంఘాల వారు వారి సమావేశాలకు పాటలు పాడమని కోరడంతో పాడుతున్నారు. ఒక్కో కచేరీకి ఎంతో కొంత డబ్బు ఇస్తున్నారు. అలా బేబీ తన జీవితం కొనసాగిస్తున్నారు.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment