
నిపా అంటే చాలు ఇప్పుడు అందరూ బెంబేలెత్తుతున్నారు. నిపా సోకితే సఫా అయిపోవలసిందేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు హోరెత్తుతున్నాయి. అయితే చాలా వైరస్‌లకు మందులు లేనట్టే నిపా వైరస్‌కూ చికిత్స లేనందున, ప్రస్తుతం ఇది చాలా చురుగ్గా ఉన్నందున, పైగా దీని గురించి వినడం ఇది మొదటిసారి కావడం వల్ల దీని గురించి ఇంతగా చర్చ జరుగుతోందంటున్నారు నిపుణులు.
కొత్తదేమీ కాదు...
దీని పేరు ఇప్పుడు మనకు కొత్తగా వినిపిస్తోంది కానీ... ఇది అంత కొత్తదేమీ కాదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్‌ఐవీ’ అంటుంటారు. మొదటిసారి ఇది 1998లో మలేసియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట ఒక్కసారిగా వ్యాపించడంతో అప్పట్నుంచి దీన్ని నిపా అంటున్నారు. ఆ తర్వాత ఇది 2004లో బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించింది. పైగా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నదాని ప్రకారం ఇది బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాదీ కనిపిస్తూనే ఉంది. ఈ ఏడాది మన దేశంలోని కేరళలో దీని తీవ్రత కనిపిస్తున్నందున, అన్ని వైరస్‌లలాగే దీనికి మందు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేనందున ప్రస్తుతం ఇది భారత్‌ను వణికిస్తోంది. ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది.
ఎలా వ్యాపిస్తుంది: ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వ్యాధి. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లనే గాక ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని అపోహ కొందరుæ పడుతుంటారు. అందువల్ల పై అంశాలను దృష్టిలో ఉంచుకొని, అప్పటికే కొరికి ఉన్న ఇలాంటి పండ్లను తినకపోవడమే మంచిది. ఇక ఈ వైరస్ పందుల నుంచి కూడా వ్యాపించడాన్ని గుర్తించారు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించింది.
నిర్ధారణ: ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణే)లో నిర్వహించే అలైజా పరీక్ష ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తున్నారు.
చికిత్స: ప్రస్తుతానికి ఈ వైరస్‌కు నేరుగా మందు లేదు. అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు ఉపశమనించడానికి మందులు ఇస్తుంటారు. ప్రస్తుతానికి అల్లోపతి విధానంలో నివారణే ఒక్కటే దీనికి మంచి మందుగా పరిగణించవచ్చు.
లక్షణాలేమిటి
ఈ వైరస్ సోకినప్పుడు అది మెదడును ప్రభావితం చేసి, ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు 24 – 48 గంటల్లో అది ఒక్కోసారి కోమాలోకి దించవచ్చు. అందుకే తీవ్రమైన తలనొప్పి వస్తుంటే ఇప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఇక అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లోలాగే జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కూడా ఉంటాయి. ఈ వైరస్ దీర్ఘకాలికంగా ఒంట్లో ఉన్నప్పుడు మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడబిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్) మాదిరిగా ఊపిరి అందకపోవచ్చు. ఆ తర్వాత రోగి స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లే అవకాశాలూ ఉన్నాయి. ఇది ఆ తర్వాత మరణానికి దారి తీయవచ్చు. అయితే కొందరిలో లక్షణాలు అంతగా కనిపించకుండానే అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పితో (మెదడువాపు కారణంగా) వెంటనే మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇలా జరగడం కాస్త అరుదు. ఒకరిద్దరిలో ఇలాంటివి సంభవిస్తే... అందరికీ అలాగే జరుగుతుందన్న అపోహతోనే ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులవుతున్నారు.
నివారణ
∙ఫ్రూట్ బ్యాట్స్ నుంచి, అవి కొరికిన పండ్ల నుంచి దూరంగా ఉండటం. ∙ఏదైనా కొరికి ఉన్నట్లుగా కనిపించిన ఏ పండునైనా తినకపోవడం ∙డేట్‌పామ్ జాతికి చెందిన తాటి, ఈత, ఖర్జూర జాతి పండ్లకు దూరంగా ఉండటం ∙వాటిల్లో ప్రాసెస్ చేయని రా పండ్లను తినకపోవడం ∙పందుల ఫామ్స్‌కూ, పందుల పెంపకందార్లకు దూరంగా ఉండటం ∙ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి కూడా దూరంగా ఉండటం ∙వీలైనంతవరకు దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు, సమూహాల్లోకి వెళ్తున్నప్పుడు ‘ఎన్ 95’ రకానికి చెందిన మాస్క్‌ను కట్టుకోవడం ద్వారా దీనికి దూరంగా ఉండవచ్చు. ఇక హెల్త్‌కేర్ రంగంలో ఉన్నవారు పైన పేర్కొన్న మాస్క్‌లు, గౌన్, క్యాప్ వంటి రక్షణ ఉపకరణాలను ధరించడం అవసరం. ఇక వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మలవిసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఏదైనా డోర్‌నాబ్స్‌ను ముట్టుకున్న తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి పర్సనల్ హైజీన్ చర్యల ద్వారా దీన్ని చాలావరకు నివారించవచ్చు. అలాగే పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
– డాక్టర్ కె. శివ రాజు
సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
ప్రత్యామ్నాయ చికిత్సలు
నిపా వైరస్‌కు ప్రస్తుతం ఇతర వైద్య చికిత్స విధానాల్లో నిర్దిష్టమైన మందు లేదు. అందువల్ల ప్రస్తుతం కొన్ని హోమియో మందులతో మనలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని దీన్ని ఎదుర్కోవచ్చు. హోమియో ఔషధాలైన 1) యూపరోటిరమ్ పెర్‌ఫోలియేటమ్–200 2) జెల్సీమియమ్ సెమ్‌పర్వియెరెన్స్–200 3) లెడమ్ పాలస్ట్రే–200 అనే ఈ మూడు రకాల గుళికలను ఒక్కొక్కటి రెండు చొప్పున మొత్తం ఆరు గుళికలను ఒక సగం గ్లాసులోని నీళ్లలో కరిగించుకొని రోజుకు రెండుసార్లు చొప్పున రెండు నుంచి మూడు రోజులు తాగాలి. దాంతో శరీరానికి రోగనిరోధక శక్తి సమకూరుతుంది. ఇది అన్ని రకాల సూక్ష్మజీవుల బారి నుంచి కాపాడుతుంది. నిపాతో పాటు మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది.
ఇక ఈ హోమియో మందులు కూడా దొరకని చిన్న పల్లెటూళ్లలో ఉండేవారు ఈ ఏడు రకాల ఆకులతోనూ వ్యాధి నిరోధకతను సాధించవచ్చు. అవి... 1) గరిక 2) తులసి 3) తిప్పతీగె (అమృతవల్లి) 4) బిల్వపత్రం 5) కానుగ 6) వేప 7) గులాబీ... ఈ ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. ఒక్కోరకం ఆకు తీసుకొని, దాన్ని 150 ఎమ్‌ఎల్ నీటిలో ఉడికించి, కషాయంలా కాచుకోవాలి. ఆ ద్రవాన్ని వడపోసి, అందులో కాస్తంత తాటిబెల్లం లేదా సాధారణ బెల్లం కలుపుకొని వేడిగా గానీ లేదా బాగా చల్లార్చి ఆ కషాయాన్ని తాగాలి. ఇలా ఒక్కొక్క ఆకు కషాయాన్ని రోజుకు రెండుసార్లు చొప్పున నాలుగు రోజుల పాటు తాగాలి. ఈ లెక్కన ఇక్కడ ప్రస్తావించిన 7 రకాల ఆకుల వరసను పూర్తి చేయడానికి 28 రోజులు పడుతుంది. ఇలా 28 రోజులు పూర్తయ్యాక మనకు లభించిన వ్యాధి నిరోధకత నిపాతో సహా చాలా రకాల వ్యాధుల నుంచి మనకు దాదాపు ఓ ఏడాదికాలం పాటు వ్యాధి
నిరోధకత సమకూరుతుంది.
– డాక్టర్ ఖాదర్ వలి
హోమియో వైద్యుడు, స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త,
ఆరోగ్య రంగ నిపుణులు, మైసూరు
Comments
Please login to add a commentAdd a comment